మరోసారి ఆగిపోయిన 'ఉస్తాద్' షూటింగ్ - హరీశ్ శంకర్‌కి పవన్ డేట్స్ దొరకడం కష్టమేనా?
హరిశంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ మరోసారి వాయిదా పడింది. పవన్ పొలిటికల్ ఇష్యూస్ వల్ల పలుమార్లు షూటింగ్ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరిశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' కొత్త షెడ్యూల్ మూడు రోజుల కిందే ప్రారంభమైంది. లేక లేక చాలా గ్యాప్ తర్వాత షూటింగ్ మొదలెడితే అలా మొదలై ఇలా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల పదేపదే షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. శనివారం రోజు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కదా.
ఈ విషయంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వెంటనే యాక్షన్ లోకి దిగి చంద్రబాబుని కలవాలని అనుకున్నారు. కానీ పోలీసులు పవన్ ని అడ్డుకున్నారు. నిజానికి ఆ సమయంలో పవన్ ఉస్తాద్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఉన్నట్టుండి చంద్రబాబు అరెస్ట్ అవడంతో పవన్ వెంటనే రియాక్ట్ అయి విజయవాడ వెళ్లిపోయారు. పోలీసులు అడ్డుకున్నా కూడా వెనకాడకుండా రోడ్డుపై పడుకుని మరీ తన నిరసన తెలిపారు. పవన్ కి సినిమాలు చేయడం ఎంత ముఖ్యమో రాజకీయంగా ఆక్టివ్ గా ఉండడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో ఫ్యాన్స్ ఎప్పుడూ ఆయనకి మద్దతుగానే ఉంటారు.
అయితే పవన్ ఇలా షూటింగ్ మధ్యలో ఆపడం వల్ల నిర్మాతల పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. కానీ పవన్ పరిస్థితి అర్థం చేసుకొని దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ముందుగానే అనుకున్నారట. ఎందుకంటే పవన్ కూడా ముందుగా వాళ్లతో ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఇవన్నీ అంగీకరించాకే పవన్ కళ్యాణ్ మూవీ చేస్తున్నారు. ఇక తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ క్యాన్సిల్ చేసి పవన్ కళ్యాణ్ వెళ్లిపోయినా కూడా డైరెక్టర్ హరిశ్ శంకర్ మాత్రం షూటింగ్ ఆపలేదట. పవన్ లేకుండా ఇతర నటులతో ఉండే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
ఇప్పటికే రెండు, మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి మూడు నెలలుగా ఎటువంటి షూటింగ్ జరగలేదు. వారాహి యాత్ర వల్ల పవన్ కళ్యాణ్ మూడు నెలల గ్యాప్ తీసుకున్నారు. తీరా పవన్ వచ్చాక షూటింగ్ మొదలు పెడితే మధ్యలో ఇలాంటి రాజకీయ పరిణామాల వల్ల షూటింగ్ కి బ్రేకులు పడటంతో మూవీ టీం ఈ విషయంలో ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో పవన్ కళ్యాణ్ పార్ట్ మొత్తం షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి దాదాపు 70 రోజుల సమయం పడుతుందట.
అలాంటిది ఇలా మధ్యలో షూటింగ్ ఆగిపోతే హరిష్ శంకర్ షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తాడో? ఎప్పుడు రిలీజ్ చేస్తాడో? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికొస్తే.. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ - హరీష్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : పుష్ప గాడి రూలు మొదలయ్యేది అప్పుడే - మోస్ట్ అవైటెడ్ ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial