Mayoori Kango: సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసినా నో క్రేజ్ - ఇప్పుడు గూగుల్ ఇండియాలో టాప్ పొజిషన్‌లో..
Mahesh Babu: ఆమె ఒకప్పుడు మహేష్ బాబుతో కలిసి నటించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అనుకున్నంత సక్సెస్ రాలేదు. దీంతో కార్పొరేట్ రంగంలోకి వెళ్లి తనదైన నైపుణ్యంతో ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు.

Mahesh Babu's Heroine Mayoori Working As Manager At Google India: సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు సక్సెస్ వరిస్తుందో.. ఎప్పుడు డీ గ్రేడ్ అవుతారో చెప్పలేని పరిస్థితి. హీరో, హీరోయిన్ల విషయానికొస్తే హీరోలకు తొలుత ఒకటి రెండు ఫ్లాప్స్ వచ్చినా.. తర్వాతి సినిమాల్లో విజయం సాధించడం మనం చూసుంటాం. అయితే, హీరోయిన్ల విషయంలో ఒకసారి ఫ్లాప్ వస్తే ఆ తర్వాత అవకాశాలు రావడం కష్టం. వరుస సినిమాలు చేసినా సరైన హిట్ లేకుంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కష్టపడాల్సి రావొచ్చు. కొందరు హీరోయిన్లు ముందు ఎక్కువ సినిమాలు చేసినా ఆ తర్వాత సరైన అవకాశాలు రాక.. బిజినెస్, తాము ఎంచుకున్న కెరీర్‌లో స్థిరపడుతుంటారు. అలాంటి కోవక చెందిన వారే టాలీవుడ్ హీరోయిన్ మయూరి (Mayoori). కెరీర్ తొలినాళ్లలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) సినిమా చేసినా సినీ రంగంలో అనుకున్నంతగా రాణించలేకపోయారు. ఇప్పుడు గూగుల్ ఇండియాలో పనిచేస్తూ కార్పొరేట్ రంగంలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.
టాప్ పొజిషన్‌లో..
మహారాష్ట్రకు చెందిన మయూరి తొలిసారిగా బాలీవుడ్‌లో తన సినీ కెరీర్ ప్రారంభించారు. 1995లో నసీమ్ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత పాపా కెహెతే హై, బేటాబీ, హోగీ ప్యార్ కీ జీత్, మేరే అప్నే, బాదల్, పాపా ది గ్రేట్, జంగ్, శికారీ తదితర సినిమాల్లో నటించారు. స్టార్టింగ్‌లో ఆమె సినిమాలో బాగానే ఆడినా.. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు పలకరించాయి. 2000లో మహేష్ బాబు 'వంశీ' సినిమాలో.. మయూరి మహేష్ స్నేహితురాలిగా, ఓ మోడల్ పాత్రలో కనిపించారు. ఈ మూవీలో 'ఓహో సోనియా' అనే స్పెషల్ సాంగ్‌తో పేరొందారు. అనంతరం పలు సీరియల్స్‌లో నటించినా అంతకూ గుర్తింపు దక్కలేదు. చివరకు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి ఇప్పుడు కార్పొరేట్ రంగంలో తనదైన స్కిల్స్‌తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె గూగుల్ ఇండియాలో కీలక పదవిలో ఉన్నారు.
2003లో ఎన్ఆర్ఐ ఆదిత్య థిల్లాన్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం మయూరి.. తన భర్తతో కలిసి న్యూయార్క్ వెళ్లిపోయారు. అక్కడ ప్రముఖ కాలేజీ 'బరూచ్ కాలేజ్ జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్'లో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రముఖ గ్లోబల్ మీడియా ఏజెన్సీ పెర్ఫామిక్స్ అనే కంపెనీలో ఎండీ హోదాలో పనిచేశారు. డిజిటల్ మార్కెటింగ్, వ్యాపార వ్యూహంలో ఆమెకున్న స్కిల్స్ గూగుల్ ఇండియాలో హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ రోల్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గూగుల్ ఇండియా మేనేజర్‌గా.. డిజిటల్ స్ట్రాటజీస్, ఇన్నోవేషన్స్ విభాగాన్ని ఆమె పర్యవేక్షిస్తున్నారు. కార్పొరేట్ రంగంలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు. ఓ రంగంలో అంతగా సక్సెస్ లేకపోయినా తనకు నచ్చిన రంగంలో తనదైన మార్క్ చూపిస్తూ విజయ పథంలో కొనసాగుతోన్న మయూరి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.






















