(Source: ECI/ABP News/ABP Majha)
Sai Dharam Tej Interview : యాక్సిడెంట్ తర్వాత అమ్మే మళ్ళీ నాకు మాటలు నేర్పింది - సాయి ధరమ్ తేజ్ ఇంటర్వ్యూ
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'విరూపాక్ష' ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...
సినిమా విజయవంతం అయితే అందరం సంతోషంగా ఉంటామని, అంతే తప్ప రికార్డులు బద్దలు కొట్టాలని ఏమీ అనుకోనని యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) అన్నారు. ప్రతి వారం విడుదలయ్యే సినిమా రికార్డు క్రియేట్ చేయవచ్చని, రికార్డులు అంటేనే బ్రేక్ అవుతూ ఉంటాయని ఆయన వివరించారు. ఇప్పుడు వయసుతో పాటు పరిణితి పెరిగిందని, అందర్నీ నవ్విస్తూ సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండును దర్శకుడిగా పరిచయం చేస్తూ... సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'విరూపాక్ష'. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 21న... శుక్రవారం సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సాయి తేజ్ చెప్పిన విశేషాలు ఇవి...
'విరూపాక్ష'కు అర్థం ఏమిటంటే?
'విరూపాక్ష' కథ 80, 90వ దశకంలో జరుగుతుందని సాయి ధరమ్ తేజ్ చెప్పారు. ఓ గ్రామంలో వరుసగా జరిగే మిస్టరీ మరణాల వెనుక కారణం ఏమిటి? ఊరి మీద ఎవరైనా చేతబడి చేయించారా? ఒకవేళ చేస్తే ఎవరు చేసి ఉంటారు? అనే అంశాల చుట్టూ కథ జరుగుతుందన్నారు. 'విరూపాక్ష' అంటే రూపం లేని కన్ను, మహా శివుని మూడో కన్ను అని వివరించారు. రూపం లేని దాంతో చేసే పోరాటం కనుక సినిమాకు 'విరూపాక్ష' టైటిల్ పెట్టామన్నారు.
'కాంతార'తో 'విరూపాక్ష'ను పోల్చను!
సినిమా జానర్, తన పాత్ర గురించి సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ''ఇదొక మిస్టీక్ థ్రిల్లర్ సినిమా. నేను తొలిసారి ఇటువంటి జానర్ సినిమా చేశా. ఇంతకు ముందు సినిమాల్లో, క్యారెక్టర్లలో నేను జీవించాను. కానీ, ఇప్పుడు నటించాను. ప్రతి హీరోకి ప్రతి సినిమా మొదటి సినిమాలానే ఉంటుంది. నేనూ ప్రతి సినిమా మొదటి సినిమా అన్నట్టు కష్టపడతాను. 'విరూపాక్ష'ను 'కాంతార'తో పోల్చను. అది కల్ట్ క్లాసిక్. దానికి, మా సినిమాకు సంబంధం ఉండదు'' అని చెప్పారు.
నాకు 36 ఏళ్ళ వయసులో అమ్మ మాటలు నేర్పింది!
యాక్సిడెంట్ తర్వాత షూటింగ్ చేయడం గురించి సాయి తేజ్ మాట్లాడుతూ ''నాకు ప్రమాదం జరిగిన తర్వాత సినిమాలు చేస్తానా? లేదా? అని అంతా అనుకున్నారు. అయితే, మా అమ్మ నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. 36 ఏళ్ల వయసులో మళ్లీ నాకు మాటలు నేర్పించారు. ఆ తర్వాత 'విరూపాక్ష' చిత్ర బృందం కూడా నాకు ఎంతో మద్దతుగా నిలిచింది. వర్క్ షాప్స్ చేసిన సమయంలో నా పరిస్థితి బాలేదు. నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా కోసం అడ్జస్ట్ అయ్యారు. మా నిర్మాతలు ఎంతో మద్దతుగా నిలిచారు. ఆ విషయంలో వారికి వందకు వంద మార్కులు ఇవ్వాలి'' అని చెప్పారు. తాను చేతబడిని నమ్మనని, అంజనేయుడ్ని నమ్ముతానని, ఆయన తోడుంటే మనకు ఏం కాదని నమ్ముతానని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.
Also Read : బిడ్డకు తండ్రి ఎవరు? ఇలియానాపై దారుణమైన ట్రోల్స్
తనలోని నటుడికి 'విరూపాక్ష' పరీక్ష పెట్టినట్టు అనిపించిందని సాయి ధరమ్ తేజ్ అన్నారు. ఈ సినిమా కోసం నోట్స్ రాసుకున్నట్టు తెలిపారు. ఇంకా మాట్లాడుతూ ''80, 90వ దశకంలో ప్రజలు ఎలా ఉండేవారు? ఎలా ప్రవర్తించేవారు? నేను ఎలా కనిపించాలి? వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాను. 2019లోనే కార్తీక్ ఈ కథ చెప్పాడు. బాగా నేరేట్ చేశాడు. దీనికి సుకుమార్ గారు కేవలం స్క్రీన్ ప్లే ఇచ్చారు. ఇదొక టిపికల్ జానర్ సినిమా. ఆయన ఇచ్చిన స్క్రీన్ ప్లే బాగా సెట్ అయ్యింది'' అని చెప్పారు. 'విక్రాంత్ రోణ' చూసి సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్ గారిని తీసుకున్నాని, 'విరూపాక్ష'లో పాటల కంటే నేపథ్య సంగీతానికి ఎక్కువ స్కోప్ ఉందని, ఆయన అద్భుతంగా రీ రికార్డింగ్ చేశారని తెలిపారు.
Also Read : రవితేజ & శర్వానంద్ - ఓ మల్టీస్టారర్, ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్స్