Chandrababu Swearing: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ - టాలీవుడ్ నుంచి ఇంకెవరు?
Ram Charan To Attend AP CM Swearing Ceremony: ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నారు. ఆయనతో పాటు ఇండస్ట్రీ నుంచి ఇంకెవరు వెళతారంటే...

Nara Chandrababu Naidu Swearing Ceremony As AP New CM: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ బుధవారం ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనునున్నారు. అందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి కొందరు ప్రముఖులు వెళ్లనున్నారు. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చరణ్!
తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి తారక రామారావు తనయుడు, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ఆయన తప్పకుండా ఉంటారు.
పిఠాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా పోటీ చేశాయి కనుక ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అతిథుల జాబితాలో తప్పకుండా ఉంటారు. రాజకీయ నేపథ్యం ఉన్న పవన్ కళ్యాణ్, బాలకృష్ణను మినహాయిస్తే... తెలుగు చిత్రసీమలో కొందరు హీరోలకు ఆహ్వానాలు అందాయి. వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' చిత్రీకరణ నిమిత్తం ఆయన ఏపీలో ఉన్నారు. షూటింగ్ నుంచి చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఒక్క రోజు గ్యాప్ తీసుకోనున్నారు.
Also Read: పవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా
టీడీపీ మద్దతుదారులైన దర్శకులు రాఘవేంద్ర రావు, సీనియర్ హీరో మురళీమోహన్, నిర్మాత అశ్వనీదత్ తదితరులు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయట.
ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులు సైతం!
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు, కేంద్రంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు సైతం హాజరు కానున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు రానున్న నేపథ్యంలో అధికారులు సెక్యూరిటీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు వహిస్తున్నారు.
సుమారు పదివేల మంది పోలీసులతో భద్రత
గన్నవరానికి చెందిన రైతులు కంకణాల రమేష్, పొట్లూరి బసవరావు, ద్రోణవల్లి ప్రదీప్, పొన్నం శ్రీరాం, కాజా నెహ్రూల 14 ఎకరాల స్థలంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీ సిద్ధం చేశారు. వర్షాలు కురిసినా ఇబ్బంది లేకుండా అల్యూమినియంతో షెడ్లు వేశారు. వీఐపీల కోసం ఎయిర్ పోర్టు నుంచి సభా ప్రాంగణం వరకు ప్రత్యేక దారి ఏర్పాటు చేశారు. అథితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడలో స్టార్ హోటళ్లలో గదులను బుక్ చేశారు. సుమారు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

