(Source: ECI/ABP News/ABP Majha)
Re-Release Trend: టాలీవుడ్లో రీ-రిలీజుల ట్రెండ్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనా?
Re-Release Trend : టాలీవుడ్లో ట్రెండ్‌గా మారిపోయిన రీ-రిలీజులకు బ్రేక్స్ వేయాల్సిన టైమొచ్చిందా? ఫ్యాన్స్‌కి రీ-రిలీజులు బోర్ కొట్టేశాయా? రీ-రిలీజులుకు అప్పుడున్నంత హైప్ ఇప్పుడు ఉండటం లేదా?
Re-Release Trend : గత కొంతకాలంగా టాలీవుడ్ రీ-రిలీజుల ట్రెండ్ నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన చిత్రాలను, కల్ట్ క్లాసిక్ సినిమాలను 4K రెజల్యూషన్‌లో మళ్ళీ థియేటర్లలో విడుదల చేయడం మనం చూస్తున్నాం. హీరోల బర్త్ డే స్పెషల్‌గా, లేదా మరేదైనా ప్రత్యేకమైన రోజుల్లో రిలీజ్ చేసిన సినిమాలను జనాలు బాగానే ఆదరించారు. అయితే ఇప్పుడు మెల్ల మెల్లగా రీ రిలీజుల క్రేజ్ తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది. ఇటీవల విడుదలైన కొన్ని సినిమా కలెక్షన్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
రీరిలీజుల ట్రెండ్ వల్ల ఒకప్పుడు థియేటర్లలో ఆ సినిమాలను చూడలేకపోయిన ప్రేక్షకులకు ఇప్పుడు చూసే అవకాశం కలుగుతుంది. అభిమానులు మరోసారి తమకు నచ్చిన చిత్రాలను చూసి ఎంజాయ్ చేయొచ్చు. అందుకే సినీ ప్రియుల నుంచి ఈ రీ-రిలీజులకు అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. కొత్త సినిమాల రేంజ్ లో సెలబ్రేట్ చేస్తూ, మళ్లీ మంచి విజయాలను అందిస్తూ వచ్చారు.
మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'పోకిరి' సినిమాని రీ రిలీజ్ చేయడంతో ఈ ట్రెండ్ మొదలైందని చెప్పాలి. ఆ తర్వాత 'జల్సా', 'చెన్న కేశవ రెడ్డి', 3, 'బిజినెస్ మ్యాన్', 'సూర్య S/o కృష్ణన్', 'ఆరెంజ్', 'సింహాద్రి', 'మన్మథుడు' వంటి చిత్రాలను విశేషంగా ఆదరించారు. ఫలితంగా అవన్నీ మంచి వసూళ్ళను రాబట్టగలిగాయి. అయితే ఈ ట్రెండ్ ను క్యాష్ చేసుకోవాలని ఆ తర్వాత విడుదల చేసిన చాలా సినిమాలను జనాలు పెద్దగా పట్టించుకోలేదు.
Also Read: 2023 లో కనిపించని స్టార్ హీరోలు, వచ్చే ఏడాది మాత్రం తగ్గేదేలే!
ఈ మధ్య కాలంలో వచ్చిన 'శంకర్ దాదా MBBS', 'యోగి', 'గుండుంబా శంకర్', 'రఘువరన్ బీటెక్' వంటి రీ-రిలీజులకు ఆడియన్స్ నుంచి స్పందన కరువైంది. ఇప్పుడు లేటెస్టుగా 'అదుర్స్' సినిమాను 4K లో రీ రిలీజ్ చేసారు. 2010లో వివి వినాయక్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్టయింది. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమాని విపరీతంగా చూస్తుంటారు. కానీ రీరిలీజ్ లో మాత్రం ఈ మూవీకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. బుకింగ్స్ అంతంతమాత్రంగా ఉండటంతో కొన్ని ఏరియాల్లో షోలు కూడా క్యాన్సిల్ చేశారు.
క్రికెట్ వరల్డ్ కప్ హంగామా, కొత్త సినిమాల విడుదలలు ఉండటం, ప్రాపర్ గా రిలీజ్ చేయకపోవడంతోనే 'అదుర్స్' కు ఆదరణ దక్కలేదని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. కనీసం ఎన్టీఆర్ అభిమానులు చూసినా ఓ మోస్తరు వసూళ్లు వచ్చేవి కదా? అని ఇతర హీరోల ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి. ఆశించిన స్థాయిలో 'అదుర్స్' రీరిలీజ్ సందడి లేకపోవడానికి కారణాలు ఏంటనేది పక్కన పెడితే, ఆరంభంలో ఉన్నంత హైప్ ఇప్పుడు రీ-రిలీజులుకు ఉండటం లేదనేది అర్థమవుతుంది.
పాత సినిమాలను కొత్తగా రీ మాస్టర్ ప్రింట్లతో చూసుకోవడం అనేది ఏ హీరో అభిమానులకైనా కిక్ ఇచ్చే విషయమే. కానీ అది హీరోల బర్త్ డేస్ కో లేదా సినిమా యానివర్సరీలకు సరదాగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి చేస్తే సక్సెస్ అవుతుంది. అంతేకానీ డబ్బులు సంపాదించడానికి రీ రిలీజ్ పేరుతో బిజినెస్ చేసుకోవాలని చూస్తే మొదటికే మోసం వచ్చే పరిస్థితి వస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయినా సరే ఈ ట్రెండ్ కు ఇప్పట్లో బ్రేక్స్ వేసేలా కనిపించడం లేదు. 'అదుర్స్' తెచ్చిపెట్టిన నష్టాన్ని రికవరీ చేయటానికి 'శివాజీ' సినిమాని రీరిలీజ్ చెయ్యాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని చిత్రాలని మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తారో చూడాలి.
Also Read: ఎన్నికలను సైతం సినిమాల ప్రచారం కోసం వాడేస్తున్న టాలీవుడ్!