పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'తొలిప్రేమ' రీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గా నిలిచిన 'తొలిప్రేమ' మూవీ రీ రిలీజ్ కాబోతోంది.
టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే కదా. అగ్ర హీరోల గత సినిమాలు మళ్లీ థియేటర్స్ లో సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ రీ రిలీజ్ సినిమాల లిస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్గ్రీన్ లవ్ స్టోరీ 'తొలిప్రేమ' సినిమా కూడా చేరింది. పవన్ కళ్యాణ్ కి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చేసిన సినిమా ఇది.
1998 జులై 24న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు అవార్డ్స్ సైతం గెలుచుకుంది. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ కరుణాకరన్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించగా.. వాసుకి, వేణుమాధవ్, అలీ, నగేష్, అచ్యుత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ఎవర్గ్రీన్ లవ్ స్టోరీ మరోసారి థియేటర్స్ లో సందడి చేయబోతోంది. 'తొలిప్రేమ' విడుదలై 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాను జూన్ 30 రీరిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు.
సినిమా విడుదలై ఇన్నేళ్లు అవుతున్నా సినిమాపై యూత్ లో ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ 4K టెక్నాలజీతో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఈ సినిమాను భారీగా విడుదల చేసేలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 300కు పైగా థియేటర్స్ లో 'తొలిప్రేమ' మూవీ 4k వెర్షన్తో రీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సిన్సియర్ లవర్ గా పవన్ కళ్యాణ్ యాక్టింగ్, మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. దేవా సంగీతం అందించిన ఈ సినిమా పాటలు అప్పట్లో మ్యూజిక్ లవర్స్ ని ఉర్రూతలూగించాయి. అంతేకాకుండా 1998 లో బెస్ట్ తెలుగు మూవీ గా 'తొలిప్రేమ' ఏకంగా నేషనల్ అవార్డుని అందుకుంది. దీంతోపాటు ఆరు నంది అవార్డులు కూడా దక్కించుకుని అప్పట్లోనే సరికొత్త రికార్డులు నెలకొల్పింది. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న 'తొలిప్రేమ' ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ అయింది.
అంతేకాదు తమిళంలో శ్రీకాంత్, భూమిక జంటగా నటించిన 'రోజాకుట్టం' అనే సినిమాని తొలిప్రేమ మూవీ ఆధారంగా తీశారు. ఇక ఇదే తొలిప్రేమ టైటిల్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన 'ఖుషి', 'జల్సా' సినిమాలు రీ రిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక ఇప్పుడు 'తొలిప్రేమ' కూడా దాని కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నట్లు పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. సముద్ర ఖని దర్శకత్వంలో 'బ్రో' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు 'హరిహర వీరమల్లు', 'ఓ జి', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్.
Also Read: పాపం వరుణ్ సందేశ్ - చివరకు డ్యాన్స్ టీమ్‌ను పరిచయం చేసే స్థాయికి...