Salman Khan House Firing: సల్మాన్‌పై కాల్పులు జరిపేందుకు అంత చెల్లించారట - ఫుల్ అమౌంట్ తీసుకోకుండానే దొరికిపోయారు!
Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల ఘటనలో సంచలన విషయాలు వెల్లడి అవుతున్నాయి. నిందితులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో రూ. 4 లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేలింది.
Salman Khan House Firing Case: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలో మూడో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, పోలీసుల అదుపులో ఉన్న విక్కీ గుప్తా(24), సాగర్ కుమార్ పాలక్(21) మధ్య కోఆర్డినేటర్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆదివారం తెల్లవారుజామున సల్మాన్ నివాసం ముందు కాల్పులు
ఆదివారం(ఏప్రిల్ 14) నాడు తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్ మెంట్ ముందు బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు 5 రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఇద్దరు అనుమానితులలో ఒకడైన సాగర్ కుమార్ పాలక్ కు అంతకు ముందు రోజు ఓ వ్యక్తి రివాల్వర్ అందించినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇంతకీ అతడికి రివాల్వర్ ఇచ్చింది ఎవరు? అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సాగర్ కుమార్ తో పాటు విక్కీ గుప్తాను పోలీసులు గుజరాత్ లోని కచ్ జిల్లాలో అరెస్టు చేశారు. వీరిద్దరు బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
రూ. 4 లక్షల సుపారీ ఒప్పందం
ఇక సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిపేందుకు నిందితులు పాలక్ కుమార్, విక్కీ గుప్తా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో రూ. 4 లక్షలు సుపారీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ముందస్తుగా రూ.లక్ష రూపాయలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. అయితే, వీరి టార్గెట్ సల్మాన్ ఖాన్ ను చంపడం కాదని, కేవలం అతడిని భయపెట్టడం మాత్రమేనని పోలీసులు తెలిపారు. “నిందితులు పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో కూడా రెక్కీ నిర్వహించారు. ఎలాగైనా సల్మాన్ ఖాన్ ను భయపెట్టాలని భావించారు. అయితే, హత్య చేయాలనేది వారి ఉద్దేశం కాదు. ఇప్పటికే నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లను బీహార్ లో రికార్డు చేయబడ్డాయి. ఈ కేసు విచారణ కోసం హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు ఏడుగురిని విచారణ కోసం పిలిచాం. విచారణ ఇంకా కొనసాగుతోంది” అని పోలీసులు వెల్లడించారు. అటు ఈ కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్ వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెడీ అవుతున్నారు.
నిందితులను వదిలిపెట్టమని చెప్పిన మహారాష్ట్ర సీఎం
కాల్పుల ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, నటుడు సల్మాన్ ఖాన్‌ను కలిశారు. జరిగిన ఘటన గురించి అతడితో మాట్లాడారు. లారెన్స్ బిష్ణోయ్ ని అంతం చేస్తామని తేల్చి చెప్పారు. “ప్రభుత్వం మీ వెంటే ఉందని సల్మాన్ ఖాన్‌కు చెప్పాను. ఇప్పటికే పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్నారు. ఇందులో భాగస్వాములైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టం. ముంబైలో ఏగ్యాంగ్ వార్‌ను అనుమతించబోం. ఇలాంటి ఘటనలను అస్సలు ఉపేక్షించం. లారెన్స్ బిష్ణోయ్ లాంటి వాళ్లను అంతం చేస్తాం” అని సల్మాన్ తో భేటీ తర్వాత ఏక్ నాథ్ షిండే వెల్లడించారు.
Read Also: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం