Fish Venkat: ఫిష్ వెంకట్‌కు మరో హీరో ఆర్థిక సాయం - ఫ్యామిలీకి రూ.2 లక్షల చెక్ అందజేత
Krishna Manineni: కమెడియన్ ఫిష్ వెంకట్‌కు మరో హీరో ఆర్థిక సాయం అందించారు. 'జెట్టి' మూవీ హీరో కృష్ణ మానినేని ఆస్పత్రిలో వారిని పరామర్శించి ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందజేశారు.

Krishna Manineni Helped To Fish Venkat: టాలీవుడ్ కమెడియన్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కిడ్నీలు ఫెయిలై ఆయన గత కొద్ది రోజులుగా బోడుప్పల్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సర్జరీ కోసం ఆర్థిక సాయం అందించాలంటూ ఆయన ఫ్యామిలీ వేడుకోగా దాతలు స్పందిస్తున్నారు.
మరో హీరో సాయం
ఫిష్ వెంకట్ దీన స్థితికి చలించిన మరో హీరో ఆయనకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చారు. 'జెట్టి' మూవీ హీరో కృష్ణ మానినేని వెంకట్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షలు అందించారు. PRK ఆస్పత్రిలోని వెంకట్ కుమార్తె స్రవంతికి ఈ సాయం అందజేశారు. దీంతో ఆయనకు వారి ఫ్యామిలీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
'100 డ్రీమ్స్ ఫౌండేషన్' ద్వారా ఈ ఆర్థిక సాయం అందించినట్లు హీరో కృష్ణ మానినేని తెలిపారు. '100 Dreams Foundationలో ఒక కార్యక్రమం అయిన పునరపి (అవయవ దానం అవగాహన కార్యక్రమం) మా ఆశయం మాత్రమే కాదు. అవసరంలో ఉన్న వారికి జీవితం ఇవ్వాలన్న సంకల్పం. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క నిర్ణయం – ఒక జీవితం.' అని తెలిపారు.
Also Read: నయనతార విఘ్నేష్ డివోర్స్ రూమర్స్ - సింగిల్ ఫోటోతో చెక్ పెట్టేశారుగా...
విశ్వక్ సాయం
వెంకట్ దీన స్థితిని చూసి యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇప్పటికే రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. వారి ఫ్యామిలీకు చెక్ పంపించారు. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం సైతం వెంకట్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించి ఆయనకు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఆస్పత్రిలో వెంకట్‌ను పరామర్శించిన మంత్రి వాకాటి శ్రీహరి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.
వెంకట్‌కు రెండు కిడ్నీలు పాడైపోయాయని... ప్రస్తుతం ఒక కిడ్నీ అయినా మార్చాలని వైద్యులు తెలిపారు. సర్జరీకి రూ.50 లక్షలు అవసరం అవుతాయని చెప్పారు. తమకు ఆర్థిక సాయం అందించాలంటూ వెంకట్ భార్య సువర్ణ, కుమార్తె స్రవంతి మీడియా ముందుకొచ్చి విజ్ఞప్తి చేశారు. సెలబ్రిటీలు స్పందించాలని కోరారు. తమ ఇల్లు అమ్మినా ఆ డబ్బు ఏ మాత్రం సరిపోవని అన్నారు.
గత కొన్నేళ్లుగా డయాలసిస్ చేయిస్తున్నామని... ఇప్పుడు కిడ్నీ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందంటూ వెంకట్ కుమార్తె స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఆరోగ్యంపై ఆందోళనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి దీన స్థితిపై స్పందించి సాయం అందజేసిన హీరోలకు కృతజ్ఞతలు తెలిపారు. 'నా కిడ్నీ నాన్నకు మ్యాచ్ కాలేదు. నాన్న తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కిడ్నీ దాతల కోసం డోనర్లను సంప్రదిస్తున్నాం.' అంటూ చెప్పారు.
కమెడియన్‌గా పాపులారిటీ...
తనదైన యాక్టింగ్‌తో కమెడియన్, విలన్‌గా మెప్పించారు ఫిష్ వెంకట్. స్టార్ హీరోల సరసన నటించారు. బన్నీ, గబ్బర్ సింగ్, దిల్, నాయక్, అత్తారింటికి దారేది, ఢీ, అదుర్స్, ఖైదీ నెం.150, ఆడో రకం ఈడో రకం, కాఫీ విత్ ఎ కిల్లర్, 'మా వింత గాధ వినుమా' మూవీస్‌లో నటించారు.






















