Karan Johar: కరణ్ జోహార్ బర్త్ డే స్పెషల్ - ఈ ఫేమస్ ఫిల్మ్ మేకర్ విలన్‌గా నటించిన మూవీ గురించి మీకు తెలుసా?
Karan Johar Birthday: బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న ఫిల్మ్ మేకర్స్‌లో కరణ్ జోహార్ ఒకరు. మే 25న తన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ప్రొఫెషనల్ లైఫ్‌లోని పలు ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేయండి.
Happy Birthday Karan Johar: బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ వారందరిలో కరణ్ జోహార్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్‌కు బాలీవుడ్ సెలబ్రిటీల్లో చాలా పాపులారిటీ ఉంది. దాదాపు బాలీవుడ్‌లోని చాలావరకు బడా స్టార్లు అంతా కరణ్‌కు బెస్ట్ ఫ్రెండ్సే. తన మాటతీరు, స్టైలింగ్ చూసి చాలామంది కరణ్‌ను విమర్శించినా.. తనను ఫ్యాషన్ ఐకాన్‌లాగా భావించే ప్రేక్షకులు కూడా ఉన్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తను ఎన్ని మర్చిపోలేని హిట్స్ ఇచ్చినా.. దర్శకుడిగా తను తెరకెక్కించిన ప్రేమకథలకే ఎక్కువగా ఆదరణ లభించింది. ఇక ఈ 52 ఏళ్ల ఫిల్మ్ మేకర్ పుట్టినరోజు సందర్భంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలపై ఓ లుక్కేయండి.
ప్రేమకథల్లో దిట్ట..
1998లో విడుదలయిన ‘కుచ్ కుచ్ హోతా హై’ అనే సినిమాతో దర్శకుడిగా తన జర్నీని ప్రారంభించాడు కరణ్ జోహార్. ఇప్పటికే ఫ్రెండ్స్ టు లవర్స్ జోనర్ సినిమాల్లో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది ‘కుచ్ కుచ్ హోతా హై’. ఆ తర్వాతే షారుఖ్ ఖాన్‌తో ‘కభీ ఖుషీ కభీ ఘమ్’, ‘కభీ అల్విదా నా కెహ్నా’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ లాంటి ఫ్యామిలీ లవ్ స్టోరీలను డైరెక్ట్ చేశాడు కరణ్. మామూలుగా షారుఖ్ ఖాన్‌ను అందరూ బాలీవుడ్ బాద్‌షా అని, కమర్షియల్ హీరో అని అంటుంటారు. కానీ కరణ్ జోహార్ మాత్రమే తనలోని లవ్ యాంగిల్‌లో బయటపెట్టాడు. అలాగే షారుఖ్, కాజోల్ పెయిర్‌కు అంత పాపులారిటీ రావడానికి కరణ్ కూడా ఒక కారణమే.అందుకే మరోసారి కరణ్ జోహార్ డైరెక్షన్‌లో షారుఖ్, కాజోల్ నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు.
నెపో కిడ్స్‌పై ఫోకస్..
బాలీవుడ్‌లో నెపో కిడ్స్‌ను లాంచ్ చేయాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు కరణ్ జోహార్. యంగ్ టాలెంట్‌ను, ఏ బ్యాక్‌గ్రౌండ్ లేనివారిని ఎంకరేజ్ చేయకుండా కేవలం నెపో కిడ్స్‌ను లాంచ్ చేయడానికి మాత్రమే కరణ్ ఇష్టపడుతున్నాడని తనపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అయినా వాటికి తను ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీని నిర్మించి అందులో ఆలియా భట్, వరుణ్ దావన్ లాంటి నెపో కిడ్స్‌ను లాంచ్ చేశాడు. ఆ తర్వాత అదే సినిమాకు సీక్వెల్‌తో అనన్య పాండే, తారా సుతారియా లాంటి హీరోయిన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆఖరికి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం చేసిన క్రెడిట్ కూడా కరణ్‌కే దక్కుతుంది.
టాలీవుడ్‌తో..
టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లో మార్కెటింగ్ చేసేందుకు కూడా కరణ్ ముందే ఉంటాడు. బాహుబలి సినిమాను హిందీలోకి తీసుకెళ్లింది కరణ్ జోహార్‌నే. అప్పట్లో చిత్రబృందంతో కలిసి ప్రమోషన్లలో పాల్గొన్నాడు. ఓ రకంగా హిందీలో బాహుబలి మేకర్స్‌కి అంత క్రేజ్ రావడానికి ఓ రకంగా కరణ్ కూడా సహాయం చేశాడు. ఎప్పుడూ బీ టౌన్ హీరో, హీరోయిన్లను ఇంటర్వ్యూలు చేసిన కరణ్.. బాహుబలి నుంచి సౌత్ హీరోలు, హీరోయిన్లతో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడు.
విలన్ పాత్రలో..
ఎక్కువగా ఆఫ్ స్క్రీన్ నిర్మాతగా, దర్శకుడిగా మాత్రమే కనిపించే కరణ్ జోహార్.. అప్పుడప్పుడు ఆన్ స్క్రీన్‌పైన కూడా మెరిశాడు. ముందుగా 1995లో విడుదలయిన ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’లో హీరో ఫ్రెండ్ పాత్రలో కరణ్ జోహార్ నటించిన విషయం చాలామందికి తెలిసిందే. ఆ తర్వాత ‘ఓం శాంతి ఓం’, ‘ఫ్యాషన్’, ‘లక్ బై ఛాన్స్’ లాంటి చిత్రాల్లో కూడా తను గెస్ట్ రోల్స్‌లో కనిపించాడు. అంతే కాకుండా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాంబే వెల్వెట్’ సినిమాలో ఏకంగా విలన్‌గా నటించి అలరించాడు కరణ్. ఈ మూవీ ప్రేక్షకులను ఎక్కువగా రీచ్ అవ్వలేకపోయింది. ఇక మే 25న కరణ్ జోహార్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలకు గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశాడు. అంతే కాకుండా త్వరలోనే మరోసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించాడు.
Also Read: అమ్మ మళ్లీ తిరిగి వస్తుంది అనిపిస్తుంది- ఆ మాటలు కంటతడి పెట్టించాయన్న జాన్వీ కపూర్