Kantara Chapter 1 : "కాంతారా చాప్టర్ 1" ఆర్టిస్టుల బస్సు బోల్తా... ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
Kantara Chapter 1 Rishab Shetty: రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న మూవీ "కాంతారా చాప్టర్ 1". ఈ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న మినీ బస్సు ప్రమాదానికి గురైంది.
Kantara Chapter 1: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం "కాంతారా చాప్టర్ 1". తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది. షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ బస్సు బోల్తా పడడంతో పలువురికి గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.
చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, రికార్డులు బద్దలు కొట్టిన సూపర్ హిట్ కన్నడ మూవీ "కాంతారా". ముందుగా కన్నడ భాషలో రిలీజై, బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న తర్వాత ఈ సినిమా ఇతర భాషలో రిలీజ్ అయ్యి, అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ ను అందుకుంది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్ గా "కాంతారా చాప్టర్ 1" అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉండగా, శర వేగంగా షూటింగ్ జరుగుతోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ "కాంతారా చాప్టర్ 1" సినిమాను భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రను కూడా పోషిస్తున్నారు. ఈ మూవీ "కాంతారా" సినిమాకు ప్రీక్వెల్ గా రాబోతుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే "కాంతారా చాప్టర్ 1" సినిమాలో నటిస్తున్న పలువురు జూనియర్ ఆర్టిస్టులు వెళ్తున్న మినీ బస్సు బోల్తా పడిందన్న విషయం షాకింగ్ గా మారింది. కొల్లూరు సమీపంలోని జెడ్కల్ లో బస్సు బోల్తా పడినట్టుగా తెలుస్తోంది.
ఇందులో దాదాపు 20 మంది జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తుండగా, అందులో 6 మందికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. ప్రస్తుతం గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇంకా ప్రమాదానికి గురైన బాధితులు ఎలా ఉన్నారు అన్న సమాచారం తెలియ రాలేదు. కానీ అందరూ క్షేమంగానే ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది. దీంతో బాధిత కుటుంబాలతో పాటు "కాంతారా చాప్టర్ 1" మూవీ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ ఊహించని సంఘటనతో "కాంతారా చాప్టర్ 1" షూటింగుకు బ్రేకులు పడే ఛాన్స్ ఉంది. అలాగే చిత్రబృందం నుంచి ఇంకా దీనిపై అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.
ఇదిలా ఉండగా "కాంతారా చాప్టర్ 1" సినిమాను 2025 అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే కేవలం కన్నడ భాషలోనే రూపొందిన "కాంతారా" సినిమాలో నటనకుగాను రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు వరించింది. ఇప్పుడు ప్రీక్వెల్ ని ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు రిషబ్ శెట్టి జై హనుమాన్" మూవీలో హనుమంతుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీతో పాటు రిషబ్ శెట్టి "కాంతారా చాప్టర్ 1" కూడా పాన్ ఇండియా సినిమానే కావడం విశేషం.