SPB Charan: బెట్టింగ్ మాఫియాకు మైథాలజీ టచ్ - తండ్రిగా ఎస్పీబీ చరణ్, టీజర్ చూశారా?
LYF (Love Your Father) Teaser: ఎస్పీబీ తనయుడు చరణ్ మళ్ళీ నటన మీద దృష్టి పెట్టారు. తండ్రి పాత్రతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. బెట్టింగ్ మాఫియా మైథాలజీ టచ్ ఉన్న ఆ సినిమా టీజర్ చూశారా?

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీబీ చరణ్ (SPB Charan)లో నటుడు కూడా ఉన్నాడు. హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత మేకప్ వేసుకోవడం మానేసి మైక్ పట్టుకుని పాటలు పాడడం పూర్తిస్థాయి వృత్తిగా ఎంచుకున్నారు. అయితే... ఇప్పుడు మరోసారి ఆయన నటన మీద దృష్టి పెట్టారు. తండ్రి పాత్రలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఆ సినిమా టీజర్ విడుదల అయింది.
లవ్ యువర్ ఫాదర్... తండ్రిగా ఎస్పీబీ చరణ్!
ఎస్పీబీ చరణ్ తండ్రి పాత్రలో నటించిన సినిమా 'ఎల్.వై.ఎఫ్'. లవ్ యువర్ ఫాదర్ అని అర్థం. ఇందులో శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా నటించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.
'లవ్ యువర్ ఫాదర్' సినిమా టీజర్ చూస్తే కిషోర్ పాత్రలో ఎస్పీబీ చరణ్ నటించారని అర్థం అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి ఆయనకు అనాథలకు సాయం చేయడం, సంఘ సేవ వంటివి ప్రవృత్తి. ఆయనకు ఒక కుమారుడు. అబ్బాయి పేరు సిద్దు. ఆ పాత్రలో శ్రీహర్ష నటించారు. ఆ అబ్బాయికి ఒక ప్రేమ కథ ఉంది. అతని ప్రేయసిగా కషికా కపూర్ నటించింది.
సంతోషంగా సాగిపోతున్న తండ్రి కుమారుల జీవితంలోకి హార్స్ రైడింగ్ బెట్టింగ్ మాఫియా ఎలా ఎంటర్ అయింది? మన గేమ్ స్టార్ట్ చేయాలి అని కొడుకుతో కిషోర్ ఎందుకు చెప్పాడు? వాళ్ళిద్దరూ స్టార్ట్ చేసిన గేమ్ ఏమిటి? సంఘసేవ ముసుగులో నిజంగానే కిషోర్ అతని కుమారుడు సిద్దు బెట్టింగ్ మాఫియాతో చేతులు కలిపారా? లేదంటే బెట్టింగ్ మాఫియా బయట పెట్టడానికి కొత్త ఆట ఆడారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. టీజర్ చివరిలో శివ అంటూ నాగ సాధువులు రావడం చూస్తుంటే... బెట్టింగ్ మాఫియా కాథకు మైథాలజీ టచ్ ఇచ్చారని అర్థమవుతుంది.
మంచి కథా బలంతో వస్తున్న 'ఎల్.వై.ఎఫ్' సినిమా విజయం సాధించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. భారీ బడ్జెట్ సినిమాలు తీసి టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం కంటే తక్కువ నిర్మాణ వ్యయంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచిదని ఆయన హితవు పలికారు.
ఎల్ వై ఎఫ్ (లవ్ యువర్ ఫాదర్) చిత్రాన్ని మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ సంస్థలపై కిషోర్ రాఠి, మహేష్ రాఠి, ఏ రామస్వామి రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రవీణ్, భద్రం, నవాబ్ షా, షకలక శంకర్, రవిబాబు, రియా, సంధ్య తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు, యాక్షన్: కార్తీక్ క్రౌడర్, ఎడిటర్: ఆర్.కె.
Also Read: మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి... సీజ్ ద లయన్, SSMB29 షూటింగ్ షురూ





















