Chiranjeevi: చిరంజీవికి ఏయన్నార్ అవార్డు... మోహన్ బాబు 'లెజెండరీ' వివాదానికి ఫుల్ స్టాప్ పడేనా?
ANR National Award 2024: భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని వరించింది. అయితే... ఏయన్నార్ నేషనల్ అవార్డు తనకెంతో ప్రత్యేకం అని చిరు అన్నారు. అందుకు కారణం ఏమిటంటే?
తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన కథానాయకులలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తప్పకుండా ముందు వరుసలో ఉంటుంది. ఒక దశలో బిగ్గర్ దేన్ బచ్చన్ అని ఆయన్ను బాలీవుడ్ సైతం పొగిడింది. ఇప్పుడు ఆ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఏయన్నార్ నేషనల్ అవార్డు అందుకున్నారు. దీనికి ముందుకు ఆయన్ను పద్మభూషణ్, పద్మవిభూషణ్ వరించాయి. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో ఆయన పేరు చేరింది. అయితే... ఏయన్నార్ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకం అని చెబుతున్నారు. అవార్డు ఇచ్చిన తరుణంలో మోహన్ బాబు 'లెజెండరీ' వివాదాన్ని ప్రస్తావించారు.
ఇంట గెలిచాను... రచ్చ గెలిచాను!
సుమారు పదిహేడేళ్ల క్రితం నాటి సంగతి! తెలుగు చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా వజ్రోత్సవాలను నిర్వహించింది. అందులో చిరంజీవికి 'లెజెండరీ' పురస్కారాన్ని ఇవ్వాలని పెద్దలు వేడుక నిర్వాహకులు నిర్ణయించారు. అయితే, ఆ అవార్డును చిరుకు ఇవ్వడాన్ని మోహన్ బాబు వ్యతిరేకరించారు. తాను 'లెజెండ్' కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏయన్నార్ అవార్డు వేడుకలో ఆ విషయాన్ని చిరంజీవి ప్రస్తావించారు.
''ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఓ నానుడి ఉంది. నేను రచ్చ గెలిచి, ఇప్పుడు ఇంట గెలిచానేమో అనిపిస్తుంది. మా నాన్నకు నా నటన ఇష్టమైనా సరే... నటుడిగా నేను ఎదుగుతున్న సమయంలో పొగడలేదు. ప్రేక్షకులు, సన్నిహితుల నుంచి ప్రశంసలు వచ్చినా... ఇంటిలో రాలేదు. ఓసారి అమ్మ దగ్గరకు వెళ్లి... 'ఏంటమ్మా! నాన్నగారు ఎప్పుడూ బాగుందని నా గురించి చెప్పరు' అని అడిగా. రచ్చ గెలిచినా సరే ఇంట గెలవలేదని అనిపిస్తోందని అన్నాను. అప్పుడు అమ్మ 'లేదురా! నాన్న నీ గురించి చాలా పొగుడుతారు. నా కొడుకు అదరగొట్టేశాడు' అంటారు. బిడ్డల్ని తల్లిదండ్రులు పొగిడితే ఆయు క్షీణమని, అందుకే ఏమీ అనరని చెప్పింది. ఆ ఒక్క విషయంలోనే కాదు... సినిమా పరిశ్రమలోనూ నేను తొలుత రచ్చ గెలిచాను. బయట పరిశ్రమల నుంచి ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమ (టాలీవుడ్)లో ఆ అవకాశం వజ్రోత్సవాల్లో వచ్చింది. లెజండరీ అవార్డు ప్రదానం చేశారు. అప్పుడు సంతోషం అనిపించింది. ధన్యుణ్ణి అనుకున్నా. కానీ, ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో... కొందరు (మోహన్ బాబు) హర్షించని తరుణంలో ఆ అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. ఆ రోజు ఆ అవార్డును ఓ క్యాప్సుల్ బాక్సులో పడేసి... నాకు అర్హత ఎప్పుడు వస్తుందో?ఆ టైంలో తీసుకుంటానని చెప్పా. ఆ రోజు నేను ఇంట గెలవలేదు... ఇవాళ ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డును మరొక గ్రేట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ చేతులు మీదగా అందుకున్న ఈ తరుణంలో 'నేను ఇంట గెలిచాను... రచ్చ గెలిచాను' అనిపించింది. నాగార్జున, వెంకట్ మా ఇంటికి ఈ అవార్డు గురించి చెప్పడానికి వచ్చినప్పుడు చాలా ఆనందించా'' అని చిరంజీవి చెప్పారు.
Also Read: మెగాస్టార్ చిరంజీవికి ఏయన్నార్ నేషనల్ అవార్డు - సందడి చేసిన స్టార్స్ ఎవరో చూశారా?
మోహన్ బాబు పేరును చిరంజీవి మాట వరుసకు అయినా సరే ప్రస్తావించలేదు. కానీ, ఆయన అన్నది మోహన్ బాబును అని అందరికీ అర్థం అయ్యింది. మరి, దీనిపై కలెక్షన్ కింగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: "లక్కీ భాస్కర్"పై త్రివిక్రమ్ ఫస్ట్ రివ్యూ... సినిమాలో దుమ్మురేపే హైలెట్స్ ఇవే