Guntur Kaaram Vs HanuMan Collections: నెగటివ్ టాక్‌లోనూ ‘హనుమాన్’ను మించిపోయిన ‘గుంటూరు కారం’ వసూళ్లు - ఏ మూవీకి ఎంత వచ్చాయంటే?
Guntur Kaaram Vs HanuMan Collections: మహేశ్ బాబు, తేజ సజ్జా.. ఒకేరోజు తమ సినిమాలను విడుదల చేశారు. ఇక ఎవరి కెపాసిటీని బట్టి వారి సినిమాలకు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.
Guntur Kaaram Vs HanuMan Collections: సంక్రాంతి కానుకగా జనవరి 12న రెండు సినిమాలు ‘హనుమాన్’, ‘గుంటూరు కారం’ విడుదలయ్యాయి. ఈ విడుదల తేదీని పోస్ట్‌పోన్ చేసుకోమని అందరూ సలహాలు ఇచ్చినా.. ఈ రెండు సినిమాలు మాత్రం ఒకేరోజు పోటీకి సిద్ధమని థియేటర్లలో అడుగుపెట్టాయి. ఇక టాక్ ఎలా ఉన్నా.. మహేశ్ బాబులాంటి సూపర్ స్టార్ నటించిన సినిమా కాబట్టి ‘గుంటూరు కారం’కు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ‘హనుమాన్’ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తూ కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతోంది. విడుదలయ్యి మూడు రోజులు అయ్యింది, ఫస్ట్ వీకెండ్ కూడా అయిపోయింది. దీంతో ఈ రెండు మూవీ కలెక్షన్స్‌ను పోల్చి చూస్తున్నారు ఫ్యాన్స్.
‘గుంటూరు కారం’ కలెక్షన్స్
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ మూడు రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను టచ్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే రూ.108 కోట్లను రాబట్టింది ఈ సినిమా. ఆ తర్వాత కర్ణాటక నుండి రూ.23 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిన ‘గుంటూరు కారం’.. ఓవర్సీస్ నుండి రూ.33 కోట్లను అందుకుంది. సండే రన్ పూర్తయ్యేసరికి ‘గుంటూరు కారం’కు రూ. 164 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ప్రతీరోజు ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వస్తున్నాయి అనే విషయాన్ని స్వయంగా ‘గుంటూరు కారం’ మేకర్సే సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తున్నారు. ‘రమణగాడి’ బ్లాక్‌బస్టర్ పేరుతో ‘గుంటూరు కారం’ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
‘హనుమాన్’ కలెక్షన్స్..
‘హనుమాన్’ కూడా ఏ మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా కలెక్షన్స్ రాబడుతోంది. మూడురోజుల్లో ఈ మూవీ రూ.75 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. త్వరలోనే రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. మొదటిరోజు ‘హనుమాన్’కు రూ.21.35 కోట్లు, రెండోరోజు రూ.29.72 కోట్లు, మూడోరోజు రూ.24.16 కోట్లు లభించాయి. ఫస్ట్ డే ‘హనుమాన్’ కలెక్షన్స్ మెల్లగానే ప్రారంభమయినా.. మెల్లగా పాజిటివ్ టాక్‌తో వేగం పుంజుకుంది. ఇక ఈ మూవీ హిందీ వర్షన్ విషయానికొస్తే.. ఫస్ట్ వీకెండ్‌లోనే ‘కేజీఎఫ్ చాప్టర్ 1’, ‘కాంతార’లాంటి రికార్డులను బ్రేక్ చేసింది.
అంచనాలను అందుకోలేకపోయింది..
హనుమంతుడి లాంటి దేవుడిని తీసుకొని సూపర్ హీరోలాంటి సినిమాను తెరకెక్కించాలనే విభిన్న ఆలోచనతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన ఆలోచనకు, సినిమా తెరకెక్కించిన విధానానికి, విజువల్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో ‘జాంబీ రెడ్డి’ అనే మూవీ వచ్చి సూపర్ హిట్‌ను సాధించింది. ఇక ఈ మూవీ వారి కాంబినేషన్‌లో రెండో హిట్‌గా నిలిచింది. ‘గుంటూరు కారం’ విషయానికొస్తే.. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజే వేరు. అందుకే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. కానీ ఎక్కడో ఆ అంచనాలకు అందుకోవడంలో ‘గుంటూరు కారం’ ఫెయిల్ అయినట్లు రివ్యూలు చెబుతున్నాయి.
Also Read: ‘బుక్ మై షో’పై ‘గుంటూరు కారం’ లీగల్ యాక్షన్ - ఫేక్ ఓట్లే కారణం!