Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం
శివరాజ్ కుమార్ నటిస్తున్న 'ఘోస్ట్' మూవీ ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ని రాజమౌళి విడుదల చేసి మూవీ టీం కి బెస్ట్ విషెస్ అందించారు.
కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో గెస్ట్ రోల్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సినిమాలో నరసింహ పాత్రలో కొన్ని క్షణాల పాటు కనిపించినా ఆయన ఎంట్రీ, స్టైల్, స్వాగ్ చూసి ప్రేక్షకులు థియేటర్స్ లో విజిల్స్ వేశారు. సినిమాలో ఆయన ఎంట్రీకి ఫ్యాన్స్ అరుపులతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అలా 'జైలర్'లో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన శివ రాజ్ కుమార్ ఇప్పుడు 'ఘోస్ట్'(Ghost) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ కన్నడ తో పాటు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది.
శివన్న ఈ సినిమా కోసం మొదటిసారి బౌండరీలు దాటి పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. 'వన్స్ ఎ గ్యాంగ్ స్టర్ ఆల్వేస్ గ్యాంగ్ స్టర్' అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాపై కన్నడ నాట భారీ అంచనాలు ఉన్నాయి. శివరాజ్ కుమార్ తో పాటు ఉపేంద్ర, రాజ్ బి శెట్టి సైతం ఈ సినిమాలో నటిస్తుండడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా 'ఘోస్ట్' మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. కన్నడ తో పాటు అన్ని భాషల్లో ఈ ట్రైలర్ విడుదలైంది. తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. 'కేజిఎఫ్' స్టైల్ లో ఓపెన్ అయ్యి కంప్లీట్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా భారీ యాక్షన్ సీన్స్ తో ట్రైలర్స్ సాగింది. టైలర్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేసారు. 'సామ్రాజ్యాలు సృష్టించే వాడిని చరిత్ర మర్చిపోతుందేమో గాని విధ్వంసం సృష్టించిన వాడిని ఎప్పుడూ మర్చిపోదంటూ" ఒక్క డైలాగ్ తోనే సినిమా మెయిన్ థీమ్ ని చెప్పేసారు. ఓ సాధారణ మనిషిగా ఉండే శివన్న కొన్ని కారణాలవల్ల మోస్ట్ వాలెంట్ మ్యాన్ గా మారి శత్రువులను చీల్చి చెండాడుతూ ఉంటాడు. ఇంతకీ శివన్న విధ్వంసం వెనక ఉన్న అసలు కారణాలేంటి? ఆయన ఎందుకలా చేశాడు? అనేది సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్ మొత్తం యాక్షన్ పార్ట్ తోనే నింపేశారు.
రెండు నిమిషాల 11 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ కి అర్జున్ జన్య ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో నిలిచింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ట్రైలర్లో శివన్న ని యంగ్ లుక్ లో కూడా ప్రజెంట్ చేశారు. ఇందుకోసం మూవీ టీం డీఏజింగ్ టెక్నాలజీని వాడింది. శివన్నను యంగ్ లుక్ లో చూస్తుంటే అచ్చం పునీత్ రాజ్ కుమార్ ని చూసినట్లు అనిపించింది. నిజంగానే పునీత్ గెస్ట్ రోల్ ప్లే చేసి ఉంటే 'ఘోస్ట్' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసేదని ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ చెబుతున్నారు. విజువల్స్ చూస్తుంటే 'కేజిఎఫ్' మూమెంట్స్ గుర్తుకొస్తున్నాయి.
మొత్తం మీద శివన్న నటించిన 'ఘోస్ట్' కన్నడ ఇండస్ట్రీలో మరో 'కేజీఎఫ్' అవుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సందేశ్ నాగరాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో జయరామ్, అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ, సత్య ప్రకాష్, అర్చన జాయిస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ చిత్రం అక్టోబర్ 19న దసరా కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతోంది.
Also Read : రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా - డైరెక్టర్ ఎవరంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial