Hari Hara Veera Mallu: 'హరి హర వీరమల్లు' వెనుక అసలేం జరుగుతోంది?
Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. 'వకీల్ సాబ్' తర్వాత పవన్ 27వ సినిమాగా సెట్స్ మీదకు వచ్చిన ఈ ప్రాజెక్ట్, ఇంకా సెట్స్ మీదనే ఉంది. నాలుగేళ్లుగా షూటింగ్ దశలోనే ఉండటం, రీమేక్ సినిమాలకు పవన్ ప్రాధాన్యత ఇస్తుండటం, కొత్తగా కమిటైన ప్రాజెక్ట్స్ ను ముందుగా కంప్లీట్ చేస్తుండటంతో వీరమల్లుపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా దర్శకుడే ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, నిర్మాతకు డబ్బులు వెనక్కి ఇవ్వనున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
డైరెక్టర్ క్రిష్ చాలా కాలంగా 'హరి హర వీరమల్లు' సినిమా మీదనే పని చేస్తున్నారు. మధ్యలో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తో 'కొండపొలం' అనే చిన్న సినిమా చేసి, వెంటనే మళ్ళీ పవన్ కళ్యాణ్ మూవీ మీదకే వచ్చారు. కానీ ఈ సినిమా అనుకున్న విధంగా ముందుకు సాగకపోవడంతో ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది. దీని తర్వాత పవన్ కమిటైన 'భీమ్లా నాయక్', 'బ్రో' సినిమాలు మాత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఈ గ్యాప్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' OG చిత్రాలు కూడా సెట్స్ మీదకు వచ్చాయి. అందులో ఒక మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం, ఎన్నికల తర్వాత OG సినిమాకి డేట్స్ కేటాయించడంతో 'వీరమల్లు' సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు విడుదల అవుతుంది? అనేది ప్రశార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో క్రిష్ మరో ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అవుతున్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాదు నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ 'హరి హర వీరమల్లు' సినిమాలో మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తారని, ఒకవేళ అలా జరగని పరిస్థితుల్లో పవన్ డబ్బులు వెనక్కు ఇస్తారనే పుకార్లు పుట్టుకొచ్చాయి.
నిజానికి 'హరి హర వీరమల్లు' అనేది భారీ స్థాయిలో రూపొందే పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హై బడ్జెట్ ఫిల్మ్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూ. 150 - 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు - కుతుబ్ షాహీల చారిత్రక కథాంశంతో తెరకెక్కించే సినిమా కావడంతో భారీ సెట్లు వేసి, ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని నిర్మాత ఏఎమ్ రత్నం 'రూల్స్ రంజాన్' ఈవెంట్ లో చెప్పారు.
పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి, ఒకేసారి డేట్స్ అన్నీ ఇచ్చినా ఈ సినిమా చేయలేమన్నారు. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా తీసే సినిమా కాదు. భారీ సెట్స్ వెయ్యాలి. గ్రాఫిక్ వర్క్ చాలా ఉంటుంది అని చెప్పారు. గత ఏడాది చివరి నాటికి సినిమా షూటింగ్ ఫినిష్ చేసి, ఎలక్షన్స్ కంటే ముందే విడుదల చేస్తామన్నారు. కానీ అది జరగడం లేదు. అందుకే ఈ సినిమాపై ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని అనుకోవచ్చు. ఇప్పటికైతే ఈ వార్తలను ఎవరూ ఖండించలేదు. మరి త్వరలోనే వీరమల్లు సినిమా ఎప్పుడొస్తుందనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Also Read: 'CBN లక్కీ నెంబర్ 23, వ్యూహం విడుదల తేదీ 23'