800 Movie: వెండితెరపై శ్రీలంక బౌలర్ ముత్తయ్య బయోపిక్ - సచిన్ రిలీజ్ చేసిన '800' ట్రైలర్ చూశారా?
శ్రీలంక లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధర జీవితం ఆధారంగా రూపొందిన లేటెస్ట్ మూవీ '800'. ఈ చిత్ర ట్రైలర్ ను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విడుదల చేశారు.
సినీ ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకర్స్ బయోపిక్స్ తెరకెక్కించడం సర్వసాధారణమనే విషయం తెలిసిందే. బయోపిక్ ని తెరకెక్కించడంలో బాలీవుడ్ మేకర్స్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలకు సంబంధించి ఎన్నో బయోపిక్స్ ని బాలీవుడ్ మేకర్స్ తెరకెక్కించారు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజాల బయోపిక్ లు ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించాయి. ఇక ఇప్పుడు క్రికెట్ నేపథ్యంలో మరో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా '800' అనే పేరుతో సినిమా తెరకెక్కుతోంది.
టెస్ట్ క్రికెట్ ప్రపంచంలో 800 వికెట్లు తీసి లెజెండరీ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నారు ముత్తయ్య మురళీధరన్. 'స్లమ్ డాగ్ మిలీనియర్' మూవీ ఫేమ్ మధుర్ మిట్టల్ ఈ మూవీలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే ఆయన భార్య మదిమల్లర్ పాత్రలో మహిమ నంబియార్ నటిస్తోంది. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి బుకర్ ప్రైజ్ 2022 పురస్కార గ్రహీత కరుణతిలక్ స్క్రిప్ట్ అందించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ ని సచిన్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. ట్రైలర్లో ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ ప్రయాణం, ఓ తమిళుడు అయిన ముత్తయ్య శ్రీలంక జట్టులోకి ఎలా వెళ్లాడు? అలా వెళ్లేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? క్రికెట్ జీవితంలో ఎత్తుపల్లాలు, గెలుపు, ఓటమి ఆయన పడిన అవమానాలు, రాజకీయాలు వంటి చాలా విషయాలను ఎంతో ఆసక్తికరంగాను.. అంతే ఉత్కంఠ భరితంగానూ చూపించారు. ఇక ట్రైలర్ చివరలో 'నేను క్రికెటర్' అని మధుర్ మిట్టల్ చెప్పడం హైలెట్ గా నిలిచింది.
నాజర్ నేరేషన్ లో మొదలైన ఈ ట్రైలర్ సుమారు మూడు నిమిషాల నిడివితో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆల్ ఇండియా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ దక్కించుకొని తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు.
నాజర్, నరేన్, వేల్ రామమూర్తి, రిత్విక, వడిఉక్కరసి, అరుల్ దాస్, హరికృష్ణ, శరత్ లోహితశ్వా తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని ట్రైన్ మోషన్ పిక్చర్ సంస్థ నిర్మించింది. జిబ్రాన్ సంగీతం అందించగా, ఆర్. డి. రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. తాజాగా విడుదలైన '800' మూవీ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్‌ను ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
Also Read : సనాతన ధర్మంపై ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు - రామ్ చరణ్ ట్వీట్ వైరల్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial