Ashlesha Thakur Telugu Debut : తెలుగు తెరకు 'ఫ్యామిలీ మ్యాన్' కుమార్తె - అగ్ర నిర్మాత అండతో...
అమెజాన్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'లో హీరో కుమార్తెగా నటించిన అశ్లేషా ఠాకూర్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఆ సినిమాకు అగ్ర నిర్మాత కెఎస్ రామారావు అండగా ఉన్నారు.
'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ చూశారా? అందులో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి కుమార్తెగా నటించిన అమ్మాయి అశ్లేషా ఠాకూర్ (Ashlesha Thakur) గుర్తు ఉన్నారా? ఇప్పుడు ఆ అమ్మాయి తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఆ సినిమాకు అగ్ర నిర్మాత కె.ఎస్. రామారావు అండగా ఉన్నారు.
కర్ణాటకలో ఓ మారుమూల ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన పిరియాడికల్ సినిమా 'శాంతల'. 'ఎవరు', అనుపమా పరమేశ్వరన్ 'బటర్ ఫ్లై', 'ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గాళ్' సినిమాల ఫేమ్ నిహాల్ కోదాటి (Nihal Kodhaty) హీరో. అశ్లేషా ఠాకూర్ హీరోయిన్. ఈ చిత్రానికి శేషు పెద్దిరెడ్డి దర్శకుడు. యిర్రంకి సుబ్బలక్ష్మి సమర్పణలో ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై డా. యిర్రంకి సురేష్ నిర్మించారు. కెఎస్ రామారావు నిర్మాణ పర్యవేక్షణలో సినిమా రూపొందింది. ఈ చిత్రానికి 'సీతా రామం' ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. సినిమాలో రెండు పాటలను మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు.
ఆరు భాషల్లో సినిమా చేశాం! - కెఎస్ రామారావు
క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు మాట్లాడుతూ ''ఈ చిత్ర నిర్మాత అమెరికాలో ఉంటున్నారు. ఆయనకు కథ నచ్చింది. ఇక్కడికి వచ్చి చేయడం కష్టం కనుక నిర్మాణ బాధ్యతలు నన్ను చూసుకోమని అడిగారు. చిన్న సినిమాల సక్సెస్ రేట్ బాలేదని ఆసక్తి చూపించలేదు. ఓటీటీలో అయినా ఎంతో కొంత వర్కవుట్ కాకపోతుందా? నిర్మాత నమ్మంగా ఉన్నారు. పైగా, నా సారథ్యంలో ముందుకు వెళతామని చెప్పారు. దర్శకుడు శేషు సంవత్సరం పైగా నా చుట్టూ తిరిగాడు. కథలో కొత్తదనం ఉంది. ఇటువంటి కథలు విజయాలు సాధిస్తున్నానని నేనూ ముందుకు వచ్చా. మా సంస్థలో 'క్రిమినల్' నుంచి ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాల వరకు... శేషు పని చేశాడు. ఆయనకు ఎంతో అనుభవం ఉంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం, మలయాళం... ఆరు భాషల్లో సినిమా చేశాం. చాలా అందమైన చిన్న చిత్రమిది'' అని చెప్పారు.
తెలుగు డైలాగులకు అర్థం తెలుసుకుని అశ్లేష నటించింది! - నిహాల్
నిహాల్ మాట్లాడుతూ ''ఇది నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా. రామారావు గారి ఆఫీసులో శేషు కథ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యా. ఇందులో నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది. లెజెండ్ కెఎస్ రామారావు గారు మా వెనుక ఉండటం ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. విశాల్ చంద్రశేఖర్ మా సినిమాకు సంగీతం అందించడం చాలా లక్కీగా ఫీలవుతున్నా. అశ్లేషకు తెలుగు రాకపోయినా ప్రతి డైలాగ్ రాసుకుని, అర్ధం తెలుసుకుని మరీ నటించింది. ఆమె క్యారెక్టర్ చుట్టూ సినిమా తిరుగుతుంది'' అని చెప్పారు.
అశ్లేషా ఠాకూర్ మాట్లాడుతూ ''చిన్నప్పట్నుంచి నాకు డాన్స్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఇందులో నా ఇష్టాలకు దగ్గరైన క్యారెక్టర్ చేయడం సంతోషంగా ఉంది. కెఎస్ రామారావు గారి నిర్మాణంలో నటించడం గర్వంగా ఉంది. ప్రేక్షకులకు స్ఫూర్తినిచ్చే చిత్రమిది. నా క్యారెక్టర్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను.'' అని చెప్పారు. ''కెఎస్ రామారావు గారికి కథ చెప్పిన తర్వాత 'చాలా బాగుంది శేషు! పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకురా. నేను తీస్తా' అన్నారు. సుమారు ఏడాదిన్నర మా మధ్య చర్చలు జరిగాయి. ప్రతి క్రాఫ్ట్ విషయంలోనూ ఆయన ఎంతో కేర్ తీసుకున్నారు. నాపై నమ్మకంతో ఆయన ఈ అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా'' అని దర్శకుడు శేషు చెప్పారు. ఈ కార్యక్రమంలో రమేష్ ఆర్, శశాంక్ ఉప్పుటూరి, విశాల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ నటుడు వినోద్ కుమార్, వీణా నాయర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రమేష్. ఆర్, కూర్పు : శశాంక్ ఉప్పుటూరి, నృత్యాలు : సిమ్రాన్ శివకుమార్, వీణా నాయర్, పాటలు : భాస్కరభట్ల, కృష్ణకాంత్, శ్రీమణి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాత : డా. యిర్రంకి సురేష్, దర్శకత్వం : శేషు పెద్దిరెడ్డి.
Also Read : తెలుగులోకి అర్జున్ దాస్ తమిళ సినిమా - లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ గురూ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial