Keerthy Suresh: ‘కల్కి 2898 ఏడీ’లో ముందుగా ఆ పాత్రలో కీర్తి సురేశ్ - నో చెప్పి మంచి పని చేశానంటూ కామెంట్స్
Keerthy Suresh: ‘కల్కి 2898 ఏడీ’లో కీర్తి సురేశ్.. బుజ్జిగా తన వాయిస్‌తో అందరినీ మెప్పించింది. అయితే ముందుగా తనను వేరే పాత్ర కోసం నాగ్ అశ్విన్ అప్రోచ్ అయ్యాడని తాజాగా బయటపెట్టింది ఈ భామ.
Keerthy Suresh In Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసిన అది పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటుంది. కానీ దానిని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లాడు దర్శకుడు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ హిట్‌ను సాధించింది. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరికీ ఈ మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ‘కల్కి 2898 ఏడీ’లో తాను నేరుగా కనిపించకపోయినా సినిమా సక్సెస్‌కు తనవంతు సాయం అందించింది కీర్తి సురేశ్. అయితే ముందుగా కీర్తిని ఒక పాత్ర కోసం అప్రోచ్ అవ్వగా తను ఓకే చేయలేదనే వార్త తాజాగా బయటికొచ్చింది.
నాగ్ అశ్విన్‌తో స్నేహం..
కీర్తి సురేశ్, నాగ్ అశ్విన్‌కు మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. 2018లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’లో కీర్తి అద్భుతంగా నటించి నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. ఆ సినిమాతోనే నాగ్ అశ్విన్‌కు కూడా దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. అలా వారిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌తోనే ‘కల్కి 2898 ఏడీ’లో బుజ్జి అనే ఒక రోబో క్యారెక్టర్‌కు తన వాయిస్‌తో ప్రాణం పోసింది కీర్తి సురేశ్. అయితే ముందుగా తనను కేవలం రోబోకు వాయిస్ అందించడం కోసం కాకుండా ‘కల్కి 2898 ఏడీ’లో ఒక క్యారెక్టర్ చేయమని నాగ్ అశ్విన్ అప్రోచ్ అయ్యాడని కీర్తి సురేశ్ తాజాగా బయటపెట్టింది. కానీ దానికి ఎందుకు నో చెప్పిందనే విషయం మాత్రం బయటపెట్టలేదు.
నో చెప్పాను..
‘‘కల్కి 2898 ఏడీలో ఒక పాత్ర చేయమని నాగ్ అశ్విన్ నాకు ఆఫర్ ఇచ్చాడు. ఆ పాత్ర ఏది అని నాకు కూడా సరిగా తెలియదు. కానీ దానికి నో చెప్పి మంచి పనిచేశానని అనిపిస్తుంది. తర్వాత తను నాకు ఒకరోజు మెసేజ్ చేసి కనీసం సినిమాలో ఏదో ఒకవిధంగా భాగమవుతావా అని అడిగాడు. కచ్చితంగా అవుతానని చెప్పాను’’ అని వివరించింది కీర్తి సురేశ్. అయితే ఇది విన్న ప్రేక్షకులంతా ఆన్నా బెన్ నటించిన ‘కైరా’ పాత్రలో కీర్తి సురేశ్‌ను తీసుకోవాలని నాగ్ అశ్విన్ అనుకున్నాడేమో అని అంచనాలు వేయడం మొదలుపెట్టారు. ఆ పాత్ర కాదంటూ కీర్తి క్లారిటీ ఇచ్చింది. ముందుగా తనకు రోబోకు వాయిస్ ఇవ్వాలని చెప్పినప్పుడు అర్థం కాలేదని చెప్పుకొచ్చింది.
అది చాలా ఈజీ..
‘‘ఒక ఏఐ బోట్‌కు వాయిస్ ఇవ్వాలని నాగ్ అశ్విన్ నాకు చెప్పినప్పుడు నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ముందుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయిన బుజ్జి అండ్ భైరవకు నేను డబ్బింగ్ చెప్పాను. ఎన్నో భాషల్లో, ప్రతీ భాషలో వేర్వేరు మాడ్యులేషన్స్‌తో డబ్బింగ్ చెప్పడంలో నాకు చాలా మజా వచ్చింది. మామూలుగా ఒక సినిమాకు డబ్బింగ్ చెప్పడం దీనికంటే ఈజీ’’ అని తెలిపింది కీర్తి సురేశ్. ఇక ‘కల్కి 2898 ఏడీ’లో కీర్తి సురేశ్ ప్రత్యక్షంగా కనిపించకపోయినా.. తన డైలాగులతోనే ప్రేక్షకులను నవ్వించింది. ముఖ్యంగా ప్రభాస్‌ను ఎప్పుడూ ఏడిపించే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌లాగా బుజ్జిని అందరూ ఇష్టపడ్డారు.
Also Read: చైతూ, శోభితాపై కామెంట్స్ - వేణు స్వామికి మంచు విష్ణు వార్నింగ్? పోలీసు కేసు నమోదు