ఆ సమయంలో నేను 5 నెలల గర్భవతిని - బిడ్డను కూడా పోగొట్టుకున్నాను: రాణి ముఖర్జీ
బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ.. తన జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటన గురించి వెల్లడించారు.
బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ రీసెంట్ గా మెసేజ్ చటర్జీ వర్సెస్ నార్వే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలియజేసింది. ఈ క్రమంలోనే 'మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే' సినిమా చిత్రీకరణకు ముందు తన జీవితంలో అనుభవించిన ఓ విషాద సంఘటన గురించి పంచుకున్నారు. ఇటీవల జరిగిన 'ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ 2023' లో పాల్గొన్న రాణి ముఖర్జీ, ఈ కార్యక్రమంలో కోవిడ్ సమయంలో తాను గర్భవతి అయిన ఐదు నెలలకే తన రెండవ బిడ్డను ఎలా కోల్పోయిందో చెప్పారు. అయితే ఇదే సంఘటనను తాజా ఇంటర్వ్యూలో మరోసారి గుర్తు చేసుకున్నారు రాణి ముఖర్జీ.
రీసెంట్ గా జరిగిన ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో రాణి ముఖర్జీ ఇలా అన్నారు." మొట్టమొదటిసారి నేను నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ విషయం గురించి బయటికి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేటి ప్రపంచంలో మీ జీవితాల్లో జరిగే ప్రతి ఒక్క అంశం బహిరంగంగానే చర్చింపబడుతోంది. సహజంగా నేను ఓ సినిమాని ప్రమోట్ చేసేటప్పుడు దీని గురించి మాట్లాడను. కానీ ఈ సినిమాకు సంబంధించి వ్యక్తిగత అనుభవం గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. అది 2020 కోవిడ్ సమయం. ఆ సంవత్సరం చివర్లో నేను రెండోసారి గర్భవతి అయ్యాను. కానీ దురదృష్టవశాత్తు నేను గర్భవతైన ఐదు నెలలకే నా బిడ్డను కోల్పోయానని" ఆమె అన్నారు.
" ఇక తర్వాత మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే నిర్మాతలలో ఒకరైన నిఖిల్ అద్వానీ 2020లో నాకు గర్భస్రావం పది రోజుల్లో ఫోన్ చేశారు. అప్పుడు నాకు కథ చెప్పారు. ఇక ఆయన కథ చెప్పిన తర్వాత మన వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండే కథ సరైన సమయంలో మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదని అనిపించింది. దాంతో కచ్చితంగా ఈ సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఈ కథ విన్నప్పుడు నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే నార్వేలాంటి ఒక దేశంలో ఓ భారతీయ కుటుంబం గడపాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు" అంటూ చెప్పుకొచ్చారు రాణి ముఖర్జీ.
కాగా 2014లో రాణి ముఖర్జీ నిర్మాత మరియు దర్శకుడు అయిన ఆదిత్య చోప్రాను వివాహం చేసుకోగా, సంవత్సరం తర్వాత ఈ జంటకి ఓ పాప జన్మించింది. ఆమెకి 'ఆదిరా' అని నామకరణం చేశారు. ఇక 'మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే' సినిమా విషయానికొస్తే.. సాగరిక చక్రవర్తి అనే రచయిత రాసిన 'ది జర్నీ ఆఫ్ ఏ మదర్' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా, ఇందులో రాణి ముఖర్జీ తన పిల్లల కోసం రాష్ట్రంతో పోరాడే తల్లి పాత్రలో నటించారు. ఆమెతోపాటు నీనా గుప్తా, జిమ్ సర్భ్ మరియు అనిర్బన్ భట్టాచార్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆశీమా చిబ్బర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని జీ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. మార్చ్ 17 న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Also Read : అజయ్ దేవగన్‌కు చెల్లిగా దీపికా పదుకొనే - ‘బోళాశంకర్’ రీమేక్ కాదు, ఆ హిట్ మూవీ సీక్వెల్ కోసం!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial