Rajamouli: అప్పుడు వర్మ, ఇప్పుడు వంగా - నా ఫేవరేట్ యాక్టర్ రణబీర్: రాజమౌళి
Rajamouli: దర్శకుడు సందీప్ వంగాపై దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రశంసల జల్లు కురిపించారు. అప్పట్లో వర్మలా ఇప్పుడు వంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారని చెప్పారు. అటు రణబీర్ తనకు ఇష్టమైన యాక్టర్ అన్నారు.
Rajamouli On Animal Movie: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక కలిసి నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. దర్శకుడు సందీప్ వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు.
అప్పుడు వర్మ, ఇప్పుడు వంగా
ఈ సందర్భంగా రాజమౌళి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాటు రణబీర్ కపూర్ పై ప్రశంసలు కురిపించారు. అప్పట్లో వర్మ లాగే, ఇప్పుడు వంగా సంచలనాలు క్రియేట్ చేయబోతున్నారని చెప్పుకొచ్చారు. “ ప్రతి ఏటా ఏంతో మంది కొత్త డైరెక్టర్లు వస్తారు. మంచి సినిమాలు తీస్తారు. చక్కటి పేరు సంపాదిస్తారు. కానీ, కొంత మంది దర్శకులు ఎప్పుడో ఒకసారి ప్రేక్షకులతో పాటు యావత్ సినిమా పరిశ్రమనే షేక్ చేస్తారు. సినిమా ఇలాగే తీయాలనే ఫార్ములాను కూడా బద్దలు కొడతారు. అలాంటి దర్శకులలో నా తరానికి చెందిన వారు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా. సినిమాను ఇలాగే తీయాలనే రూల్ ను పక్కన పెట్టి, నేను ఇలాగే సినిమా చేస్తా అనే డైరెక్టర్ సందీప్. ఆయనను చూసి గర్విస్తున్నాను. నిజానికి ‘యానిమల్’ టీజర్ చూడగానే వెంటనే సినిమా చూడాలి అనిపించింది” అని రాజమౌళి వెల్లడించారు.
నా ఫేవరేట్ నటుడు రణబీర్- రాజమౌళి
అటు ‘యానిమల్’ హీరో రణబీర్ కపూర్ పైనా రాజమౌళి ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ లో తన ఫేవరెట్ యాక్టర్ రణబీర్ అని చెప్పుకొచ్చారు. “ఫేవరేట్ బాలీవుడ్ యాక్టర్ ఎవరు? అని నన్ను అడిగితే, ఏ మాత్రం ఆలోచన చేయకుండా రణబీర్ అని చెప్పేస్తాను. నేను ఆయన సినిమాలు తక్కువగానే చూశాను. కానీ, తనలో చాలా ఇంటెన్సివ్ ఉన్నది. ఆయన సినీ కెరీర్ లో టాలెంట్ చూపించుకునే సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. ‘యానిమల్’తో ఆ లోటు తీరుతుంది. రణబీర్ ఇండస్ట్రీలో టాప్ లో ఉండబోతున్నారు” అని రాజమౌళి చెప్పారు.
‘యానిమల్’ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది.
Read Also: ఆ డ్యాన్స్ చూసి నా డ్యాన్స్ మానేశా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మనోజ్ బాజ్‌పాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply