Jackky Bhagnani: ఆ స్టార్ హీరోలకు షాకిచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ భర్త - ఇంకా వాళ్లకు రెమ్యునరేషన్ ఇవ్వలేదట!
Jackky Bhagnani: జాకీ భగ్నానీ, వాషు భగ్నానీ నిర్మాణ సంస్థ పూజా ఎంటర్‌టైన్మెంట్ నిర్మించిన ‘బడే మియా చోటే మియా’ మూవీలో నటించిన స్టార్లకు రెమ్యునరేషన్ అందలేదని బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Jackky Bhagnani - Vashu Bhagnani: బాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన పూజా ఎంటర్‌టైన్మెంట్ గురించి గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాషు భగ్నానీ స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ.. ఒక్కసారిగా రూ.250 కోట్ల నష్టంలోకి వెళ్లిపోయిందనే విషయంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక పూజా ఎంటర్‌టైన్మెంట్ నిర్మించిన పలు భారీ బడ్జెట్ చిత్రాలు మినిమమ్ కలెక్షన్స్ రాబట్టకపోవడంతో యాక్టర్లకు కూడా రెమ్యునరేషన్ అందలేదనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ‘బడే మియా చోటే మియా’లో నటించిన స్టార్లకు ఇంకా పారితోషికాన్ని అందించలేదట పూజా ఎంటర్‌టైన్మెంట్.
రెమ్యునరేషన్ అందలేదు..
‘బడే మియా చోటే మియా’లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. ఇద్దరూ యాక్షన్ హీరోలు చేస్తున్న మల్టీ స్టారర్ చిత్రం కావడంతో ఈ మూవీపై బాగానే ఖర్చుపెట్టింది పూజా ఎంటర్‌టైన్మెంట్. పైగా ప్రమోషన్స్ విషయంలో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఖర్చుచేసింది. ఈ మూవీలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌తో పాటు సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలాయా ఎఫ్, పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. స్టార్ క్యాస్టింగ్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మినిమమ్ కలెక్షన్స్ సాధించలేకపోయింది. దీంతో ఇందులో నటించిన చాలామంది నటీనటులకు అసలు రెమ్యునరేషన్ అందలేదని వార్తలు తాజాగా వైరల్ అవుతున్నాయి.
స్పందన లేదు..
‘బడే మియా చోటే మియా’ కోసం ముందుగా టైగర్ ష్రాఫ్‌కు రెమ్యునరేషన్ అందలేదట. దీని గురించి అతను పూజా ఎంటర్‌టైన్మెంట్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడానికి ఇష్టపడలేదట. కానీ ఈ సినిమా కోసం కష్టపడిన స్టాఫ్‌కు కూడా తమ వేతనాలు అందలేదని తెలియడంతో టైగర్ ష్రాఫ్ ముందుగా అందరి పేమెంట్స్‌ను క్లియర్ చేయాలని అడగడం మొదలుపెట్టాడని సమాచారం. ఇక సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలాయా సైతం తమ రెమ్యునరేషన్ ఇవ్వమని పలుమార్లు నిర్మాణ సంస్థను సంప్రదించిన వారి నుండి ఎలాంటి స్పందన లేదని బాలీవుడ్ మీడియా అంటోంది. ఈ ముగ్గురు భామలు.. సినిమా ప్రమోషన్స్‌లో కూడా యాక్టివ్‌గా పాల్గొన్నా ఎలాంటి లాభం లేకుండా పోయిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
నిర్మాతగా ఫెయిల్..
1995లో పూజా ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో మూవీ ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టాడు వాషు భగ్నానీ. తను నిర్మాతగా పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ఆ తర్వాత నిర్మాణ సంస్థ బాధ్యతలను తన కుమారుడు, రకుల్ ప్రీత్ సింగ్ భర్త అయిన జాకీ భగ్నానీకి అప్పగించాడు. కానీ జాకీ భగ్నానీ నిర్మాతగా మారి తెరకెక్కిన పలు భారీ బడ్జెట్ చిత్రాలు హిట్ అవ్వలేకపోయాయి. కొన్నిరోజుల క్రితం తమ సంస్థలో పనిచేస్తున్న కొందరు జీతాలు అందడం లేదని ఓపెన్‌గా స్టేట్‌మెంట్స్ ఇవ్వడంతో పూజా ఎంటర్‌టైన్మెంట్ పరిస్థితి ఎలా ఉందో బయటికొచ్చింది. దీంతో ఉద్యోగులు ఎవరూ కంగారుపడవద్దని వాషు భగ్నానీ హామీ ఇచ్చినట్టు సమాచారం.
Also Read: చిక్కుల్లో రకుల్ ప్రీత్ సింగ్ - ఉద్యోగుల తొలగింపు, అమ్మకానికి ఆఫీస్.. అసలు ఏమైంది?