Ravi Teja : 'టైగర్...' సెట్స్‌లో రవితేజకు యాక్సిడెంట్ - 16 కుట్లు పడినా సరే!
దసరాకు విడుదలవుతున్న 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాలో మాస్ మహారాజా రవితేజకు గాయాలు అయ్యాయి. ఆ ఘటన గురించి దర్శకుడు వంశీ ఏం చెప్పారంటే?
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన సినిమా 'టైగర్ నాగేశ్వర రావు' (Tiger Nageswara Rao). ఆంధ్రా రాబిన్ హుడ్ అని పేరు పొందిన గజ దొంగ, పోలీసులతో పాటు ప్రభుత్వాలను గడగడలాడించిన స్టూవర్టుపురం నాగేశ్వర రావు జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఇది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే... రవితేజ డేర్ డెవిల్ స్టంట్స్ చేశారని అర్థం అవుతోంది. అవి చేసేటప్పుడు ఆయన గాయాల పాలు కూడా అయ్యారని దర్శకుడు వంశీ తెలిపారు.
ఇంజ్యూరీ అయితే పదహారు కుట్లు పడ్డాయి...
చికిత్స తీసుకుని షూటింగ్ చేసిన రవితేజ!
'టైగర్ నాగేశ్వర రావు' చిత్రీకరణలో జరిగిన ప్రమాదం గురించి బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ వివరించారు. ''మేం ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నాం. దాని కోసం 60 అడుగుల ఎత్తులో సెట్ రూపొందించాం. మీరు సినిమా టీజర్ చూస్తే... అందులో ఫస్ట్ షాట్ అదే! రవితేజ బ్రిడ్జ్ మీద నుంచి కిందకు దూకుతారు కదా! మేమంతా షూటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం. రవితేజ వచ్చారు. కిందకు దూకారు. స్టంట్ మ్యాన్ బ్యాలన్స్ తప్పారు. దాంతో రవితేజకు లెన్స్ తగిలాయి. మొదటి రోజు అలా జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి! ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుని మళ్ళీ వచ్చి షూటింగ్ చేశారు'' అని వంశీ తెలిపారు.
రక్తం కారుతున్నా ఏం కాలేదన్నారు!
చిత్రీకరణలో రవితేజకు గాయం అయిన వెంటనే ఆయన దగ్గరకు తాను పరుగులు తీశానని వంశీ వివరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''షూటింగ్ మొదలైన రోజు స్టార్ హీరోకి యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి! నేను ఆయన దగ్గరకు వెళ్లే సరికి రక్తం కారుతోంది. రవితేజ గారు చాలా కూల్ గా 'ఏం కాలేదు' అని అంటున్నారు. నాలో భయం మొదలైంది. ఆయన మోకాలికి జిమ్మీ జిబ్ బలంగా తగిలింది. మూడు అంగుళాలు లోపలికి వెళ్ళింది. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుని మర్నాడు షూటింగుకు వచ్చారు. పదహారు కుట్లతో వచ్చి షూటింగ్ చేశారు'' అని చెప్పారు.
Also Read : 48 ఏళ్ళ వయసులో కాలేజీ స్టూడెంట్‌గా సూర్య?
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వర రావు'. 'కశ్మీర్ ఫైల్స్', 'కార్తికేయ 2' విజయాల తర్వాత ఆయన నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. మధ్యలో రవితేజతో ధమాకా కూడా నిర్మించారు. ఈ చిత్రానికి వంశీ దర్శకుడు. అక్టోబర్ 20న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. మన దేశంలో 65 స్క్రీన్లలో సైన్ లాంగ్వేజ్ వెర్షన్ కూడా రిలీజ్ అవుతోంది.
Also Read : 'గాడ్' రివ్యూ : హీరోని సైకో కిల్లర్ టార్గెట్ చేస్తే? - 'జయం' రవి, నయనతార సినిమా హిట్టా? ఫట్టా?
'టైగర్ నాగేశ్వర రావు' సినిమాలో రవితేజకు జోడీగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్ (Nupur Sanon), 2018లో ఫెమినా మిస్ ఇండియా టాప్ 10 కంటెస్టెంట్లలో ఒకరైన గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj) నటించారు. హేమలతా లవణం పాత్రలో రేణూ దేశాయ్, మరో కీలక పాత్రలో తమిళ బ్యూటీ అనుకీర్తి వ్యాస్ నటించారు. ఇంకా నాజర్, హరీష్ పేరడీ, జిష్షుసేన్ గుప్తా, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ఆర్. మది, సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar), ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సంభాషణల రచయిత : శ్రీకాంత్ విస్సా, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial