Dil Raju On Political Entry : రాజకీయాల్లోకి 'దిల్' రాజు - స్టార్ ప్రొడ్యూసర్ మాట ఏంటంటే?
స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు రాజకీయాల్లోకి వస్తున్నారని, రావడానికి సన్నాహాలు చేస్తున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
సినిమాలను, రాజకీయాలను వేరు చేసి చూడలేం! సినిమాల్లో పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిన హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, ఆర్టిస్టులు ఉన్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరాది రాష్ట్రాల్లో సైతం రాజకీయాల్లోకి వచ్చిన సినిమా ప్రముఖులు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలకు వస్తే... నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలు రాజకీయాల్లో ఉన్నారు. నిర్మాతలు, ఆర్టిస్టుల గురించి చెబితే లిస్టు చాలా పెద్దది అవుతుంది. వాళ్ళను పక్కన పెడితే... స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని వార్తలు వినబడుతున్నాయి. లేటెస్టుగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ ప్రచారం పట్ల ఆయన స్పందించారు.
పొలిటికల్ ఎంట్రీ టాపిక్ ఇప్పుడు ఎందుకు?
'దిల్' రాజు కుమార్తె హన్షిత, అన్న కుమారుడు హర్షిత్ నిర్మించిన సినిమా 'బలగం'. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR)ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేశారు. హైదరాబాదులో కాకుండా సిరిసిల్లలో ఆ వేడుక నిర్వహించడం... కేసీఆర్, కేటీఆర్‌ను పొగడటంతో రాజకీయాల్లోకి రావడానికి 'దిల్' రాజు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం మొదలైంది.
సొంత ఊరిలో వెంకటేశ్వర ఆలయం కట్టించడంతో పాటు గత కొన్ని రోజులుగా అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కారణం కూడా అదేనని విశ్లేషణలు వచ్చాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో రాజకీయ నాయకులతో 'దిల్' రాజు బంధుత్వం ఉండటం కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చనే వార్తలకు బలం చేరకూర్చింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో 'దిల్' రాజు ఆ ప్రచారాన్ని కొట్టి పారేయలేదు. అలాగని, కన్ఫర్మ్ కూడా చేయలేదు.
ఎవరికి తెలుసు? కాలమే నిర్ణయిస్తుంది! - 'దిల్' రాజు
''మీడియాలో రాస్తారు (పొలిటికల్ ఎంట్రీ గురించి)! నాకు ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అనేది ఎవరికీ తెలియదు కదా! మా పెద్దన్నయ్య కోడలి తండ్రి కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలు (రాయలసీమలో) ఉన్నారు. మా చిన్న అన్నయ్య కూతురు వాళ్ళ మావయ్య తెలంగాణలో ఎమ్మెల్యే. మా బంధువుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు. అయితే, నా రాజకీయ ప్రవేశం గురించి నాకు తెలియదు. ఆ విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది'' అని 'దిల్' రాజు పేర్కొన్నారు.
Also Read : 'యాంగర్ టేల్స్' రివ్యూ : నాలుగు కథలు, ఒక్కటే ఎమోషన్ - వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Dil Raju Upcoming Movies : ప్రస్తుతం 'దిల్' రాజు నిర్మిస్తున్న సినిమాలకు వస్తే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'శాకుంతలం' సినిమా నిర్మాణంలో ఆయన కూడా భాగస్వామి. 'బలగం'తో దర్శకుడిగా పరిచయమైన వేణు దర్శకత్వంలో మరోసారి ప్రొడ్యూస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, కథ కుదరాల్సి ఉంది. ఇప్పుడు 'దిల్' రాజు ఫ్యామిలీలో రెండో తరం కూడా నిర్మాణంలోకి వచ్చింది. 'వారసుడు' సినిమాతో తమిళ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారు. పాన్ ఇండియా సినిమాలపై కూడా దృష్టి పెట్టారు.
Also Read : వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం