Rakesh Master - SKY Movie : 'స్కై'లో రాకేష్ మాస్టర్ - మరణించడానికి ముందు ఏ క్యారెక్టర్ చేశారో?
తెలుగు ప్రేక్షకులకు రాకేష్ మాస్టర్ తెలుసు. కొన్ని రోజుల క్రితం ఆయన ప్రాణాలు వదిలారు. అయితే... అంతకు ముందు ఆయన ఓ సినిమాలో నటించారు. అది 'స్కై'.
![Rakesh Master - SKY Movie : 'స్కై'లో రాకేష్ మాస్టర్ - మరణించడానికి ముందు ఏ క్యారెక్టర్ చేశారో? Rakesh Master plays key role in Prudhvi Pericharla's SKY movie latest Telugu news Rakesh Master - SKY Movie : 'స్కై'లో రాకేష్ మాస్టర్ - మరణించడానికి ముందు ఏ క్యారెక్టర్ చేశారో?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/21/8243456ca4708a6c54c0eab657c49a911695266718222313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు ప్రజలకు రాకేష్ మాస్టర్ (Rakesh Master) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఇంటర్వ్యూలు అయితేనేమి, అంతకు ముందు డ్యాన్స్ షోలు అయితేనేమి, 'జబర్దస్త్' స్కిట్స్ అయితేనేమి... ప్రేక్షకులను ఆయన అలరించారు. కొన్ని రోజుల క్రితం రాకేష్ మాస్టర్ ప్రాణాలు విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే... అంతకు ముందు ఆయన ఓ సినిమా చేశారు. అది 'స్కై' (SKY Telugu Movie).
అగాధమంత బాధ నుంచి ఆకాశం అంత ప్రేమ!
ఆనంద్, మురళీ కృష్ణం రాజు, శృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'స్కై'. అగాధమంత బాధ నుంచి ఆకాశం అంత ప్రేమ పుడితే... అనేది ఉప శీర్షిక. పృథ్వి పేరిచర్ల (Prudhvi Pericharla) దర్శకత్వం వహించారు. ప్రముఖ ఛాయాగ్రాహకులు రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), కనకవ్వ, దివంగత రాకేష్ మాస్టర్ ఇతర ప్రధాన తారాగణం.
వేలర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ సంస్థలో 'స్కై' సినిమా తెరకెక్కింది. నాగి రెడ్డి గుంటక, మురళీ కృష్ణం రాజు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అందులో రాకేష్ మాస్టర్ లుక్ చూపించారు. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read : బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?
'స్కై' సినిమా కథ ఏమిటి?
ప్రస్తుత కాలంలో మనిషి అందరి మధ్యలో ఉంటున్నాడు. కానీ, ప్రధాన నగరాల్లో జీవన విధానాలను గమనిస్తే... ప్రతి ఒక్కరివీ ఉరుకుల పరుగుల జీవితాలే. వారిలో చాలా మందికి మనస్ఫూర్తిగా చుట్టుపక్కల మనుషులతో మాట్లాడే తీరిక ఉండటం లేదు.
ఓ మనిషి జీవితంలో అన్నీ కోల్పోయి ఒంటరిగా జీవించాల్సి వస్తే? సంవత్సరాల తరబడి తాను అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనం మీద విజయం సాధించాడా? లేదా? లేదంటే 'ఏకాకి జీవితమే కదా' అని రోజు గడవడం కోసం తన చుట్టుపక్కల వాళ్ళను మోసం చేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నాడా? ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? ఎలా మలుస్తుంది? అనేది 'స్కై' కథాంశమని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు.
Also Read : మహేష్, చరణ్ నవ్వులు... అరవింద్, అశ్వినీదత్, దిల్ రాజు ముచ్చట్లు - ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో స్టార్స్
నిర్మాతలు మాట్లాడుతూ ''రసూల్ ఎల్లోర్ కెమెరా వర్క్, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ 'స్కై' చిత్రానికి ప్రధాన బలం. పృథ్వి పేరిచర్ల మంచి కథ రాశారు. అంతే ప్రభావవంతంగా తెరకెక్కించారు. ఇటీవల ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నాయి. మరో వైపు కొత్త కథలు, విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలను ఆదరిస్తున్నారు. మా సినిమాకు కూడా ప్రేక్షకాదరణ ఉంటుందని నమ్మకంగా ఉన్నాం. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చే చిత్రమిది'' అని చెప్పారు.
'స్కై' చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్ : కృష్ణా డిజిటల్స్, మాటలు : మురళీ కృష్ణం రాజు - పృథ్వి పేరిచర్ల, సంగీతం : శివ ప్రసాద్, కూర్పు : సురేష్ అర్స్, ఛాయాగ్రహణం : రసూల్ ఎల్లోర్, నిర్మాతలు : నాగి రెడ్డి గుంటక - మురళీ కృష్ణం రాజు, కథ - కథనం - మాటలు - దర్శకత్వం: పృథ్వి పేరిచర్ల.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)