Divi Vadthya: రవితేజ పక్కన హీరోయిన్‌గా ఛాన్స్, ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను - ‘బిగ్ బాస్’ బ్యూటీ దివి
Divi Vadthya: బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్లిన తర్వాత దివి అంటే ఎవరో చాలామంది ప్రేక్షకులకు తెలిసింది. తాజాగా తను పాల్గొన్న ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ తన మెంటర్ అని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

Divi Vadthya: సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేసే అమ్మాయిలు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారిలో దివి కూడా ఒకరు. కానీ బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా వెళ్లిన తర్వాత దివి కెరీర్ మలుపు తిరిగింది. తనను అందరూ గుర్తుపట్టడం మొదలుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఏకంగా బిగ్ బాస్ స్టేజ్‌పైనే దివికి తన సినిమాలో అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. అలా మెల్లగా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న ఈ తెలుగమ్మాయి.. హరీష్ శంకర్ తనకు ఎంత క్లోజ్ అనే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అంతే కాకుండా రవితేజ పక్కన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వచ్చినట్టే వచ్చే చేజారిందని బయటపెట్టింది.
మర్యాదగా చూసుకున్నారు
అసలు దర్శకుడు హరీష్ శంకర్ తనకు ఎప్పటినుండి పరిచయమో వివరించింది దివి. ‘‘నేను మహర్షి చేసిన తర్వాత రాబర్ట్ రిచర్డ్సన్ అనే ఆస్కార్ విన్నింగ్ కెమెరామ్యాన్ ఇండియాకు వచ్చారు. ఆయనకు ట్రాన్స్‌లేటర్ కావాలంటే వెళ్లాను. అప్పుడు చాలామంది టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, కెమెరామెన్ ఆయనను కలవడానికి వచ్చేవారు. ఆ సమయంలో హరీష్ శంకర్, బోస్, చోటా కే నాయుడు, సెంథిల్.. ఇలా చాలామంది వచ్చి ఆయనను కలవాలని రిక్వెస్ట్ చేసేవాళ్లు. వాళ్లని రాబర్ట్ కలవాలా వద్దా అని నిర్ణయించే బాధ్యత లక్కీగా నాకు దొరికింది. అప్పుడు నేను చిన్నపాటి యాక్టర్‌ను వాళ్లంతా వచ్చి నాతో మాట్లాడడం బాగుండేది. అప్పుడే హరీష్ శంకర్ ఆయన సినిమా సెట్‌కు నన్ను, రాబర్ట్‌ను పిలిచారు. అప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఒక అమ్మాయికి ఎంత మర్యాద ఇవ్వాలో అంత ఇచ్చారు’’ అంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది దివి.
ఆయన చెప్పిందే చేస్తాను..
అప్పటినుండి హరీష్ శంకర్.. తనకు ప్రతీ విషయంలో సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చింది దివి. బిగ్ బాస్‌కు వెళ్లినప్పుడు కూడా సపోర్ట్ ఇచ్చారని బయటపెట్టింది. ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్‌లో ఛాన్స్ వచ్చింది ఆయన వల్లే అని తెలిపింది. ఇప్పుడు కూడా ఒక సినిమా చేయడానికి టాక్స్ నడుస్తున్నాయని రివీల్ చేసింది. ‘‘నా కెరీర్ ప్రారంభం అవ్వక ముందు నుండి ఆయన ఉన్నారు. ఆయన చాలా బోల్డ్ మనిషి. ఎవరికీ భయపడరు. ఈ అమ్మాయితో క్లోజ్‌గా మాట్లాడితే నన్ను ఎవరైనా ఏమైనా అనుకుంటారా అని ఏముండదు ఆయనకు. ఇప్పటికీ హరీష్ శంకర్ ఇది చేయమంటే చేస్తాను. వద్దంటే చేయను. ఆయనంటే నాకు అంత గౌరవం’’ అని హరీష్ శంకర్‌తో తనకు ఉన్న బాండింగ్ గురించి తెలిపింది దివి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో తాను నటించడం లేదని, నటించకపోయినా కనీసం పవన్ కళ్యాణ్‌ను కలిస్తే బాగుండేది అని తన కోరికను బయటపెట్టింది.
రాత్రంతా పడుకోలేదు..
తాజాగా రవితేజ సినిమాలో ఒక పాత్రకు లుక్ టెస్ట్ జరిగిందని చెప్పుకొచ్చింది దివి. ‘‘రవితేజ పక్కన నాకు హీరోయిన్‌గా ఒక అవకాశం వచ్చింది. రాత్రికి రాత్రి అమ్మాయిని మార్చేశారు. అలా యాక్టర్లు మారిపోతుంటారు, అది డైరెక్టర్ల నిర్ణయం. నేను చాలా ఎమోషనల్. నాకు రవితేజ సినిమాలో అవకాశం వచ్చింది అనగానే ఆరోజు రాత్రంతా పడుకోకుండా ఏడ్చుకుంటూ నేను స్పీచ్ రాసుకున్నాను. ముందుగా ముగ్గురు అమ్మాయిలలో ఒక అమ్మాయి నేను అన్నారు. రవితేజ పక్కన నాలుగో అమ్మాయి అయినా ఓకే అనుకున్నాను. దాంతో నా కెరీర్ కూడా ముందుకెళ్తుంది అనుకున్నాను. అనుకోకుండా అది జరగలేదు’’ అని వాపోయింది దివి.
Also Read: తాత కోసం పాట పాడిన అరియానా - కంటతడి పెట్టిన మంచు విష్ణు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

