రజినీకి బిగ్ షాక్, OTT విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీకైన 'జైలర్' HD ప్రింట్!
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన రజినీకాంత్ 'జైలర్' సినిమా ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకైంది. పలు వైరసీ సైట్స్ లో HD క్వాలిటీతో స్ట్రీమింగ్ చేయబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ 'జైలర్' ఆగస్టు 10న విడుదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం, తమిళ్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ ఓటీటీ విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీకవ్వడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
'జైలర్' మూవీ మూడో వారంలోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్న తరుణంలో, ఇప్పుడు ఉన్నటుండి ఈ సినిమా ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. Movierulz లాంటి కొన్ని పైరసీ వెబ్ సైట్స్ హెచ్‌డీ ప్రింట్ ను అప్లోడ్ చేసాయి. అది కూడా ఎలాంటి వాటర్ మార్క్స్ లేకుండా ఒరిజినల్ 5.1 సౌండ్ తో హై క్వాలిటీ ప్రింట్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
'జైలర్' సినిమా లీక్ అవ్వడం అనేది అటు థియేటర్ ఓనర్లను, ఇటు ఓటీటీ సంస్థని ఆందోళనకు గురి చేసే విషయమే. ఎందుకంటే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కచ్చితంగా మరికొన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు HD క్వాలిటీతో సినిమా ఆన్ లైన్ లో అందుబాటులో ఉండటంతో వసూళ్లపై ప్రభావం పడుతుంది. మరోవైపు ఈ మూవీ హిందీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ.100 కోట్లకు దక్కించుకున్నట్లు టాక్ ఉంది. పైరసీ సైట్స్ లో లీకైన కారణంగా ఓటీటీకి కూడా ఎంతో కొంత డ్యామేజీ జరుగుతుంది. మరి దీనిపై మేకర్స్ చర్యలు తీసుకుంటారేమో చూడాలి.
ఏదేమైనా 'జైలర్' సినిమా డిజిటల్ రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ అవుతుండటంపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమాకి ఇలా జరగడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు దీనికి సంబంధించి వీడియోలు పోస్ట్ చేసుండటంతో 'జైలర్ HD' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.
Also Read: ‘ఖుషి’ సినిమాకి, సమంత రియల్ లైఫ్‌కు పోలికలు ఉన్నాయా?
ఇకపోతే 'జైలర్' చిత్రం అనుకోని విధంగా ఓ వివాదంలో చిక్కుకుంది. సినిమాలోని ఓ సన్నివేశంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు జెర్సీని ధరించిన ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ను రజనీకాంత్ హతమారుస్తాడు. దీనిపై RCB ఐపీఎల్ క్రికెట్ టీమ్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో, సెప్టెంబర్ 1లోపు ఆ సీన్ లో మార్పులు చేస్తామని చిత్రబృందం హామీ ఇచ్చింది. టెలివిజన్, ఓటీటీల్లోనూ మార్చిన సన్నివేశాన్ని ప్రదర్శిస్తామని కోర్టుకు వెల్లడించింది.
కాగా, 'జైలర్' సినిమాతో రజనీకాంత్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారు. ఇందులో ఆయన భార్యగా రమ్యకృష్ణ నటించగా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్పెషల్ రోల్ లో మెరిసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, హిందీ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ అతిథి పాత్రల్లో నటించగా.. వసంత్ రవి, మిర్నా మీనన్, వినాయకన్, సునీల్, యోగిబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు.
'జైలర్' చిత్రం సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రం అదే రోజున నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.
Also Read: నా సామిరంగ - ఈసారి సంక్రాంతికి 'బీడీలు' 3D లో కనిపిస్తాయేమో!?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial