100 Years of NTR: 'లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం' - ఎన్టీఆర్ సినిమాల్లో మహిళాభ్యుదయం
ఎన్టీఆర్ తన సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ మహిళాభ్యుదయం కోసం పాటుపడ్డారు. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను పోగొట్టి, అన్నిరంగాల్లోనూ పురుషులతో సమానంగా ఎదగాలని కోరుకున్నారు.
తెలుగు సినిమా చరిత్ర పుటల్లో నిలిచిపోయే తొలి తరం నటులలో లెజండరీ నందమూరి తారక రామారావు ఒకరు. పౌరాణిక, జానపద, చారిత్రక, ఆధ్యాత్మిక, సాంఘిక.. ఇలా అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు చేసిన నటసార్వభౌముడు.. ఆబాలగోపాలాన్ని అలరించారు. వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో 'ఎన్టీవోడు'గా తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అయితే ఎన్టీఆర్ కేవలం హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మాస్ సినిమాలే కాకుండా, మహిళలకు ప్రాధాన్యమిచ్చే చిత్రాల్లోనూ నటించారు. తన సినిమాల ద్వారా మహిళాభ్యుదయం గురించి తెలియజెప్పే ప్రయత్నం చేసారు. 'మిస్సమ్మ' (1955), 'సతీ అనసూయ' (1957), ఇంటికి దీపం ఇల్లాలే (1961), గుండమ్మ కథ (1962) లాంటి చిత్రాలు ఇదే కోవకు చెందుతాయి.
మిస్సమ్మ
అలనాటి మేటి సినిమాల్లో 'మిస్సమ్మ' ఒకటి. ఇప్పటికీ ఇది కల్ట్ క్లాసిక్ మూవీ. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలుగా ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఈ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ రూపొందింది. ఇందులో మహానటి సావిత్రి, జమున హీరోయిన్లుగా నటించగా.. ఎస్వీ రంగారావు, రేలంగి వెంకటరామయ్య, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి కీలక పాత్రలు పోషించారు. 1955 జనవరి 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ రోజుల్లోనే మహిళల చదువు ఉద్యోగం, సమాజంలో స్త్రీల పాత్ర గురించి ఈ చిత్రంలో అంతర్లీనంగా చర్చించబడింది.
యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత రాసిన 'మన్మొయీ గర్ల్స్ స్కూల్' అనే హాస్య నవల ఆధారంగా చక్రపాణి, పింగళి నాగేంద్రరావులు 'మిస్సమ్మ' కథ రాసారు. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో, ముందుగా భానుమతిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమెతో కొంత మేర షూటింగ్ జరిపిన తర్వాత, ఒకరోజు షూటింగ్ కు ఆలస్యంగా వచ్చిందని చిత్ర నిర్మాత చక్రపాణితో జరిగిన గొడవ కారణంగా భానుమతిని తప్పించి, సావిత్రిని లీడ్ రోల్ కి ఎంపిక చేసుకున్నారు. టైటిల్ రోల్ లో నటించిన సావిత్రికి ఈ సినిమాతోనే అభినేత్రిగా మంచి గుర్తింపు లభించింది.
నిజానికి ఎన్టీఆర్ ముందు 'మిస్సమ్మ' సినిమాలో నటించలేనని చెప్పారట. హీరోయిన్ ను బ్రతిమాలుకోవడం ఏంటి? ఇలాంటి పాత్రలు చేస్తే పేరు పోతుందేమో అని సందేహించారట. దీంతో ఎల్వీ ప్రసాదు కలుసుగజేసుకొని ఈ చిత్రం నీకు మంచి పేరు తెస్తుంది. ఆ బ్రతిమాలుకునే సీన్లే నీకు ప్రేక్షకుల్లో బ్రహ్మరథం పట్టేలా చేస్తాయి అని చెప్పి రామారావుని ఒప్పించారట. దర్శకుడు చెప్పినట్టుగానే ప్రేక్షకులు నిజంగానే బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా 365 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ మహిళలకు ప్రాధాన్యత ఉండే సినిమాల్లో నటించడానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
గుండమ్మ కథ
రామారావు కెరీర్ లో 100వ చిత్రం 'గుండమ్మ కథ'. అప్పటికే అగ్ర హీరోగా రాణిస్తూ కూడా ‘గుండమ్మ’ కథలాంటి కమర్షియల్ సినిమాలో ఎన్టీఆర్ ఓ పల్లెటూరి వ్యక్తిగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తన కెరీర్ లో మైలురాయి చిత్రంగా మల్టీస్టారర్ ను ఎంపిక చేసుకోవడమే కాదు, సినిమాలో సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్ర పేరునే టైటిల్ గా పెట్టడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున కలిసి నటించిన ఈ చిత్రం, 1962 జూన్ 7న విడుదలైన సంచలనం సృష్టించింది.
షేక్స్ పియర్ రాసిన 'ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ' అనే నాటకం నుండి గుండమ్మ కథ పుట్టింది. ముందుగా ఈ స్టోరీతో 'మనె తుంబిద హెణ్ణు' అనే కన్నడ సినిమా తెరకెక్కింది. అదే తెలుగులో గుండమ్మ కథగా మారింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో విజయ వాహినీ సంస్థ నిర్మించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సూర్యకాంతానికి సినిమాలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. అలానే 'లేచింది నిద్రలేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుషప్రపంచం' అనే పాటలో మహిళాభ్యుదయం, మహిళా సాధికారిత వంటి అంశాలను చర్చించారు. అన్ని రంగాల్లో ఆడవారు రాణిస్తున్నారని, పురుషుల కంటే మహిళలు ఏమాత్రం తక్కువ కాదని రామారావు నోటితో ఈ సాంగ్ ద్వారా చెప్పించారు. ఈ పాట మరియు ఈ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.
సీఎంగా మహిళాభ్యుదయం కోసం పాటుపడిన ఎన్టీఆర్
అభ్యుదయ భావాలు కలిగిన ఎన్టీఆర్, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ మహిళల అభివృద్ధికి కృషి చేసారు. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను పోగొట్టి, అన్నిరంగాల్లో పురుషులతో పాటు సమానంగా ఎదగాలని కోరుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. 1980ల్లో మహిళలకు సమాన ఆస్తి హక్కును కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు రామారావు. కొడుకైనా, కూతురైనా ఒక్కటే.. ఇద్దరికీ ఆస్తిలో వాటా దక్కాల్సిందేనని పేర్కొన్నారు. అప్పటి నుంచే తండ్రి ఆస్తిలో కూతుర్లకు వాటా దక్కుతోంది. తండ్రి జీవించి ఉన్నా లేకున్నా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని.. కుమార్తెలు వారసత్వంగా ఆస్తిని పొందవచ్చని సుప్రీంకోర్టు సైతం అభయం ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి మూలం వేసింది నందమూరి తారక రామారావు అనే చెప్పాలి.