Dharmendra - Hema Malini: 44 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న బాలీవుడ్ కపుల్ - ఫోటోలు వైరల్
Dharmendra - Hema Malini: తాము కలిసి నటించిన మొదటి సినిమా సమయంలోనే ప్రేమలో పడి 1980లో పెళ్లి చేసుకున్నారు ధర్మేంద్ర, హేమ మాలిని. ఇప్పటికీ వారి పెళ్లయ్యి 44 ఏళ్లు అవ్వగా మరోసారి ఈ జంట పెళ్లి చేసుకుంది.
Dharmendra - Hema Malini Wedding Anniversary: సినీ సెలబ్రిటీల మధ్య జరిగిన వివాహాలు ఎక్కువకాలం నిలబడవు అని ప్రేక్షకులు ఎప్పటినుండో విమర్శిస్తూనే ఉన్నారు. కానీ అవన్నీ దాటుకొని కొందరు సెలబ్రిటీలు మాత్రం ఇంకా కలిసున్నారు. అలాంటి జంటల్లో ఒకటి హేమ మాలిని, ధర్మేంద్ర జంట. వీరిద్దరికీ పెళ్లయ్యి ఇప్పటికీ 43 ఏళ్లు అయిపోయింది. తాజాగా హేమ మాలిని, ధర్మేంద్ర కలిసి తమ 44వ పెళ్లి రోజును జరుపుకున్నారు. తమ పెళ్లిరోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు హేమ మాలిని. ఈ అలనాటి జంటకు పెళ్లిరోజు విషెస్ చెప్తూ ఫ్యాన్స్ అంతా ఈ ఫోటోలను తెగ షేర్ చేసేస్తున్నారు.
ట్విటర్‌లో షేర్..
హేమ మాలిని, ధర్మేంద్ర 44వ పెళ్లిరోజును జరుపుకోవడం కోసం వీరిద్దరూ ట్రెడీషనల్‌గా రెడీ అయ్యారు. ధర్మేంద్ర.. ఒక పీచ్ కలర్ షర్ట్‌లో కనిపించగా.. హేమ మాలిని ఒక సింపుల్ శారీ కట్టుకున్నారు. పెళ్లిరోజు సందర్భంగా వీరిద్దరూ మరోసారి దండలు మార్చుకొని ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఈరోజు ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ ఫోటోలు’’ అనే క్యాప్షన్‌తో తమ ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు హేమ మాలిని. ఇక వారి కూతురు ఇషా డియోల్ కూడా ధర్మేంద్ర, హేమ మాలిని సెలబ్రేషన్‌లో పాల్గొంది. తను కూడా తన తల్లిదండ్రుల పెళ్లిరోజు సెలబ్రేషన్ ఫోటోలను షేర్ చేసింది.
More photos for you pic.twitter.com/20naRKL8gA
— Hema Malini (@dreamgirlhema) May 2, 2024
బెస్ట్ పేరెంట్స్..
‘‘వీళ్ల వల్లే నేను ఇలా ఉన్నాను. బెస్ట్ పేరెంట్స్‌కు హ్యాపీ యానివర్సరీ’’ అనే క్యాప్షన్‌తో తన తల్లిదండ్రులను ఫోటోలను షేర్ చేసింది ఇషా డియోల్. 1970లో తెరకెక్కిన ‘తుమ్ హసీన్ మే జవాన్’ సినిమాలో మొదటిసారి ధర్మేంద్ర, హేమ మాలిని కలిసి నటించారు. అది వారు కలిసి చేసిన మొదటి సినిమానే అయినా ప్రేక్షకులంతా వారి కపుల్‌కు ఫిదా అయ్యారు. కొన్నాళ్లకే ఈ ఆన్ స్క్రీన్ కపుల్.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా ప్రేమలో పడ్డారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న తర్వాత హేమ మాలిని తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఈ జంట పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
సినిమాలకు దూరం..
ఫైనల్‌గా 1980లో అడ్డంకులు అన్నీ దాటుకొని హేమ మాలిని, ధర్మేంద్ర పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు పుట్టారు. వారే ఇషా డియోల్, అహానా డియోల్. కానీ హేమ మాలినిని పెళ్లి చేసుకోవడం కంటే ముందే ధర్మేంద్రకు ఆల్రెడీ పెళ్లయ్యింది. ప్రకాశ్ కౌర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు ధర్మేంద్ర. వారిద్దరికీ ఇద్దరు కుమారులు ఉన్నారు. వారే సన్నీ డియోల్, బాబీ డియోల్. వయసు పెరగడంతో ఆరోగ్యం సహకరించక ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలిగించిన ధర్మేంద్ర.. వెండితెరపై కనిపించడం తగ్గించేశారు. చివరిగా షాహిద్ కపూర్, కృతి సనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘తేరీ బాతో మే ఐసా ఉల్ఝా జియా’లో నటించారు ధర్మేంద్ర.
Also Read: వనపర్తి గుడిలోనే ఎందుకు నిశ్చితార్థం? - అసలు విషయం చెప్పిన అదితి