Salaar Nizam Distribution : మైత్రికి 'సలార్' నైజాం - ఇది ఏషియన్ సునీల్, 'దిల్' రాజుకు గట్టి పోటీయే!
మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ టేకప్ చేస్తున్న ప్రాజెక్టులు చూస్తుంటే.. నైజాంలో ఏషియన్ సునీల్, 'దిల్' రాజుకు గట్టి పోటీ ఇస్తున్నట్లు అర్థం అవుతోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'సలార్' (Salaar Movie). 'కెజియఫ్ 2' తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel), నిర్మాత విజయ్ కిరగందూర్ కలయికలో వస్తున్న సినిమా కావడం... ప్రభాస్ హీరో కావడం... సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. డిస్ట్రిబ్యూషన్ కోసం నిర్మాతను సంప్రదించిన వాళ్ళకు నిర్మాత భారీ రేట్లు చెప్పారని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. ఆ రేట్లు విని కొందరు వెనకడుగు వేశారని కూడా అన్నారు. అయితే... మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ధైర్యంగా ముందడుగు వేశారు.
మైత్రికి 'సలార్' నైజాం రైట్స్
Salaar Nizam Distribution Rights : 'సలార్' సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. రికార్డు రేటు కోట్ చేసి మరీ తీసుకుందని టాక్.
నైజాంలో డిస్ట్రిబ్యూషన్ అంటే 'దిల్' రాజు, ఏషియన్ సునీల్ పేర్లు మాత్రమే ఇన్ని రోజులూ ఎక్కువ వినిపించేవి. మధ్యలో 'వరంగల్' శ్రీను వచ్చినా సరే వరుస ఫ్లాప్స్ రావడంతో వెనక్కి తగ్గారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మధ్యలో కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఆయన ఎక్కువ రిస్క్ చేయడం లేదు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ వచ్చింది. 'సలార్' నైజాం డిస్ట్రిబ్యూషన్ పోటీలో 'దిల్' రాజు, ఏషియన్ సునీల్ ఉన్నప్పటికీ... వాళ్ళను దాటుకుని మైత్రి ముందుకు వెళ్ళింది.
షారుఖ్ 'డంకీ'తో 'సలార్' పోటీ!
డిసెంబర్ 22న 'సలార్' సినిమా విడుదల కానుంది. ప్రభాస్ టీమ్ విడుదల తేదీ అనౌన్స్ చేయడానికి ముందు ఆ తేదీ మీద బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కర్చీఫ్ వేశారు. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'డంకీ'ని డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే వెల్లడించారు. హిందీ మార్కెట్ పరంగా షారుఖ్ సినిమాతో పోటీ అంటే వసూళ్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే... షారుఖ్ కంటే ప్రభాస్ సినిమాకు ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందట.
Also Read : బాలీవుడ్ హీరోతో రష్మిక లిప్ లాక్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో
ప్రభాస్ 'సలార్' డిసెంబర్ 22న విడుదల కానుండటంతో... కిస్మస్ పండక్కి రావాలని అనుకున్న వెంకటేష్ 'సైంధవ్' సంక్రాంతికి, నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' డిసెంబర్ 8కి వెళ్లాయి. నాని 'హాయ్ నాన్న' డిసెంబర్ 21, సుధీర్ బాబు 'హరోం హర' డిసెంబర్ 22 దగ్గర ఉన్నాయి. అవి కూడా వాయిదా పడే ఛాన్సులు ఉన్నాయట.
Also Read : రాజమౌళి @ 50 - భారతీయ సినిమా బ్రాండ్ అంబాసిడర్ నెక్స్ట్ టార్గెట్ హాలీవుడ్ కుంభస్థలమే
'సలార్' సినిమాలో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రను ఆమె పోషిస్తున్నారు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial