Navdeep: అదే నా జీవితంలో మొదటి కాంట్రవర్సీ, అప్పుడు అడగకుండానే నాగబాబు సపోర్ట్ చేశారు - నవదీప్
Navdeep: నవదీప్ పర్సనల్ లైఫ్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ తిరుగుతూనే ఉంటుంది. వాటన్నింటిని తను ఎలా ఫేస్ చేస్తాడు అని తాజాగా బయటపెట్టాడు. అంతే కాకుండా మరెన్నో విశేషాలు కూడా పంచుకున్నాడు.
Navdeep: ముందుగా హీరోగా సక్సెస్ చూసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి చాలామంది ఒప్పుకోరు. కానీ నవదీప్ అలా కాదు. తనకు నచ్చితే పెద్ద హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు చేయడానికి అయినా ఓకే చెప్పేస్తాడు. అందుకే నవదీప్ కెరీర్‌లో ఎప్పుడూ పెద్దగా గ్యాప్ కనిపించదు. ప్రొఫెషనల్‌గా మాత్రమే కాకుండా పర్సనల్‌గా కూడా నవదీప్ పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా తన కెరీర్ గురించి, తన వ్యాపార పెట్టుబడుల గురించి, తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన కాంట్రవర్సీల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు నవదీప్.
నాగార్జున ఇన్‌స్పిరేషన్..
‘జై’ అనే మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నవదీప్. కానీ కృష్ణవంశీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘చందమామ’.. తనను ప్రేక్షకులకు దగ్గర చేసింది. ‘చందమామ’ తర్వాత ‘ఆర్య 2’లో హీరో ఫ్రెండ్‌గా కనిపించాడు నవదీప్. ఈ రెండు సినిమాల మధ్య రెండేళ్ల గ్యాప్ ఉంది. కృష్ణవంశీతో పనిచేసిన తర్వాత ఇంకా ఏ దర్శకుడు, ఏ కథ అంత ఈజీగా నచ్చదని, అందుకే ఆ గ్యాప్ వచ్చిందని బయటపెట్టాడు నవదీప్. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, గెస్ట్ రోల్స్‌లో కనిపించడానికి నాగార్జుననే ఇన్స్‌పిరేషన్ అని తెలిపాడు. ఒకప్పుడు టాప్ 4 హీరోల్లో నాగార్జున ఒకరు అయినా కూడా ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్ చేయడానికి ఆయనకు ఎలాంటి ఇన్‌సెక్యూరిటీ లేదని, అలా తాను కూడా నాగ్‌ను ఫాలో అయిపోతున్నానని అన్నాడు నవదీప్.
3 రోజుల్లో సినిమా అయిపోయింది..
తను హీరోగా నటించిన ‘మనసు మాట వినదు’ మూవీ టైమ్‌లో తనపై కాంట్రవర్సీ క్రియేట్ కాగా.. ఆ సమయంలో నాగబాబు తనకు సపోర్ట్‌గా నిలబడ్డారని గుర్తుచేసుకున్నాడు నవదీప్. తన జీవితంలో అదే మొదటి కాంట్రవర్సీ అని చెప్పుకొచ్చాడు. డ్రగ్స్ కేసులో తన పేరు బయటికి రావడం వల్ల తనకు సినిమా ఆఫర్లు ఏమీ తగ్గలేదని అన్నాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తను నటించిన ‘ఐస్‌క్రీమ్’ మూవీ గురించి మాట్లాడుతూ 4 రోజుల్లో సినిమా పూర్తయిపోయిందని, ఏదో అనుకొని ఏదో చేసేశామని, మొత్తంగా మూవీ పూర్తయ్యిందని చెప్పి నవ్వాడు నవదీప్. యాక్టర్‌గా మాత్రమే కాకుండా బిజినెస్‌మ్యాన్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు నవదీప్. కానీ ఆ బిజినెస్ వల్లే తనకు సమస్యలు వచ్చాయని, ఇప్పటికీ పలు వ్యాపారాలలో తను పెట్టుబడి పెట్టానని తెలిపాడు. తనపై వచ్చే కాంట్రవర్సీలను, ఫేక్ న్యూస్‌లను పెద్దగా పట్టించుకోనని అన్నాడు.
పోలీస్ కేసులు లేవు..
తనపై ఇప్పటివరకు పోలీస్ కేసులు ఏమీ లేవని, అవన్నీ కేవలం న్యూస్‌లే అని చెప్పుకొచ్చాడు నవదీప్. తనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 5 సినిమాల్లో అవకాశం వస్తే అందులో ఒకటి ఎంచుకుంటానని, అందుకే తనకు పొగరు అనుకుంటారని బయటపెట్టాడు. బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ దాని వల్ల తను చాలా ఎంటర్‌టైన్ అయ్యానని అన్నాడు. తానేంటో అందరికి చెప్పుకోవాలని అనిపించినప్పుడు బిగ్ బాస్ తనకు ఆ అవకాశం ఇచ్చిందని చెప్పాడు. తనకు 14, 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ చేశానని, దాని వల్ల ఒక వ్యక్తి చనిపోయారని మరోసారి గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో తన కజిన్‌లో కోల్పోవడమే అత్యంత బాధాకరమైన సంఘటన అని బాధపడ్డాడు. తన పెళ్లి గురించి చెప్తూ.. అదెప్పుడు జరుగుతుందో తనకే తెలియదని నవ్వుతూ చెప్పాడు నవదీప్.
Also Read: రేవ్ పార్టీపై స్పందించిన మంచు లక్ష్మీ - నా సపోర్ట్ ఎప్పుడు వాళ్లకే!