Rakul Preet Singh: పెట్టుబడులు పెట్టాలంటే ఆ రెండు ఉండాల్సిందే, రకుల్ బిజినెస్ ట్రిక్స్ మామూలుగా లేవుగా!
ఓవైపు సినిమాల్లో రాణిస్తూనే, మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది రకుల్. హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులు పెడుతోంది. రీసెంట్ గా రకుల్ తన బ్రాండ్ ఇన్వెస్ట్ మెంట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Rakul Preet Singh Brand Investment Choices: క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. మోడలింగ్ నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది.
వ్యాపారరంగంలోనూ రాణిస్తున్న రకుల్
ఓవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు వ్యాపారరంగంలోనూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ముఖ్యంగా హెల్త్, స్కిన్ కేర్ రంగంలో బాగా పెట్టబుడులు పెడుతోంది. ఇప్పటికే పలు రంగాల్లో ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టింది. 2019లో ‘న్యూ బూ’ పేరుతో బయోడీగ్రేడబుల్, రీ యూజబుల్ డైపర్లను అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి డిస్పోజబుల్ డైపర్ల ద్వారా పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది. ఈ డైపర్లు భూమిలో కలిసిపోవడానికి చాలా ఏళ్ల సమయం పడుతుంది. కానీ, తమ సంస్థ డైపర్లు పర్యావరణ హితంగా ఉంటాయని రకుల్ వెల్లడించింది.
2016లో F45 జిమ్ చైన్ ప్రారంభం
మరోవైపు ఫిట్ నెసట్ పై ఆమెకు చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉంది. నిత్యం గంటల తరబడి జిమ్ లో గడుపుతుంది. తాను ఫిట్ గా ఉండటం మాత్రమే కాదు, జనాలను కూడా ఫిట్ గా ఉంచాలని భావించింది. అందులో భాగంగానే ఫిట్ నెస్ రంగంలో పెట్టుబడులు పెట్టింది. 2016లో జిమ్ చైన్ F45ను స్థాపించింది. హైదరాబాద్, వైజాగ్, ముంబైలో ఫిట్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అటు వెల్-బీయింగ్ న్యూట్రిషన్, వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్ లోనూ రకుల్ పెట్టుబడులు పెట్టింది. అంతేకాదు, ఫుడ్, బేవరేజెస్ లోనూ పెట్టుబడులు పెట్టాలని రకుల్ భావిస్తోంది. రెస్టారెంట్స్ లేదంటే హెల్త్ బేస్ FNB బ్రాండ్ ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అనుకున్నట్లుగానే ముంబై బాంద్రా ఏరియాలో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెస్టారెంట్ లో సౌత్ స్పెషల్ ఐటమ్స్ హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
పెట్టుబడులు పెట్టాలంటే ఆ రెండు విషయాలు పరిశీలిస్తా- రకుల్
వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఏ బ్రాండ్ లో పెట్టుబడులు పెట్టాలన్నా, కంపెనీ ఆలోచన, దీర్ఘకాలిక దృష్టి చాలా కీలకం అని వెల్లడించింది. రీసెంట్ గా జరిగిన ETRetail ఈ-కామర్స్, డిజిటల్ నేటివ్స్ సమ్మిట్ 2023లో పాల్గొన్న ఆమె, పెట్టుబడుల గురించి కీలక విషయాలు వెల్లడించింది. “పెట్టుబడి అనేది జూదం లాంటిది. నేను ఏదైనా బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు రెండు విషయాలను కీలకంగా తీసుకుంటాను. కంపెనీ ఆలోచన, భవిష్యత్తు ప్రణాళికలను బేస్ చేసుకుని ఇన్వెస్ట్ మెంట్స్ పెడతాను” అని తెలిపింది. సినిమా అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో రకుల్ వ్యాపార రంగంపై ఫుల్ ఫోకస్ చేయాలని భావించడం మంచి నిర్ణయం అంటున్నారు సినీ అభిమానులు. సినిమా మాదిరిగానే వ్యాపారాల్లోనూ సక్సెస్ కావాలని అందరూ కోరుకుంటున్నారు.
Read Also: విలాసవంతమైన బంగళాలు, లగ్జరీ కార్లు - రకుల్, జాకీ ఆస్తుల విలువెంతో తెలుసా?