The Girl Friend Movie : సినిమా గవర్నమెంట్ జాబ్ కాదు - వర్కింగ్ అవర్స్ కాంట్రవర్శీపై 'ది గర్ల్ ఫ్రెండ్' ప్రొడ్యూసర్ రియాక్షన్
Rashmika Mandanna : ఇండస్ట్రీలో హీరోయిన్ల వర్కింగ్ అవర్స్, కండీషన్స్ కాంట్రవర్సీలపై 'ది గర్ల్ ఫ్రెండ్' ప్రొడ్యూసర్ ధీరజ్ రియాక్ట్ అయ్యారు. మూవీ అంటే గవర్నమెంట్ జాబ్ కాదన్నారు.

Producer Dheeraj About Actress Working Hours Condition : నేషనల్ క్రష్ రష్మిక, 'దసరా' ఫేం దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్' ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా... అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ధీరజ్, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజా ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో హీరోయిన్ల వర్కింగ్ అవర్స్ అంశంపై నిర్మాత ధీరజ్ మాట్లాడారు.
మూవీ గవర్నమెంట్ జాబ్ కాదు
సినిమా అనేది గవర్నమెంట్ జాబ్ కాదని... రోజూ 9 నుంచి 5 వరకే మాత్రమే పని చేస్తానంటే కుదరదని అన్నారు ధీరజ్. 'బాలీవుడ్‌లో ఎవరైతే స్టార్ హీరోయిన్ ఉన్నారో ఆవిడ చేసిన కామెంట్స్ నేను విన్నా. అది ఆవిడ పెర్సెపెక్టివ్. ఆ హీరోయిన్‌ను తీసుకోవాలా? వద్దా? అనేది దర్శక నిర్మాతల డెసిషన్. సినిమా కోసం 9 నుంచి 5 జాబ్ చేయడం లేదు. అర్ధరాత్రైనా, ఎర్లీ మార్నింగ్ అయినా షూట్ చేసుకుంటాం. ఓ పాషన్‌తో సినిమా చేస్తాం. దానికి ఆర్టిస్టుల సపోర్ట్ ఉంటే మిరాకిల్స్ చెయ్యొచ్చు. అంతే తప్ప రూల్స్, రెగ్యులేషన్స్ పెడితే చాలా కష్టం. మేమంత ప్యాసినేట్‌గా ఉంటామో మా ఆర్టిస్టులు కూడా అంతే తపనతో ఉంటే బెస్ట్ అవుట్ పుట్ వస్తుందని నేను నమ్ముతా.' అని చెప్పారు.
'కొందరిని పక్కన పెట్టా'
తన జర్నీలో కొందరిని పక్కన పెట్టినట్లు నిర్మాత ధీరజ్ తెలిపారు. 'కొందరు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గరకు అప్రోచ్ అయితే ఎక్కువ మనీ డిమాండ్ చేశారు. వాళ్లకు ఉన్న ఆఫర్స్ మేరకు అది సహజమే. కానీ 6 గంటల తర్వాత షూట్ చేయం. అవుట్ డోర్ షూటింగ్స్‌కు రాలేము అంటూ కొన్ని కండీషన్స్ పెట్టిన వాళ్లు ఉన్నారు. సినిమా అనేది ఎప్పటికీ లైబ్రరీలో ఉండిపోయే సినిమా. మేము తొలుత అప్రోచ్ అయ్యి ఆ కండీషన్స్ విని వెనక్కు తగ్గాం. వాళ్ల వల్లే సినిమాలు ఆడేస్తున్నాయి అని ఏం లేదు కదా. కచ్చితంగా వాళ్లు మంచి నటులు. కానీ ఆ కంఫర్ట్ జోన్ లేనప్పుడు ఎందుకు అని కొందరిని పక్కన పెట్టాం.' అని చెప్పారు.
ఇటీవల ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ కాంట్రవర్శీ నెలకొన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ 8 వర్కింగ్ అవర్స్, ఇతర కండీషన్స్ వల్ల బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్, ప్రభాస్ 'స్పిరిట్' 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి తప్పించారనే వార్తలు వచ్చాయి. 'స్పిరిట్'లో ఆమె స్థానంలో హీరోయిన్ త్రిప్తి దిమ్రిని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫిక్స్ చేశారు. ఇక 'కల్కి' సీక్వెల్‌లో ఆమె స్థానంలో ఎవరిని తీసుకున్నారు? అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు.





















