NTR vs Ram Charan: RRR హీరోల్లో 'బెస్ట్' ఎవరో తేలుస్తారా? ఇదే SIIMAకి అతి పెద్ద సవాల్!
సైమా అవార్డ్స్-2023 'బెస్ట్ యాక్టర్' కేటగిరీలో RRR నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారు. అగ్ర హీరోలిద్దరిలో ఈసారి ఎవరికి అవార్డు వరిస్తుందనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA - 2023) పురస్కారాల కోసం వివిధ కేటగిరీలలో పోటీ పడే సినిమాల జాబితాను ఇటీవలే ప్రకటించారు. అయితే ఇందులో 'బెస్ట్ యాక్టర్ మేల్' క్యాటగిరీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఈసారి ఉత్తమ నటుల నామినేషన్స్ లో RRR నుంచి ఎన్టీ రామారావు, రామ్ చరణ్ లు ఉన్నారు. వీరితో పాటుగా సిద్ధు జొన్నలగడ్డ (DJ టిల్లు), నిఖిల్ (కార్తికేయ 2), అడివి శేష్ (మేజర్), దుల్కర్ సల్మాన్ (సీతారామం) కూడా పోటీలో ఉన్నారు. ఎంతమంది ఉన్నా ట్రిపుల్ ఆర్ హీరోల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే వీరిద్దరిలో ఎవరు అవార్డ్ గెలుచుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో చరణ్, తారక్ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ నటించారు. అయినప్పటికీ ఎవరు 'పైచేయి' సాధించారు అనే విషయంలో హీరోల అభిమానుల మధ్య ఓ రేంజ్ లో ఫ్యాన్ వార్స్ జరిగాయి.. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ కు గ్లోబల్ ఆడియన్స్ ప్రశంసలు దక్కడం దగ్గర నుంచి, ఆస్కార్ అవార్డ్ రావడం వరకూ.. ప్రతీ దాంట్లో తమ హీరోదే ఆధిపత్యం అంటూ వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగడం మనం చూశాం. 'గ్లోబల్ స్టార్' ట్యాగ్ కోసం ఎంత రచ్చ చేశారో కూడా చూశాం.
అలానే HCA అవార్డ్స్ విషయంలో ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. యూఎస్ లో జరిగిన ఈవెంట్ లో చరణ్ మాత్రమే స్పాట్ లైట్ అవార్డ్ అందుకున్నారని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేసారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య నెట్టింట గొడవ జరిగింది. దీంతో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ రంగంలోకి దిగి, స్పాట్ లైట్ అవార్డ్ అనేది ప్రత్యేకంగా ఒక యాక్టర్ కి ఇచ్చింది కాదని క్లారిటీ ఇచ్చారు. RRR టీమ్ లో అందరికి వచ్చిందని, ప్రస్తుతం ఇండియాలో ఉన్న జూనియర్ N.T. రామారావుకి కూడా ఒక అవార్డు ఉందని తెలియజేయడంతో అంతా సర్దుకుంది.
'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వరించిన తర్వాత, ఆ క్రెడిట్ తమ హీరోదేనంటూ మెగా - నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఫైట్ చేసారు. ఇరు వర్గాల మధ్య ఇలాంటి ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో SIIMA అవార్డ్స్ రాబోతున్నాయి. సైమాను దక్షిణాదిలో ప్రతిష్టాత్మకఆ అవార్డ్స్ గా భావిస్తారు. ఇప్పుడు RRR హీరోలలో ఒకరికి పురస్కారం అందించి, ఇంకొకరికి ఇవ్వకపోతే ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరగడం ఖాయమని చెప్పాలి. ఎందుకంటే ఈ అవార్డుతో తారక్ - చెర్రీలలో 'బెస్ట్' ఎవరనేది అఫిషియల్ గా డిక్లేర్ చేసినట్లు అవుతుంది. ఇది కచ్ఛితంగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపినట్లే అవుతుంది.
Also Read: ఇవేం టైటిల్స్ సామీ.. పాన్ ఇండియా మోజులో వింత వింత పేర్లను తెలుగులోకి వదులుతున్నారుగా!
సైమా అవార్డులను ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి అనేది ఎలాగూ బయటపెట్టరు కాబట్టి, ఎంపికలో జ్యూరీ పాత్ర్ర ఎంత వరకూ ఉంటుందనేది తెలియదు. కాబట్టి అభిమానులు ఏవీ పట్టించుకోకుండా చివరికి జ్యూరీనే నిందిస్తారు. అందుకే ఈసారి అవార్డ్ ఎంపిక అనేది సైమా నిర్వాహకులకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. అందుకే ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అవార్డును ఇద్దరు హీరోలకు సమానంగా పంచి వివాదాలకు ఫుల్ స్టాప్ పెడతారా? లేదా ఇద్దరిలో ఒకరిని ఉత్తమ నటుడిగా నిర్ణయిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
నిజానికి RRR హీరోలలో ఎవరు బెస్ట్ అనేది నిర్ణయించడం ఒక్క సైమాకే కాదు, రాబోయే రోజులలో ఇచ్చే అన్ని ప్రతిష్టాత్మక అవార్డులకు కూడా పెద్ద సవాలే. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ కే ఈ తిప్పలు తప్పలేదు. అలాంటిది ఇక్కడ ఇండియాలో ప్రధానం చేసే అవార్డుల విషయంలో జరగదని అనుకోలేం. ఏదేమైనా ఈసారి సైమా ఉత్తమ నటుడి అవార్డు కోసం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మధ్య పోటీ హోరాహోరీగా ఉండబోతోంది. మరి అవార్డు ఎవరికి సొంతం అవుతుందనేది వేచి చూడాలి.
SIIMA - 2023 అవార్డ్స్ వేడుక సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరపడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణాదిలోని తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాలు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Also Read: Nag Next: కింగ్ మరో కొరియోగ్రాఫర్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial