Dimple Hayathi Vs DCP Rahul Hegde : డింపుల్‌కు ప్రాణహాని - డీసీపీ కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన లాయర్
డింపుల్ హయతి వర్సెస్ రాహుల్ హెగ్డే కేసులో ఆమె లాయర్ కొత్త విషయాలు వెల్లడించారు. ఆమెను డీసీపీ వేధించడానికి అసలు కారణం ఇదీ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే?
పార్కింగ్ విషయంలో సమస్య వస్తే ఎవరైనా పోలీస్ స్టేషనుకు వెళతారా? ట్రాఫిక్ కోన్స్ తన్నిన దానికి కేసు పెడతారా? నోటీసులు ఇప్పిస్తారా? యువ కథానాయిక డింపుల్ హయతి (Dimple Hayathi) వర్సెస్ ట్రాఫిక్ డీసీపీ, ఐపీఎస్ రాహుల్ హెగ్డే (IPS Rahul Hegde BK) కేసులో సామాన్య ప్రజలు కొందరిలో కలిగిన సందేహాలు ఇవి. ఈ కేసు వెనుక బలమైన కారణం మరొకటి ఏదో ఉండి ఉంటుందని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు. డింపుల్ హయతి న్యాయవాది పాల్ సత్యానందన్ చెప్పిన వివరాల ప్రకారం...
మూగ జీవాల విషయంలో గొడవ!
రాహుల్ హెగ్డే మూగ జీవాల పట్ల కఠినంగా వ్యవహరించారని, వాటిని హింసకు గురి చేస్తుంటే డింపుల్ హయతి వద్దని వారించారని, అందుకని ఆమెపై తప్పుడు కేసు పెట్టారని న్యాయవాది పాల్ సత్యానందన్ పేర్కొన్నారు.
డింపుల్ హయతికి ప్రాణహాని!?
డింపుల్ హయతికి ప్రాణహాని ఉందని ఆమె న్యాయవాది చెబుతున్నారు. ఆమెకు చాలా మంది నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం డింపుల్ బయటకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారని, మానసిక వ్యధకు గురి అయ్యారని పాల్ సత్యానందన్ పేర్కొన్నారు. ఆమెకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయ్యిందన్నారు. చట్టబద్ధంగా కేసును ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. డీసీపీ కారును డింపుల్ హయతి తన్నినట్లు ఎక్కడా కూడా ఫుటేజ్ లేదని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read : కోర్టుకు ఎక్కిన నరేష్ మూడో భార్య - 'మళ్ళీ పెళ్లి' విడుదలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి
డింపుల్ హయతి వర్సెస్ డీసీపీ రాహుల్ హెగ్డే కేసులో జీహెచ్ఎంసీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఎందుకంటే... బల్దియా పరిధిలోని టాఫిక్ నిర్వహణ, నియంత్రణ విధులను పోలీస్ శాఖ నిర్వర్తిస్తోంది. ఆ బాధ్యత వాళ్ళదే అయినప్పటికీ... రోడ్లు, వనరుల కల్పన మాత్రం బల్దియాదే. ట్రాఫిక్ సిగ్నల్స్ మొదలుకుని ట్రాఫిక్ కోన్స్, ప్రీ కాస్ట్ డివైడర్లను ఏర్పాటు చేసేది జీహెచ్ఎంసీ అధికారులే.
సెల్లార్‌లోకి కోన్స్ ఎవరు తీసుకు వెళ్లారు?
డింపుల్ హయతి న్యాయవాది సంధించిన ప్రశ్నల్లో రోడ్స్ మీద ఉండాల్సిన కోన్స్ అపార్ట్మెంట్ సెల్లార్‌లోకి ఎవరు తీసుకు వెళ్లారు? అని! ఆ విషయం మీద బల్దియా అధికారులను ప్రశ్నిస్తే... తమకు తెలియదని జవాబు ఇస్తున్నారు. ఆ కోన్స్, ప్రీ కాస్ట్ డివైడర్లను సెల్లార్‌లోకి తరలించడం నిబంధలకు విరుద్ధమని జీహెచ్ఎంసీ అధికారులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో ఎవరు తరలించారో తెలుసుకుని చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానాలు దాటవేస్తున్నారు. దాంతో డింపుల్ హయతి ట్వీట్స్ చేసినట్లు అధికార దుర్వినియోగం జరిగిందని ప్రజల్లో కొందరు భావిస్తున్నారు.
View this post on Instagram
తప్పుల్ని దాచలేరు! - డింపుల్ ట్వీట్స్!
'అధికారాన్ని ఉపయోగించడం ద్వారా తప్పుల్ని ఆపలేరు' అని మంగళవారం ఉదయం డింపుల్ హయతి ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా తప్పుల్ని దాచలేరని ఆమె మరో ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే అంటూ పేర్కొన్నారు. అభిమానుల ఆందోళనను అర్థం చేసుకోగలనని, ఇప్పటి వరకు తానూ ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని, లీగల్ టీం ద్వారా ఈ కేసును ఎదుర్కొంటానని ఆమె తెలిపారు.
Also Read : రామ్ సియా రామ్... 'ఆదిపురుష్'లో రెండో సాంగ్ రిలీజుకు భారీ ప్లాన్