(Source: ECI/ABP News/ABP Majha)
Vijay Antony Daughter : ఆత్మహత్య చేసుకున్న విజయ్ ఆంటోనీ కుమార్తె - విషాదంలో చిత్రసీమ
సంగీత దర్శకుడు, తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన కథానాయకుడు విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన తమిళ కథానాయకుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె ఆత్మహత్య (Vijay Antony Daughter Suicide) చేసుకున్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
విజయ్ ఆంటోనీ కుమార్తె పేరు మీరా. ప్రస్తుతం ఆమె వయసు 16 ఏళ్ళు. చెన్నైలో గల ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నారు. విజయ్ ఆంటోనీ కుటుంబం డిడికె రోడ్‌లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో మీరా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. మార్కులు, ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు సమాచారం అందుతోంది. ప్రభుత్వ అధికారులు అసలు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
చెన్నైలోని తేనాంపేట పోలీసులు మీరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిటీలోని ఓమంతురార్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయ్ ఆంటోనీ తమిళుడు అయినప్పటికీ... తెలుగు ప్రేక్షకులు ఆయనను మనలో ఒకరిగా చూస్తున్నారు. తొలుత సంగీత దర్శకుడిగా ఆయన పరిచయం అయినా సరే... కథానాయకుడిగా వరుస విజయాలు అందుకున్నారు. శ్రీకాంత్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'మహాత్మ' సినిమాకు ఆయన సంగీతం అందించారు. అందులో పాటలు పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత రవితేజ 'దరువు' సినిమాకు కూడా సంగీతం అందించారు.
Also Read : ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?
తెలుగు విజయ్ ఆంటోనీ అంటే 'బిచ్చగాడు'. 'బిచ్చగాడు' అంటే విజయ్ ఆంటోనీ. ఆ సినిమా అంత ప్రభావం చూపించింది. ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బిచ్చగాడు' భారీ విజయం సాధించింది. విజయ్ ఆంటోనీకి తెలుగునాట స్టార్ స్టేటస్ అందించింది. ఆ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన పలు చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యాయి. కొన్ని విజయాలు సాధించాయి కానీ 'బిచ్చగాడు' స్థాయి హిట్ ఏదీ లేదు. అయితే, ఈ ఏడాది 'బిచ్చగాడు 2'తో విజయ్ ఆంటోనీ మరో భారీ హిట్ అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల పరంగా ఆయన కెరీర్ హయ్యస్ట్ గ్రాస్ నమోదు చేసింది.
Also Read : 'ఎంవై 3' వెబ్ సిరీస్ రివ్యూ : రోబోగా, హీరోయిన్‌గా హన్సిక డ్యూయల్ రోల్ - హిట్టా? ఫట్టా?
గమనిక : తమిళ చలన చిత్రసీమలో జరిగిన ఓ విషాదాన్ని పాఠకులకు తెలియజేయడం మాత్రమే ఈ కథనం ఉద్దేశం. జీవితంలో సుఖదుఃఖాలు, ఆందోళనలు, బాధలు ఉంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. అంతే కానీ, ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు. క్షణికావేశంలో గానీ, బాధలో గానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒత్తిడికి లోనయితే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial