(Source: ECI/ABP News/ABP Majha)
Maamannan Telugu Release : కమల్ హాసన్ టైటిల్‌తో తెలుగులోకి ఉదయనిధి స్టాలిన్ 'మామన్నన్' - రిలీజ్ ఎప్పుడంటే?
Udhayanidhi Stalin's Nayakudu Telugu Movie : ఉదయనిధి స్టాలిన్, వడివేలు, కీర్తీ సురేష్, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా 'మామన్నన్'. తెలుగు టైటిల్, విడుదల తేదీ వెల్లడించారు.
తమిళనాట రాజకీయంగానూ సంచలనమైన సినిమా 'మామన్నన్' (Maamannan Movie In Telugu). అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి... ఈ చిత్ర కథాంశం, అందులో డైలాగులు. ఇది రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. రెండు... ఇందులో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కథానాయకుడు కావడం!
విమర్శకుల ప్రశంసలు & వసూళ్ళు!
'మామన్నన్' మీద వచ్చిన విమర్శలు, వివాదాలు పక్కన పెడితే... విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే, తమిళ ప్రేక్షకుల నుంచి సైతం మంచి స్పందన లభించింది. దాంతో వసూళ్లు కూడా బాగా వచ్చాయి. తమిళనాట థియేటర్లలో జూన్ 29న 'మామన్నన్' విడుదల కాగా... ఇప్పటి వరకు రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇప్పుడీ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
జూలై 14న 'నాయకుడు'గా 'మామన్నన్'
Maamannan as Nayakudu in Telugu : 'మామన్నన్' తెలుగు అనువాదానికి 'నాయకుడు' టైటిల్ ఖరారు చేశారు. జూలై 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ మల్టీప్లెక్స్, సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్నాయి.
'నాయకుడు' అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది కమల్ హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా. రాజశేఖర్, నమిత జంటగా నటించిన ఓ సినిమాకు కూడా ఆ టైటిల్ పెట్టారు. కమల్ 'నాయకుడు' కల్ట్ హిట్. మరి, ఉదయనిధి స్టాలిన్ సినిమాకు తెలుగులో ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
'నాయకుడు'లో ఎవరెవరు ఉన్నారు?
ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలు (Vadivelu) 'నాయకుడు'లో ప్రధాన పాత్ర పోషించారు. హీరోతో పాటు ఆయనది సమానమైన పాత్ర, తండ్రి పాత్ర. టైటిల్ పాత్రధారి ఆయనే. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా వడివేలు కనిపిస్తారు. ఇంకా ఈ సినిమాలో మహానటి కీర్తీ సురేష్, 'పుష్ప' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన మలయాళ కథానాయకుడు ఫహాద్ ఫాజిల్ ఉన్నారు. ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.
పాట విని కన్నీళ్లు పెట్టుకున్న కమల్!
'నాయకుడు' చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తమిళ ఆడియో విడుదల కార్యక్రమానికి లోక నాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఏఆర్ రెహమాన్ లైవ్ ప్రదర్శన ఇవ్వగా... పాట విని కమల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read : రికార్డు రేటుకు ప్రభాస్ 'సలార్' తెలుగు థియేట్రికల్ రైట్స్ - ఇది రెబల్ స్టార్ ర్యాంపేజ్!
'మామన్నన్' విడుదలకు ముందు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ఇది తన చివరి సినిమా అని పేర్కొన్నారు. దాంతో నిర్మాత రామ శరవణన్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోరారు. కోర్టు ఆయన పిటీషన్ కొట్టేసింది అనుకోండి! అసలు, స్టే ఇవ్వమని వెళ్ళడానికి కారణం ఏమిటి? అంటే... ఉదయనిధి స్టాలిన్ హీరోగా కెఎస్ అదయమాన్ దర్శకత్వంలో తాను ఓ సినిమా నిర్మిస్తున్నానని, ఆ సినిమా చిత్రీకరణ దాదాపు 80 శాతం పూర్తి అయ్యిందని, సుమారు రూ. 13 కోట్లు ఖర్చు చేశానని, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ సినిమాలు మానేస్తే తనకు నష్టం వస్తుందని పేర్కొన్నారు.
Also Read : 'సలార్' టీజర్‌లో 'కెజియఫ్ 2' హింట్స్ - ఆ అంశాలు గమనించారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
View this post on Instagram