Rishab Shetty: నిర్మాతల చుట్టూ తిరిగిన రిషబ్... ఎయిర్ పోర్టులోనూ రిక్వెస్టులు... 'కాంతార' తెర వెనుక కహాని!
National Film Awards 2024: 'కాంతార'కి రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ చిత్రానికి దర్శకుడూ ఆయనే. అవార్డు తెచ్చిన ఈ సినిమా అంత ఈజీగా ఓకే కాలేదు. ఆ తెర వెనుక కహాని తెలుసా?
పాన్ ఇండియా హిట్ సినిమాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ 'కాంతార' (Kantara Movie) పేరు వినబడుతుంది. రూ. 16 కోట్లతో తీసిన ఆ సినిమా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ రోజు 'కాంతార'కు ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి జాతీయ అవార్డు అందుకున్నారు (Who won the national award for best actor in 2024?). 'కాంతార'కు ఉత్తమ జనరంజక చిత్రంగా అవార్డు అందుకుంది (Did Kantara win the national award?). అయితే... ఈ సినిమా అంత ఈజీగా తెరకెక్కలేదు. ఈ కథ పట్టుకుని హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి (Rishab Shetty) నిర్మాతల చుట్టూ తిరిగారు. ఆ తెర వెనుక కహాని ఏమిటంటే...
హోంబలే ఫిలిమ్స్ కంటే ముందు...
'కాంతార'ను హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించారు. దీని కంటే ముందు పాన్ ఇండియా హిట్ 'కేజీఎఫ్' మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఆ మూవీ బడ్జెట్‌తో కంపేర్ చేస్తే 'కంతార'కు పెట్టిన ఖర్చు లెక్క కాదు. కానీ, ఈ కథ ముందు విజయ్ కిరగందూర్ దగ్గరకు వెళ్లలేదు. 'కాంతార'ను తీసుకుని రిషబ్ శెట్టి చాలా మంది నిర్మాతల దగ్గరకు వెళ్లారు. ఆ లిస్టులో కొందరు ఆయనకు స్నేహితులు కూడా! అయితే... రిషబ్ శెట్టి మార్కెట్ లెక్కల దృష్ట్యా వెనకడుగు వేశారు.
దర్శకుడిగా రిషబ్ శెట్టి ట్రాక్ రికార్డ్ బావుంది. ఆయన దర్శకత్వం వహించిన 'కిరిక్ పార్టీ' బడ్జెట్ రూ. 4 కోట్లు. ఆ సినిమా వసూళ్లు ఆల్మోస్ట్ రూ. 50 కోట్లు. దర్శకుడిగా రిషబ్ రెండో సినిమా అది. అయితే, హీరోగా రిషబ్ శెట్టి ఖాతాలో అటువంటి భారీ హిట్ కాలేదు. అందువల్ల, అప్పటికి కన్నడలో ఆయనకు ఉన్న మార్కెట్ తక్కువ కనుక బ్లాక్ బస్టర్ అయితే రూ. 10 కోట్లు వస్తాయని అంచనా.
'కేజీఎఫ్' తరహాలో 'కాంతార'ను పాన్ ఇండియా రిలీజ్ చేయాలని ప్లాన్ చేయలేదు. కన్నడ సినిమా కోసం కథ రెడీ చేశారు రిషబ్ శెట్టి. దర్శకుడిగా, హీరోగా మార్కెట్ లెక్కల ప్రకారం ఆయన సినిమా బడ్జెట్ రూ. 4 కోట్లు. మహా అయితే రూ. 5 కోట్లు. 'కాంతార' కథకు ఏడెనిమిది కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని రిషబ్ శెట్టి నిర్మాతల దగ్గర చెప్పడంతో చాలా మంది వెనకడుగు వేశారు.
ఆఖరికి ఎయిర్ పోర్టులోనూ నిర్మాతలకు రిక్వెస్టులు!
ఇక్కడ నిర్మాత పేరు చెప్పడం సబబు కాదు. అయితే, జరిగిన విషయం ఏమిటంటే... 'కాంతార' మొదలు కావడానికి ముందు బెంగళూరు ఎయిర్ పోర్టులో రిషబ్ శెట్టికి, తనకు మధ్య జరిగిన ఓ సంభాషణను ప్రముఖ యువ తమిళ నిర్మాత ఆఫ్ ది రికార్డ్ తెలుగు మీడియాకు చెప్పారు. ఆయన తీసే సినిమాలు అన్నీ తెలుగులోనూ విడుదల అవుతాయి.
అనుకోకుండా రిషబ్ శెట్టి, తమిళ నిర్మాత బెంగళూరు ఎయిర్ పోర్టులో కలిశారు. ఆ ఇద్దరి గమ్యస్థానాలు వేర్వేరు. అయితే... ఫ్లయిట్స్ బోర్డింగ్‌కి ఇంకా టైం ఉండటం వల్ల కాసేపు మాట్లాడుకున్నారు. అప్పుడు 'కాంతార' కథకు రిషబ్ శెట్టి తనకు చెప్పగా... బడ్జెట్ ఎక్కువ అని వదులుకున్నారట. రెమ్యూనరేషన్ కూడా వద్దని, బడ్జెట్ ఇస్తే సినిమా తీస్తానని రిషబ్ శెట్టి రిక్వెస్ట్ చేశారట. అయితే... కథ నచ్చినా మార్కెట్ పరంగా సేఫ్ కాదని ఆ తమిళ నిర్మాత సినిమా వదిలేసుకున్నారు. కట్ చేస్తే... హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసింది.
విడుదలకు ముందు శాటిలైట్ రైట్స్ అమ్మేశారు!
ఏడెనిమిది కోట్ల బడ్జెట్ అనుకుని దిగితే... 'కాంతార'కు పది కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయ్యింది. విడుదలకు ముందు శాటిలైట్ రైట్స్ రూ. నాలుగైదు కోట్లకు అటు ఇటుగా ఇచ్చేశారు. దాంతో బడ్జెట్ సగం వరకు రికవరీ అయ్యింది. అప్పటికి పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ లేదు. రిషబ్ శెట్టి, మిగతా టీమ్ కూడా ఈ రేంజ్ సక్సెస్ ఊహించలేదు. విడుదలైన తర్వాత అమ్మితే శాటిలైట్ ఇంకా ఎక్కువ వచ్చేది.
తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థకు లాభమే కానీ...
కన్నడలో సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న తర్వాత హైదరాబాద్ ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో కన్నడ వెర్షన్ ప్రీమియర్ వేశారు. తెలుగు సినీ ప్రముఖులు, మీడియా నుంచి మంచి రిపోర్ట్స్ వచ్చాయి. తర్వాత తెలుగు డబ్బింగ్ పూర్తి చేసి విడుదల చేశారు. అయితే... తెలుగు రాష్ట్రాల్లో సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేయడం ద్వారా గీతా ఆర్ట్స్ సంస్థకు మూడు నాలుగు కోట్ల వరకు లాభం వచ్చినట్టు సమాచారం. ఆ మాటకు వస్తే... ఇంకా ఎక్కువ లాభం వచ్చేది. సినిమా తెలుగు రైట్స్ కొనకుండా కేవలం కమీషన్ బేసిస్ మీద విడుదల చేయడంతో లాభం తగ్గింది.
పాన్ ఇండియా కోసం ప్రత్యేకంగా కథలు రెడీ చేయాల్సిన అవసరం లేదని, మన మట్టి కథను, మన కల్చర్ కథను నిజాయతీగా సినిమా చేస్తే పాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని చెప్పడానికి 'కాంతార' ఒక ఉదాహరణ. అలాగే, అవార్డుల కోసమూ ప్రత్యేకంగా సినిమా చేయాల్సిన అవసరం లేదు. అవార్డు సినిమాలు అంటూ ప్రత్యేకంగా ఉండవు. కమర్షియల్ కథల్లోనూ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇవ్వగల రోల్స్ ఉంటాయి. గత ఏడాది వచ్చిన 'పుష్ప' కావచ్చు, ఈ 'కాంతార' కావచ్చు... జనాలు మెచ్చిన సినిమాలు, అవార్డులు తెచ్చిన సినిమాలు.
Also Read: 2024 ఇయర్ ఎండ్‌లో మళ్ళీ నేషనల్ అవార్డ్స్ - నాలుగు నెలల్లో ఇంకోసారి ఎందుకు ఇస్తున్నారంటే?