Malayalam Actor Siddique: రేవతిపై సీనియర్ నటుడు పోలీసులకు ఫిర్యాదు, అవన్నీ నిజం కాదని వెల్లడి
Actor Siddique: కేరళలో దుమారం రేపుతున్న కాస్టింగ్ కౌచ్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవతి సంపత్ పైన సిద్దిఖీ తిరిగి కేసు నమోదు చేశారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Malayalam Actor Siddique Files Police Complaint Against Revathy Sampath: కేరళ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ తీవ్ర దుమారం రేపుతోంది. జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా చాలామంది తమపై జరిగిన లైంగిక దాడులు గురించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నటి రేవతి సంపత్ తనపై లైంగిక దాడి జరిగిందంటూ ఆరోపణలు చేశారు. యాక్టర్, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ (AMMA) మాజీ జనరల్ సెక్రటరీ సిద్దిఖీపై ఆమె ఈ ఆరోపణలు చేశారు. అయితే, ఇప్పుడు ఆకేసులో ట్విస్ట్ నెలకొంది. సిద్దిఖీ తిప్పి రేవతిపై కేసు పెట్టారు. ఆమె ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు.
కలిసింది ఒక్కసారే..
రేవతి సంపత్ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు సిద్దిఖీ. ఈ మేరకు ఆమెపై కేసు నమోదు చేశారు. ఊటీలో ఉన్న ఆయన ఈమెయిల్ ద్వారా కేసు నమోదు చేశారు. రేవతి సంపత్ తనపై కావాలనే ఆరోపణలు చేస్తుందని అన్నారు సిద్దిఖీ. తన పరువుకు భంగం కలిగించాలని ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తుందని చెప్పారు. "ఆమెను నేను ఒక్కసారి మాత్రమే కలిశాను. అది కూడా ఒక సినిమా ప్రీమియర్ షో అప్పుడు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు కూడా పక్కనే ఉన్నారు. అంతే తప్పతే మళ్లీ ఎప్పుడూ కలవలేదు. నేను రేప్ చేశానని, నేను ఆమెను ఇబ్బంది పెట్టానని చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. ఏదో పెద్ద ప్లాన్ తోనే ఆమె నాపై ఆరోపణలు చేస్తుంది. 2019, 2021 మధ్య ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో తనపై జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదు. ఇప్పుడే మాట్లాడుతుంది. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆరోపణలు మాత్రమే" అని చెప్పారు సిద్దిఖీ.
అసలు వివాదం ఏంటంటే?
మలయాళం సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు గురించి జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. మాలీవుడ్ లో మహిళలు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారని, లైంగిక వేధింపులకు గురవుతున్నారని దాంట్లో ఉంది. ఈ నేపథ్యంలో నటి రేవతి సంపత్ తీవ్ర ఆరోపణలు చేసింది. హీరో సిద్దిఖీ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని చెప్పింది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఆ వ్యక్తి సినిమా ఛాన్సులు ఇస్తానని చెప్పి రేప్ చేశాడని ఆరోపించింది. "ఇదంతా సుమారు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన విషయం. అప్పుడు నాకు సినిమాల గురించి మాట్లాడాలి అని పిలిచి హోటల్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ నాపై రేప్ చేశాడు. ఆయన మంచి వాడు అనుకున్నా. కానీ, ఆయనలోని మరో కోణం నేను చూశాను" అని సిద్దిఖీపై తీవ్ర ఆరోపణలు చేసింది రేవతి.
కాగా.. తనపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ సిద్దిఖీ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశాడు. కాగా.. ఇప్పుడు మాత్రం ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ కేసు పెట్టారు సిద్దిఖీ. మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.
Also Read: ఆ నటుడు నన్ను వెనుక నుంచి వాటేసుకున్నాడు, మరొకరు రూమ్‌కు పిలిచి..: నటి మిను మునీర్