Chiranjeevi: ఎన్టీఆర్ జయంతి, మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ - కొందరి కీర్తి అజరామరం... తరతరాలు శాశ్వతం...
N T Ramarao: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ ఎన్టీఆర్(NTR) జయంతి సందర్భంగా చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. కొందరి కీర్తి అజరామరం అంటూ ఆయనను కొనియాడుతూ ఎన్టీఆర్‌కు భారతరత్న సుముచితమన్నారు.
Chiranjeevi Tweet on NTR Birth Anniversary: దివంగత మాజీ సీఎం, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా నందమూరి ఫ్యామిలీ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. అంతేకాదు మరోసారి ఆయనకు భారతరత్న పురస్కారం సముచితమని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు.
"కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను" అంటూ పేర్కొన్నారు. కాగా ఎన్టీఆర్‌కు భారతరత్న రావడం అనేది నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రజల చిరకాల ఆకాంక్ష. ఇదే విషయాన్ని చిరంజీవి ఢిల్లీలోనూ ప్రస్తావించారు.
ఇటీవల జరిగిన పద్మ అవార్డ్స్ ప్రదానోత్సవం సందర్భంగా చిరంజీవి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. పద్మవిభూషణ్ అందుకున్న అనంతరం తిరిగి హైదాబాద్ వచ్చిన ఆయన బేగంపేట్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మీడియా నుంచి సీనియర్ ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రస్తావన రాగా.. ఆయన దీనికి స్పందిస్తూ.. "అవును.. ఎన్టీఆర్ గారికి భారతరత్న రావడం ఎంతైనా సముచితం. నేను కూడా మనస్ఫూర్తిగాద దీనిని అభిలాషిస్తున్నాను. ఆయనకు భారతరత్న రావాలని కోరుకుంటున్నాను" అని సమాధానం ఇచ్చారు.
కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.… pic.twitter.com/YFtWPKKW8n
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2024
Also Read: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీరా... ఇలా స్పాట్‌లో పెడితే ఎలా? దేవరకొండకు రష్మిక రిప్లై
కాగా ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీ సభ్యులంతా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. మ్యాన్ ఆప్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ఆయన అన్నయ్య నటుడు కళ్యాణ్ రామ్ కలిసి తాతకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అలాగే నందమూరి బాలకృష్ణ కూడా తన తండ్రికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని, ఆయన స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నారన్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన మొదట చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత చిత్రరంగంలోకి వచ్చారన్నారు. ఆయన అంటే నవరసాలకు అలంకారమని, నటనకు విశ్వవిద్యాలయమంటూ కొనియాడారు. సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.