Shah Rukh Khan: నేను ఎవరో తెలియాలంటే గూగుల్ చెయ్యండి - షారుఖ్ కామెంట్స్‌పై స్పందించిన Google సంస్థ
Shah Rukh Khan: ఇప్పటికే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఎన్నో ఇంటర్నేషనల్ వేదికపై తన స్పీచ్ ఇచ్చారు. తాజాగా తన గురించి తెలియనివారు గూగుల్ చేసుకోండి అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. దానిపై గూగుల్ స్పందించింది.
Shah Rukh Khan: చాలామంది సినీ సెలబ్రిటీల వల్లే ఇండియా గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. అలా దేశానికి గర్వకారణంగా నిలిచిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. ఎన్నో ఇంటర్నేషనల్ వేదికలపై ఇండియా తరపున నిలబడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు ఎస్ఆర్‌కే. తాజాగా స్విట్జర్ల్యాండ్‌లో జరిగిన 77వ లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా పాల్గొన్నారు. అక్కడ తనను పార్డో ఎల్లా కెరియారా అనే అవార్డ్‌తో సత్కరించారు. ఇక అవార్డ్ తీసుకున్న తర్వాత ఆ ఇంటర్నేషనల్ వేదికపై షారుఖ్ ఖాన్ చేసిన కామెంట్స్‌పై సెర్చ్ ఇంజన్ గూగుల్ స్పందించింది.
నా పేరు షారుఖ్ ఖాన్..
అది ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కావడంతో షారుఖ్ ఖాన్ గురించి చాలామంది తెలియదని అభిప్రాయపడ్డారు. అలా అనిపించిన వారికి ఎస్ఆర్‌కే తన స్టైల్‌లో సమాధానమిచ్చారు. ‘‘నేను ఎవరికి తెలియనో వారు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. నా గురించి గూగుల్ చేయండి. తిరిగి రండి’’ అని గర్వంగా తెలిపారు షారుఖ్. ఆ తర్వాత వెంటనే తనను తాను పరిచయం చేసుకున్నారు. ‘‘నా పేరు షారుఖ్ ఖాన్. నేను ఇండియన్ సినిమాలో పనిచేస్తాను. ఎక్కువగా హిందీలోనే చేస్తాను’’ అని చెప్పుకొచ్చారు. అయితే గూగుల్ చేయండి అంటూ షారుఖ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు స్వయంగా గూగుల్ యాజమాన్యం స్పందించింది.
👑 @iamsrk https://t.co/NpbFTCUfD2
— Google India (@GoogleIndia) August 12, 2024
కింగ్ ఖాన్..
షారుఖ్ ఖాన్‌ను ట్యాగ్ చేస్తూ ఒక కిరీటం ఎమోజీని పోస్ట్ చేసింది గూగుల్. అంటే షారుఖ్ ఖాన్‌కు కింగ్ అని గూగుల్ కూడా తేల్చేసిందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ విషయానికొస్తే.. ఇది 1946లో ప్రారంభించారు. ఇప్పటికీ సినిమాలపై ఫోకస్ చేస్తూ అవార్డులు అందిస్తున్న పాత ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఇది కూడా ఒకటి. ఇక తాజాగా జరిగిన 77 లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో 225 సినిమాలు ఫీచర్ అయ్యాయి. వాటితో పాటు 104 వరల్డ్ సినిమాలు ప్రీమియర్ అయ్యాయి. 15 కొత్త సినిమాలను కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సెలబ్రిటీలు ప్రోత్సహించారు.
అప్‌కమింగ్ మూవీపై క్లారిటీ..
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికీ తన అప్‌కమింగ్ మూవీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తను ప్రస్తుతం ‘కింగ్’ అనే మూవీలో నటిస్తున్నట్టు సమాచారం. సుజోయ్ ఘోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన అప్‌కమింగ్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షారుఖ్. ‘‘నేను గతేడాది జవాన్, డంకీ పూర్తిచేశాను. ఇప్పుడు నేను వేరే జోనర్‌లో సినిమా చేయాలనుకుంటున్నాను. దాని గురించి చెప్పాలంటే ఇది నా వయసుకు సూట్ అయ్యే సినిమా. గత ఏడేళ్లుగా ఇది చేయాలనుకుంటున్నాను. ఒకరోజు ఇదే విషయాన్ని సుజోయ్ ఘోష్‌కు చెప్తే తను నా దగ్గర ఒక కథ ఉంది అన్నాడు’’ అని బయటపెట్టారు ఎస్ఆర్‌కే.
Also Read: అతిలోక సుందరి శ్రీదేవి పుట్టినరోజు.. తిరుమలలో జాన్వీ కపూర్ - అచ్చం అమ్మలాగే!