Chiranjeevi - Ravi Teja: చిరంజీవి కోసం రవితేజ త్యాగం... సమ్మర్ సీజన్ వదిలేసిన 'మాస్ జాతర'
Vishwambhara Release Date: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా విడుదల కోసం రవితేజ తన సినిమాను వెనక్కి తీసుకు వెళ్లారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చిరు కోసం మాస్ మహారాజా త్యాగం చేశారని తెలిసింది.

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ మధ్య మంచి అనుబంధం ఉంది. 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాలోని ఒక పాటలో రవితేజ తళుక్కున మెరిశారు. అంతకు ముందు 'అన్నయ్య' సినిమాలో చిరు తమ్ముడిగా నటించారు. ఇటీవల 'వాల్తేరు వీరయ్య' సినిమాలో మరోసారి అన్నదమ్ములుగా సందడి చేశారు. ఇప్పుడు అన్నయ్య చిరు కోసం తమ్ముడు రవితేజ తన విడుదల తేదీని త్యాగం చేశారని సమాచారం.
'విశ్వంభర' కోసం వెనక్కి తగ్గిన 'మాస్ జాతర'
'సామజవరగమన' సినిమా రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'మాస్ జాతర' (Mass Jathara). తొలుత ఈ చిత్రాన్ని వేసవి సందర్భంగా మే తొమ్మిదో తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఆ విడుదల తేదీ కూడా ప్రకటించారు.
ఇటీవల రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'మాస్ జాతర' టైటిల్ గ్లింప్స్ చూస్తే... విడుదల తేదీ లేదు. ఎందుకు? ఏమిటి? అని ఆరా తీస్తే తెలిసిన అసలు విషయం ఏమిటంటే... వేసవి సీజన్ నుంచి 'మాస్ జాతర' వెనక్కి తగ్గిందట! అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'విశ్వంభర'.
చిరంజీవి కథానాయకుడిగా 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తీసిన వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'విశ్వంభర'. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కావలసినది. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సినిమా కోసం వాయిదా పడింది. ఇప్పుడు ఆ సినిమాను మే తొమ్మిదిన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'జగదేక వీరుడు అతిలోక సుందరి'... ఇప్పుడు 'విశ్వంభర'
చిరంజీవి సినీ ప్రయాణంలో మే 9వ తేదీకి ఒక విశిష్టత ఉంది. శ్రీదేవితో కలిసి ఆయన నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఆ రోజు విడుదల అయింది. బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అది సోషియో ఫాంటసీ సినిమా. ఇప్పుడు నటిస్తున్న విశ్వంభరా కూడా సోషియో ఫాంటసీ సెంటిమెంట్ రిలీజ్ డేట్ కోసం చిరు చూడడంతో ఆయన కోసం రవితేజ వెనక్కి తగ్గారని తెలిసింది. మరి మే నెలలో 'మాస్ జాతర'ను ప్రేక్షకులు ముందుకు తీసుకు వస్తారా? లేదంటే కొన్ని రోజులు ఆగుతారా? అనేది చూడాలి.
Also Read: రాచరికం రివ్యూ: సీఎం సీటుకు అక్క, తమ్ముడు చేసిన రక్తచరిత్ర - రాయలసీమ రాజకీయాలకు అద్దం పట్టేలా...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

