NTR: తాతయ్య ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరు - 'వార్ 2' ఈవెంట్‌లో తారక్
War 2 Pre Release Event: 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాతికేళ్ల సినీ ప్రయాణం గురించి మ్యాన్ ఆఫ్ మాసెస్ మాట్లాడారు. అలాగే, తాతయ్య ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని తెలిపారు.

NTR Speech At War 2 Pre Release Event: కథానాయకుడిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రయాణం పాతికేళ్ళ మైలురాయి చేరుకుంది. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'తో పాన్ ఇండియా విజయం అందుకున్న ఆయన... 'దేవర'తో విజయ పరంపర కొనసాగించారు. ఆల్రెడీ బాలీవుడ్ ప్రేక్షకులకు ఆయన తెలుసు. ఉత్తరాదిలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ సినిమా 'వార్ 2'లో ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాతికేళ్ల సినీ ప్రయాణం గురించి ఎన్టీఆర్ మాట్లాడారు. తాతయ్య ఎన్టీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నంత కాలం తనను ఎవరూ ఆపలేరని చెప్పారు. సినిమా వేడుకలో అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా చేశానని చెప్పడం ఎన్టీఆర్ అలవాటు. ఈసారి ఆయన రెండు కాలర్లు ఎగరేశారు. 'వార్ 2' డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పడం ఆయన ఉద్దేశం.
నన్ను యాక్సెప్ట్ చేసిన హృతిక్ గారికి థాంక్స్!
సౌత్, నార్త్ హద్దులను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చెరిపేసినప్పటికీ... నార్త్ (హిందీ) సినిమా చేసేటప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తారోనని చిన్నపాటి సందేహం ఉంటుందని, అయితే తనను యాక్సెప్ట్ చేయడంతో పాటు సాదరంగా స్వాగతించిన హృతిక్ రోషన్ గారికి థాంక్స్ చెప్పారు ఎన్టీఆర్. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా తనను పరిచయం చేసిన రామోజీ రావుకు ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు.
అప్పుడు అమ్మానాన్నలు తప్ప ఎవరూ లేరు...
పాతికేళ్ల క్రితం 'నిన్ను చూడాలని' పూజా కార్యక్రమానికి వెళ్లిన తన పక్కన తన తల్లిదండ్రులు తప్ప ఎవరూ లేరని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియని సమయంలో ముజీబ్ అనే వ్యక్తి వచ్చి తనకు అభిమాని అని, తన కోసం చచ్చిపోతానని చెప్పాడని ఆయన వివరించారు. ఆ వేదికపై ముజీబ్ అనే అభిమానిని పరిచయం చేశారు. ముజీబ్ తర్వాత ఈ 25 ఏళ్లలో చాలా మంది అభిమానులు తనతో పాటు వచ్చారని ఎన్టీఆర్ తెలిపారు.
Also Read:
ప్రేక్షకులు తనపై ఈ స్థాయిలో ప్రేమ, ఆదరాభిమానులు చూపిస్తున్నందుకు తాను మొట్టమొదటిగా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాల్సింది తల్లిదండ్రులు హరికృష్ణ, శాలిని, లక్ష్మీలతో పాటు అన్నయ్యలు జానకి రామ్, కళ్యాణ్ రామ్ కి అని ఎన్టీఆర్ చెప్పారు. వాళ్ళ ఆశీస్సులు తనపై ఉన్నందుకు ధన్యుడిని అని చెప్పారు. తనను ఆశీర్వదించిన నిర్మాతలకు, మంచి సినిమాలు ఇవ్వాలని ప్రయత్నించిన ప్రతి దర్శకుడికీ, సాంకేతిక నిపుణులకు థాంక్స్ చెప్పారు.
'వార్ 2' ప్రీ రిలీజ్ వేదిక మీద తాతయ్యను గుర్తు చేసుకున్నారు తారక్. ఆయన మాట్లాడుతూ... ''ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ - నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు'' అని చెప్పారు. తనకు రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలను ఇచ్చిన భార్య ప్రణతీకి సైతం ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు. అభిమానుల ప్రేమ, ఆదరణ సొంతం చేసుకున్నానని, ఈ జన్మకు తనకు ఇది చాలని, అభిమానులను ఎప్పటికీ అలరిస్తానని ఎన్టీఆర్ తెలిపారు. ఆగస్టు 14న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'వార్ 2' విడుదల కానుంది.
Also Read: ఎన్టీఆర్ ఇండియాలో కాలర్ ఎగరేయాలి... అదీ అభిమానుల బాధ్యత - 'వార్ 2' ఈవెంట్‌లో నాగవంశీ





















