Vishwak Sen: నిజంగానే నన్ను అఘోర అనుకొని అలా చేశారు - విశ్వక్ సేన్
Gaami Movie: యంగ్ హీరో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటించిన చిత్రమే ‘గామి’. తాజాగా ఈ సినిమా కోసం తాము ఎంత కష్టపడ్డారో బయటపెట్టింది టీమ్. అఘోరాగా తన ఎక్స్‌పీరియన్స్ పంచుకున్నాడు విశ్వక్.
Vishwak Sen about Gaami: యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎప్పుడూ కొత్త కొత్త కథలు, కొత్త కొత్త పాత్రలు చేయడానికే ప్రయత్నాలు చేస్తుంటాడు. కొన్ని సినిమాల్లో హీరోగా నటించి.. ఆ అనుభవంతోనే దర్శకుడిగా, నిర్మాతగా కూడా మారాడు. ఇప్పుడు ‘గామి’ అనే కొత్త రకమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ విద్యాధర్ తెరకెక్కించాడు. ఇప్పటివరకు విడుదలయిన ‘గామి’ పోస్టర్స్ చాలా వినూత్నంగా అనిపించడంతో ఈ మూవీపై మరింత క్లారిటీ ఇవ్వడానికి, దీనికి సంబంధించిన అనుభవాలను పంచుకోవడానికి మూవీ టీమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
డైరెక్ట్ కాల్ చేశాడు..
తాజాగా జరిగిన ‘గామి’ ప్రెస్ మీట్‌లో ప్యాషన్, పిచ్చి ఉంటేనే ఇలాంటి సినిమా తీయగలరు అని యాంకర్ అనగా.. ‘‘సినిమా ఛాన్సులు లేకపోతే కూడా చేస్తారు’’ అంటూ విశ్వక్ సేన్ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ మూవీ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘వారణాసిలో గామి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫోన్‌లో ఫలక్‌నామా దాస్ టీజర్ కట్ చేసుకుంటూ కూర్చునేవాడిని. అక్కడ నుండే ఆన్‌లైన్ ఎడిటింగ్ చేసుకుంటూ ఈ సినిమా చేశాను. ఇంకా ఫలక్‌నామా దాస్ రిలీజ్ అవ్వలేదు అప్పటికీ. విద్యాధర్ డైరెక్ట్ నాకు కాల్ చేసి నీతో సినిమా అనుకుంటున్నాం. ఆఫీస్‌కు రమ్మంటే వెళ్లి సినిమా కోసం తన ప్రిపరేషన్ అంతా చూశాను’’ అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.
పక్కకు వెళ్లి నవ్వుకున్నా..
‘‘తన ఆఫీస్ చూస్తేనే అర్థమయిపోయింది. సినిమాలో అంత వివరంగా ఉండకపోవచ్చు. కానీ క్యారెక్టర్ల గురించి రీసెర్చ్.. ఇలా చాలా సమాచారం అంతా తన ఆఫీస్‌లోనే ఉంది. స్క్రిప్ట్ కూడా భగవద్గీత అంత పెద్దగా ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు నా ఇంట్లో ఎదురుగా చైర్ వేసుకొని కూర్చున్నాడు. అందుకే మొత్తం చదివాను. వాళ్లు ఒక బడ్జెట్‌లో సినిమా ప్రారంభించాలని అనుకున్నారు. నేను పక్కకు వెళ్లి నవ్వుకున్నా. కానీ వాళ్లకు మాత్రం ఏం చెప్పలేదు. చాడీలు చెప్తే సినిమా ఆపేస్తారని ముందు అయితే మునుగుదాం అనుకున్నాను. రెండున్నర ఏళ్లు కష్టపడ్డాం. కచ్చితంగా ఈ సినిమాకు సమయమే పెట్టుబడి. టైమ్ ఉంది కాబట్టి బడ్జెట్‌లోనే గ్రాఫిక్స్ బాగా చేయగలిగాం. కానీ దర్శకుడు చెప్పిందంతా వింటుంటే కొత్తగా అనిపిస్తుంది. మేము పడిన కష్టాలు నాకేం గుర్తులేవు’’ అంటూ ‘గామి’ స్రిప్ట్ తన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యాడో షేర్ చేసుకున్నాడు విశ్వక్.
ధర్మం చేశారు..
‘‘కుంభమేళలో నేను నిజంగా అఘోర అనుకొని ఇద్దరు, ముగ్గురు వచ్చి నాకు డబ్బులు ధర్మం చేశారు. వారణాసిలో ఒక షాట్‌లో ఒక దగ్గర కూర్చొని వణుకుతూ ఉంటే.. ఓ ముసలావిడ వచ్చి నాపై జాలిపడి ఫుడ్ ఇచ్చింది. చాలా ఎంజాయ్ చేశాను అదంతా. ఎందుకంటే జనాలు నిజంగానే నేను అఘోర అని నమ్మేశారు అనిపించింది. ట్రైలర్ చూశాను. అది విడుదలయిన అరగంట, గంటలో గట్టిగా స్పందన వస్తుంది. ప్రపంచానికి ఈ ట్రైలర్ చూపించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అంటూ ‘గామి’ షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాడు విశ్వక్. అంతే కాకుండా ముందుగా తను నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మార్చి 8న విడుదల చేయాలని అనుకున్నా.. ఆ స్థానంలోకి ‘గామి’ వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు.
Also Read: విజయ్ రాజకీయ పార్టీపై ఉపాసన కామెంట్స్ - ఆమె కూడా రాజకీయాల్లోకి వస్తారా?