ఆ దర్శకుడు పైట జారాలి, చీర పిన్నులు తీసేయాలన్నాడు: హేమామాలిని షాకింగ్ కామెంట్స్
సీనియర్ నటి హేమామాలిని అప్పట్లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలిపారు. ఇక తాను సినిమాలు చేయబోనని వెల్లడించారు.
సీనియర్ నటి హేమామాలిని గురించి తెలియని సినీ ప్రేమికుడంటూ ఎవరూ ఉండరు. ఒకప్పుడు ‘డ్రీమ్ గార్ల్’గా అప్పటి యూత్‌లో చెరగని ముద్ర వేసుకున్నారు హేమామాలిని. వయస్సు మీదపడటం వల్ల ఇప్పుడు సినిమాలైతే తగ్గించారు. అయితే, ఆమెలో జోష్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన మనసులో మాటలను పంచుకున్నారు. అప్పట్లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా చెప్పారు. అలాగే నేటి దర్శకుల తీరును కూడా ఎండగట్టారు.
చీరకు పెట్టుకున్న పిన్ తీసేయమన్న దర్శకుడు
ఓ మూవీ షూటింగ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి హేమామాలిని మాట్లాడుతూ.. ‘‘చీర కట్టుకున్నప్పుడు నేను తప్పకుండా పిన్‌లు పెడతాను. అయితే, ఓ దర్శకుడు ఆ పిన్‌లు తీసేయాలని అన్నాడు. అలా చేస్తే పైట జారిపోతుందని చెప్పాను. దీంతో ఆ దర్శకుడు మాకు కూడా అదే కావాలని అన్నాడు’’ అని తెలిపారు. ఆయన మాటలకు తాను చాలా షాకైనట్లు హేమామాలిని అన్నారు.
‘సత్యం శివం సుందరం’లో ఛాన్స్
రాజ్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన బోల్డ్ మూవీ ‘సత్యం శివం సుందరం’లో ఫస్ట్ ఆఫర్ తనకే వచ్చిందని హేమామాలిని తెలిపారు. ‘‘దర్శకుడు రాజ్ కపూర్ నాతో మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు మీరు చేయరని తెలుసు. కానీ, ఈ మూవీకి మీరైతేనే సరిపోతారని నాకు అనిపిస్తోందని ఆయన అన్నారు. ఆ సమయంలో మా అమ్మ అక్కడే కూర్చొని ఉన్నారు. ఆ మూవీలో పాత్ర గురించి వినగానే అమ్మ అడ్డంగా తల ఊపుతూ.. ఒకే చెప్పొద్దని నాకు సైగ చేశారు. అమ్మ అలా చెప్పడంతో నేను ఆ మూవీకి నో చెప్పాను’’ అని తెలిపారు. న్యూ జనరేషన్ ఫిల్మ్‌మేకర్స్‌కు నటీనటులను మంచిగా చూపించడంపై శ్రద్ధ పెట్టడం లేదని హేమా అన్నారు. ఇకపై తాను సినిమాల్లో నటించబోనని, సినిమా అనేది ఈ రోజుల్లో సవాళ్లతో కూడుకున్నదని ఆమె తెలిపారు.
ధర్మేంద్రకు ఇప్పుడు 87 ఏళ్లు. ఇటీవల ఆయన తన భార్య హేమామాలిని, కూతుళ్లు ఇషా, అహనా డియోల్‌కు భావోద్వేగపు లేఖ రాశారు. తన వయస్సు భారం, అనారోగ్య సమస్యల వల్ల వారిపై తనకు ఉన్న ప్రేమను, గౌరవాన్ని వ్యక్తిగతంగా తెలియజేయలేకపోతున్నానని పేర్కొన్నారు. ఇటీవల సన్నీడియోల్ కొడుకు కరణ్ డియోల్ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు హేమామాలిని, ఆమె కుమార్తెలు హాజరు కాలేదు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ ధర్మేంద్ర ఈ లేఖ రాయడం గమనార్హం. ఈ నేపథ్యంలో వారి కుటుంబంలో స్పర్థలు నెలకొన్నాయనే ప్రచారం జరుగుతోంది.
చెన్నైలోని తమిళ కుటుంబానికి చెందిన హేమామాలిని.. 1960లో విడుదలైన తెలుగు సినిమా ‘పాండవ వనవాసం’తో వెండి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో నటించారు. 1968లో ఆమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. రాజ్ కపూర్‌తో కలిసి ‘సప్నో కా సౌదాగర్’ మూవీతో ఆమె హిందీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ నుంచే ఆమెకు ‘డ్రీమ్ గర్ల్’ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో హేమామాలిన బాలీవుడ్‌లోనే స్థిరపడ్డారు. ఆ తర్వాత మళ్లీ దక్షిణాది వైపు రాలేదు. చివరికి 1980లో తన కంటే పెద్దవాడైన నటుడు ధర్మేంద్రను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కూతుళ్లు ఇషా డియోల్, అహనా డియోల్‌కు జన్మనిచ్చారు. హేమామాలిని ధర్మేంద్రకు రెండో భార్య. ఆయనకు మొదటి భార్యతో సన్నీ డియోల్, బాబీ డియోల్‌తో సహా నలుగురు సంతానం ఉన్నారు.
Also Read: మీకు Project K టీ షర్ట్ ఉచితంగా కావాలా? ఇదిగో ఇలా బుక్ చేసుకోండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial