Shah Rukh Khan: యాసిడ్ దాడి బాధితురాలికి బ్యాంకులో చేదు అనుభవం, షారుఖ్ సాయం కోరుతూ ట్వీట్
యాసిడ్ దాడి బాధితురాలికి బ్యాంకులో చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమెకు అకౌంట్ ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించారు. ఏం చేయాలో తెలియక తన బాధను హీరో షారుఖ్ ఖాన్ ను చెప్పుకుంటూ ట్వీట్ చేసింది.
ఝార్ఖండ్ యాసిడ్ దాడి బాధితురాలు ప్రగ్యా ప్రసూన్ కు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. యాసిడ్ దాడితో ముఖం భాగం పూర్తిగా గాయపడ్డటంతో కేవైసీ కోసం బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయలేకపోయింది. దీంతో అధికారులు ఆమెకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. బ్యాంకు అధికారుల తీరుపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన బాధను బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు చెప్పుకుంటూ ట్వీట్ చేసింది.
యాసిడ్ దాడి బాధితురాలు చేసిన ట్వీట్ ఏంటంటే?
యాసిడ్ దాడి నుంచి బయట పడిన తనకు చేయూతన అందించాల్సిందిపోయి, బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రగ్యా ఆవేదన వ్యక్తం చేసింది. బ్యాంకు ఖాతా తెరవడం తన హక్కు అని వెల్లడించింది. ఈమేరకు ప్రగ్యా ప్రసూన్ షారుఖ్ ఖాన్ తో పాటు అతడి మీర్ ఫౌండేషన్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. "యాసిడ్ దాడి నుండి బయటపడిన నన్ను గౌరవంగా జీవించేలా చూడాలి. నా జీవితాన్ని నిషేధించినట్లుగా చేయకూడదు. నేను KYC ప్రక్రియ కోసం బ్లింక్ చేయలేనందున నాకు బ్యాంక్ ఖాతాను తిరస్కరించడం అన్యాయం. యాసిడ్ దాడి నుండి బయటపడిన వారందరితో పాటు నాకు సాయం చేయాలని షారుఖ్ ఖాన్ తో పాటు మీర్ ఫౌండేషన్ ను అభ్యర్థిస్తున్నాను” ట్వీట్ చేసింది. దీనికి 'ఐ విల్ బ్లింక్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది.
Being an acid attack survivor shouldn't prohibit me from living a dignified life. It's unjust that I was denied a bank a/c because I can’t blink for the KYC process. Requesting @iamsrk @MeerFoundation to help me make this world inclusive for acid attack survivors #Iwontblink
— pragya prasun singh (@pragyaprasun) July 12, 2023
యాసిడ్ దాడి బాధితులకు బ్యాంకులో ఇబ్బందులు
బ్యాంకు లావాదేవీల విషయంలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ఉండేందుకు కేవైసీ వివరాలను కచ్చితంగా ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే, ఈ నిబంధనతో ప్రగ్యా లాంటి యాసిడ్ దాడి బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవైసీ కోసం ఫేస్ రికగ్నేషన్ సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తెచ్చారు. అయితే, యాసిడ్ బాధితుల ముఖాలు దెబ్బతిని ఉండటంతో వారిని సాఫ్ట్ వేరు గుర్తించలేకపోతోంది. "ఐసిఐసిఐ బ్యాంక్‌లో కొత్త బ్యాంక్ ఖాతాను తెరవడానికి నేను ప్రయత్నించాను. కానీ, బ్యాంకు అధికారులు నాకు ఇచ్చేందుకు నిరాకరించారు. ఎందుకంటే, అకౌంట్ తీసుకునే వారు తమ ఐరిష్ వివరాలను నమోదు చేయాలి. కానీ,నేను ఐరిష్ వివరాలను ఇవ్వలేకపోయాను. యాసిడ్ దాడి నుండి బయటపడినందున, నేను కనురెప్పలను సరిగా కదిలించలేకపోతున్నాను. అందుకే, తన లాంటి యాసిడ్ బాధితులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాను” అని ప్రగ్యా కోరింది.
షారుఖ్ కు ఎందుకు ట్యాగ్ చేసిందంటే?
ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ మ్యాచ్ కోసం కోల్‌కతాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీర్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్న కొంతమంది యాసిడ్ దాడి బాధితులను కలుసుకున్నారు. ఇటీవల, ఈ ఫౌండేషన్ ఢిల్లీ యాసిడ్ దాడి మహిళ కుటుంబానికి సహాయం చేసింది. ఈనేపథ్యంలోనే తర బాధను షారుఖ్ కు వివరించింది.
ప్రగ్యా ప్రసూన్ ఎవరంటే?
ప్రగ్యా ప్రసూన్ 1983లో జార్ఖండ్ లోని ధన్ బాద్ లో జన్మించింది. 2006లో వారణాసిలో వివాహం చేసుకుంది. పన్నెండు రోజుల తర్వాత ఆమె రైలులో వెళ్తుండగా ఆమె మాజీ ప్రియుడు యాసిడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. యాసిడ్ దాడి నుండి తప్పించుకున్న ప్రగ్యా, అతిజీవన్ ఫౌండేషన్ ను స్థాపంచింది. యాసిడ్ దాడి బాధితులకు అండగా నిలుస్తోంది. ఆమె సేవలకు గుర్తింపుగా 2019లో భారత ప్రభుత్వం నారీ శక్తి పురస్కారాన్ని అందించింది.
Read Also: కాజోల్‌తో శృంగార సన్నివేశం, ఇబ్బంది కలిగించలేదు - ‘లస్ట్ స్టోరీస్ 2’పై కుముద్ మిశ్రా వ్యాఖ్యలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial