HanuMan Postponed: వెనక్కి తగ్గిన హను-మాన్, వాయిదా ఎందుకంటే?
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'హను-మాన్'. మే 12న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కావాల్సిన ఈ సూపర్ హీరో సినిమాని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హను-మాన్'. 'జాంబీ రెడ్డి' వంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ఇది ఫస్ట్ పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రమోషనల్ కంటెంట్ తోనే హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రాన్ని మే 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆ మధ్య అనౌన్స్ చేసారు. అయితే విడుదల సమయం దగ్గర పడుతున్నా, ఇంతవరకూ ప్రమోషన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.
'హను-మాన్' సినిమా విడుదలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బెస్ట్ అవుట్ ఫుట్ అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ''హనుమాన్ టీజర్ పట్ల మీరు చూపించిన అమితమైన ప్రేమ మా హృదయాలను హత్తుకుంది. అలానే బెస్ట్ అవుట్ కమ్ అందించే బాధ్యతను రెట్టింపు చేసింది. అందరికీ నచ్చే ఒక మంచి చిత్రాన్ని అందిస్తామని మేము మీకు ప్రామిస్ చేస్తున్నాము. లార్డ్ హనుమంతునికి పరిపూర్ణమైన గీతంగా, అందరూ సెలెబ్రేట్ చేసుకునేలా ఈ సినిమా నిలుస్తుంది. హను-మాన్ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీద చూపించడానికి మేం ఎదురుచూస్తున్నాం. కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాం. జై శ్రీరామ్'' అని మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు.
— Prasanth Varma (@PrasanthVarma) May 5, 2023
కాగా, కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జోనర్లలో సినిమాలు రూపొందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. 'అ' 'కల్కి' 'జాంబిరెడ్డి' చిత్రాలతో కమర్షియల్ సక్సెస్ సాధించాడు. ఈ క్రమంలో ఇప్పుడు 'హను-మాన్' తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని సృష్టిస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడానికి, ముందుగా తేజతో కలిసి అంజనాద్రి అనే అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని తెర మీద ఆవిష్కరిస్తున్నాడు.
'హను-మాన్' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లిమ్స్, క్యారక్టర్ పోస్టర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇదే క్రమంలో వచ్చిన టీజర్ యూట్యూబ్ లో మిలియన్ల కొలదీ వ్యూస్ రాబట్టి, సినిమాపై అంచనాలు పెంచేసింది. ఒక సాధారణ యువకుడైన హనుమంతు కొన్ని అతీంద్రియ శక్తులతో సూపర్ హీరోగా మారి ఏం చేసాడనేది ఈ టీజర్ లో చూపించారు.
ఇందులో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా.. విలన్ గా వినయ్ రాయ్ కనిపించనున్నారు. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, రాజ్ దీపక్ శెట్టి ఇతర పాత్రలు పోషించారు. గౌరహరి సంగీతం సమకూరుస్తుండగా.. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. శ్రీనాగేంద్ర తంగళ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తుండగా.. ఎస్బీ రాజు తలారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. 'హను-మాన్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.