Saree Teaser: రొమాన్స్ లో వయొలెన్స్, శారీ లవ్ కెన్ బి స్కేరీ - RGV బ్రాండ్ ఆ మాత్రం ఉంటదిలే
Saree Teaser: టాలీవుడ్ రామ్ గోపాల్ వర్మ అనే బ్రాండ్ తో వస్తున్న లేటెస్ట్ మూవీ శారీ. టీజర్ తోనే అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది శారీ.
RGV Saree movie Teaser | రొమాంటిక్ క్రైమ్ కథల జోనర్ ఇంకా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫార్ములా లాగే కొనసాగుతోంది. ఒకవేళ బిగ్ స్క్రీన్ పై సక్సెస్ కాలేకపోయినా ఓటీటీల్లో మాత్రం ఈ జోనర్ సూపర్ హిట్ అవుతుంది. అందుకే రామ్ గోపాల్ వర్మ ఏరికోరి ఇలాంటి కథల్నే పట్టుకుంటున్నారు. తాజాగా శారీ అనే ఓ మూవీ వర్మ ఫ్యాక్టరీనుంచి వస్తోంది. టీజర్ తోనే అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది శారీ.
గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో ఆర్జీవీ బ్రాండ్ మూవీ
రామ్ గోపాల్ వర్మ అనే బ్రాండ్ తో వస్తున్న లేటెస్ట్ మూవీ శారీ. ఈ సినిమాకు ఆయన దర్శకుడు, నిర్మాత.. ఏదీ కాదు. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ బిజినెస్ మేన్ రవి వర్మ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుండగా గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలా కనిపిస్తున్నా.. హీరోయిన్ ని లవ్ చేసి, ఆ తర్వాత సైకోలా మారే విలన్ క్యారెక్టర్ ఈ మూవీకి కీలకం అని టీజర్ చెబుతోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మళయాళం భాషల్లో త్వరలో ఈ సినిమా విడుదలవుతుందని చెబుతున్నారు మేకర్స్.
సైకలాజికల్ థ్రిల్లర్..
ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ రియల్ స్టోరీ ఆధాారంగా ఈ సినిమా తెరకెక్కిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అమాయకులైన మహిళలపై శారీ కిల్లర్ లైంగిక దాడి చేసి, వారిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసేవాడు. ఆ సీరియల్ కిల్లర్ కథే ఈ శారీ అనే టాక్ ఉంది. అయితే టీజర్ లో మాత్రం అతను సీరియల్ కిల్లర్ కాదు, సీరియస్ లవర్ అనేలా చూపించాడు. శారీలో ఉన్న అమ్మాయితో ప్రేమలో పడే ఆ యువకుడు.. ఆమె తిరస్కారంతో పిచ్చివాడిగా మారిపోయి, ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై రివేంజ్ తీర్చుకోవడమే ఈ సినిమా కథ. క్లైమాక్స్ ఏంటనేది తెలుసుకోవాలంటే నవంబర్ వరకు వెయిట్ చేయాలి.
ఈ సినిమాలో సైకోలా మారిన ఫొటోగ్రాఫర్ గా సత్య యాదు కనిపిస్తాడు. ఇక హీరోయిన్ ఆరాధ్య ఈ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇస్తోంది. ఆరాధ్య కేరళకు చెందిన అమ్మాయి. ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ గా బాగా ఫేమస్. రీల్స్ చేస్తూ హీరోయిన్స్ ని అనుకరిస్తుండేది ఆరాధ్య. రామ్ గోపాల్ వర్మ కు ఆమె రీల్స్ నచ్చాయి. ఆమె గురించి ఎంక్వయిరీ చేసి, తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇలాంటి సినిమాలకు ఆమె పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించేలా పిక్చరైజ్ చేశారు. ఆరాధ్యకి తెలియకుండా ఆమెని లవ్ చేసే ఓ ఫొటోగ్రాఫర్, ఆ ప్రేమని ఎప్పుడు ఎక్స్ ప్రెస్ చేశాడు, ఆ తర్వాత ఆమె ఎలా రియాక్ట్ అయింది, ఆ రియాక్షన్ నచ్చని ఫొటోగ్రాఫర్ సైకోలా ఎలా మారాడనేదే కథ. ఈ కథని రొమాంటిక్ గా తెరకెక్కించారు. సైకో పాత్ర ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది.
ముఖ్యంగా హీరోయిన్ ఈ సినిమా మొత్తం శారీలోనే కనిపిస్తుంది. శారీలో హీరోయిన్లను అందంగా, ఆకర్షణీయంగా చూపించడంలో వర్మ దిట్ట. వర్మ స్కూల్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి.. యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే చాలా అంశాలు ఇందులో ఉంటాయనడంలో సందేహం లేదు. వర్మ బ్రాండ్ పై అందరికీ నమ్మకాలు తగ్గిపోతున్న ఈ టైమ్ లో శారీ అయినా ఆయన పేరు నిలబెడుతుందా, లేదా.. వెయిట్ అండ్ సీ.