Paresh Rawal: 'హేరా ఫేరీ 3' మూవీ వివాదం - అక్షయ్ దావాపై పరేష్ రావల్ రియాక్షన్ ఇదే!
Hera Pheri 3 Movie: బాలీవుడ్ మూవీ 'హేరా ఫేరీ 3' నుంచి తాను తప్పుకోవడంపై అక్షయ్ కుమార్ లీగల్ నోటీసులకు పరేష్ రావల్ తాజాగా స్పందించారు. తన లాయర్ వారికి సమాధానం పంపినట్లు చెప్పారు.

Paresh Rawal About Akshay Law Suit On Hera Pheri 3 Movie Controversy: బాలీవుడ్ మూవీ 'హేరా ఫేరీ 3' వివాదం ముదురుతోంది. ఈ మూవీకి సంబంధించి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తనపై వేసిన దావాపై సీనియర్ యాక్టర్ పరేష్ రావల్ తాజాగా స్పందించారు. అక్షయ్ దావాకు తన లాయర్ ద్వారా సమాధానం పంపినట్లు తెలిపారు.
అన్నీ పరిష్కారం కావొచ్చు
'హేరా ఫేరీ 3' మూవీ నుంచి తాను సడన్‌గా తప్పుకోవడంపై తాజాగా పరేష్ రావల్ బహిరంగంగా స్పందించారు. 'అక్షయ్ కుమార్ దావాకు నా లాయర్ తగిన సమాధానం పంపారు. వారు దాన్ని చదివిన తర్వాత అన్నీ సమస్యలు పరిష్కారమవుతాయి.' అంటూ పరేష్ తన 'X' హ్యాండిల్‌లో ట్వీట్ చేశారు.
My lawyer, Ameet Naik, has sent an appropriate response regarding my rightful termination and exit. Once they read my response all issues will be laid to rest.
— Paresh Rawal (@SirPareshRawal) May 25, 2025
అసలేంటీ వివాదం?
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన మూవీ 'హేరా ఫేరీ'. ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2000లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇదే జోష్‌తో 2006లో సెకండ్ పార్ట్ తెరకెక్కించగా అది కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు మూడో పార్ట్ తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
Also Read: సెప్టెంబర్‌లో ఓజీ రిలీజ్... అఫీషియల్ డేట్ వచ్చేసింది... 2025లో పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా
తప్పుకొన్న పరేష్
అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ 'కేఫ్ గుడ్ ఫిలిం' బ్యానర్‌లో ఈ మూవీ రూపొందుతుండగా.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంటున్నట్లు సీనియర్ యాక్టర్ పరేష్ రావల్ ఇటీవల ప్రకటించడంతో వివాదం నెలకొంది. దీంతో రూ.25 కోట్ల పరిహారం కోరుతూ అక్షయ్ కుమార్ లీగల్ నోటీసులు జారీ చేశారు. పరేష్ సడెన్‌గా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో తమకు ఆర్థిక నష్టాలు, షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం అయ్యిందంటూ అక్షయ్ లాయర్ ఆరోపించారు.
లాయర్ తెలిపిన వివరాల ప్రకారం.. పరేష్ జనవరిలోనే ఈ సినిమాలో తాను ఉన్నానని కన్ఫర్మ్ చేసినట్లు తెలిపారు. అగ్రిమెంట్స్ చేసుకుని.. టీజర్ షూటింగ్‌లో కూడా పాల్గొన్నారని చెప్పారు. కానీ కొన్ని రోజుల క్రితం సడన్‌గా ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారని అన్నారు. దీనిపైనే లీగల్ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు.
15 శాతం వడ్డీతో తిరిగిచ్చేశారా!
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. పరేష్ రావల్ ఇప్పటికే సంతకం చేసిన రూ.11 లక్షల మొత్తాన్ని 15 శాతం వడ్డీతో పాటు తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. సినిమా నుంచి సడన్‌గా తప్పుకొన్నందుకు కొంత అదనపు డబ్బును కూడా చెల్లించినట్లు సమాచారం. 'హేరా ఫేరీ 3' కోసం రావల్ మొత్తం ఫీజు రూ.15 కోట్లుగా లాక్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇది సినిమా నిర్మాణ బడ్జెట్, కాంట్రాక్టు నిబంధనలకు అనుగుణంగా ఉంది.
అయితే, పరేష్ ఆకస్మికంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అటు బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇటు ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. 'హేరా ఫేరీ' సిరీస్‌లో బాబురావు గణపత్ రావ్ ఆప్టే పాత్రతో ఆకట్టుకున్నారు. తాను ఈ సినిమా వదిలేయడానికి క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణం కాదని.. డైరెక్టర్ ప్రియదర్శన్‌పై తనకు చాలా ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్నాయని పరేష్ ఇటీవల తెలిపారు. తాజాగా.. అక్షయ్ నోటీసులకు పరేష్ లాయర్ ఆన్సర్‌తో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.






















