Actor Kiccha Sudeep: కన్నడ హీరో కిచ్చా సుదీప్ బెదిరింపు లేఖల వ్యవహారం, ఇదంతా మాజీ డ్రైవర్ పనేనా?
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు బెదిరింపు లేఖలు వ్యవహారం కన్నడ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. అటు ఇండస్ట్రీలోనూ ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.
Actor Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు బెదిరింపు లేఖలు వ్యవహారం కన్నడ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. అటు ఇండస్ట్రీలోనూ ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే కన్నడ హీరో కిచ్చా సుదీప్ కర్ణాటక సీఎం అభ్యర్థి బసవరాజ్ బొమ్మై సమక్షంలో తాను బీజేపీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాను బీజేపీకి మద్దతు ప్రకటించిన కొన్ని గంటలకే ఆయనకు బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశంగా మారింది. ‘‘నువ్వు బీజేపీలో చేరితే నీ వ్యక్తిగత వివరాలు, వీడియోలు, ఫోటోలను బహిరంగంగా ప్రజలందరి ముందు పెడతాం’’ అంటూ కొందరు బ్లాక్ మెయిల్ లేఖలు రాశారు. దీంతో దీనిపై ఆయన మేనేజర్ మంజునాథ్ పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ కు కేసు
ఈ లేఖలు వ్యవహారం కిచ్చా సుదీప్ నివాసంలో మార్చి 10 న బయటపడింది. తర్వాత మార్చి 29 న దీనిపై ఆయన మేనేజర్ మంజునాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మొదట్లో దీని గురించి మంజునాథ్ ను మీడియా ప్రశ్నించినపుడు ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఇది పాత విషయమే అని పేర్కొన్నారు. అయితే తదుపరి విచారణ కోసం ఈ కేసును సీసీబీ కు అప్పగించారు. సుదీప్ బీజేపీకు మద్దతు ప్రకటిస్తారని తెలిసే కొన్ని గంటల ముందు ఈ లేఖలను బహిరంగపరిచారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులను ఎవరు అనేదానిపై సీసీబీ దృష్టి పెట్టింది.
మాజీ కారు డ్రైవర్ పనేనా?
ఈ కేసుపై సీసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. రాజకీయం, సినిమా రంగాల యాంగిల్ లో కూడా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. అయితే ప్రధానంగా సినిమా రంగం కోణంలోనే ఎక్కువగా పరిశోధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుదీప్ అండ్ టీమ్ కు ఓ వ్యక్తిపై అనుమానం ఉందట. సుదీప్ ఇటీవలే ఓ కారు డ్రైవర్ ను పనిలోనుంచి తీసేశారట. దీంతో కక్ష్య పెంచుకున్న ఆ కారు డ్రైవర్ నే ఇదంతా చేసి ఉంటాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారట. అయితే ఈ కేసును సీసీబీకు అప్పగించిన తర్వాత ఆ కారు డ్రైవర్ ఫోన్ స్విఛ్ ఆఫ్ రావడం గమనార్హం. దీంతో పోలీసులు ఆ కారు డ్రైవర్ ను వెతికే పనిలో పడ్డారని సమాచారం. అయితే డ్రైవర్ మాత్రమే ఈ పని చేశాడా లేదా ఇంకా ఎవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట.
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన సుదీప్
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక అధికార బీజేపీ సీఎం అభ్యర్థి బొమ్మై ఎలాగైనా ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ గ్లామర్ ను కూడా వాడుకున్నారు. అయితే ఇటీవల కిచ్చా సుదీప్ బీజేపీలోకి చేరతాను అనే వ్యాఖ్యలతో అక్కడ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. కానీ తర్వాత దానిపై వివరణ ఇస్తూ.. ‘‘నేను కేవలం బీజేపీ కోసం ప్రచారం చేస్తాను. కానీ ఎన్నికల్లో పోటీ చేయను. సీఎం బొమ్మై కోసం ఇది చేస్తున్నాను. ఆయన చెప్పినవారందరికీ ప్రచారం చేస్తాను’’ అని క్లారిటీ ఇవ్వడంతో కన్నడ పాలిటిక్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
Also Read: బాబోయ్! ప్రేమ కోసం రాజశేఖర్‌ను జీవిత బ్రిడ్జి మీది నుంచి తోసేసిందా?