Sridevi's 60th Birthday: శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న బోనీ కపూర్, ఖుషీ కపూర్!
నేడు దివంగత నటి శ్రీదేవి జయంతి. ఈ సందర్భంగా ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్ మరియు ఖుషీ కపూర్ లు శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు ఉత్తరాదిని ఊపేసిన అలనాటి అందాల తార ఆమె. నేడు (ఆగస్టు 13) దివంగత నటి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె భర్త, సినీ నిర్మాత బోనీ కపూర్ మరియు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు స్మరించుకున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు.
ఆదివారం ఉదయం బోనీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీదేవితో కలిసి ఉన్న ఓ త్రోబాక్ ఫోటోని షేర్ చేస్తూ, భార్య జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దానికి "హ్యాపీ బర్త్ డే" అని క్యాప్షన్ రాసి, రెడ్ హార్ట్ ఎమోజీలను జత చేసారు. ఈ పిక్ లో బోనీ తన భార్యను ప్రేమతో కౌగిలించుకొని ఉన్నారు. ఇక జాన్వీ కపూర్ సైతం తన తండ్రి పోస్ట్ ని ఇంస్టాగ్రామ్ స్టోరీలో పంచుకోవడం ద్వారా తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
మరోవైపు, ఖుషీ కపూర్ చిన్నప్పుడు తన తల్లితో కలిసి ఉన్న త్రోబ్యాక్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీనికి "హ్యాపీ బర్త్ డే మామా" అని క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో శ్రీదేవితో పాటుగా జాన్వీ, ఖుషీలు క్యూట్ గా నవ్వుతూ కనిపించారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడు లోని శివకాశిలో జన్మించింది. ఆమె అసలు పేరు శీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీదేవి.. హీరోయిన్ గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలలో నటించి, పాన్ ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేసింది. అందం అభినయం డ్యాన్సులలో తనకు తానే సాటి అనిపించుకుంది. కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది.
తెలుగులో శ్రీదేవి హీరోయిన్ గా నటించిన చివరి మూవీ 'ఎస్.పి పరశురామ్'. 1996లో బోనీకపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నేళ్లపాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. అయితే 2012లో ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ చిత్రంతో మళ్లీ సిల్వర్ స్ర్కీన్ పై రీఎంట్రీ ఇచ్చింది. 2013లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురష్కారాన్ని స్వీకరించింది. శ్రీదేవి చివరి చిత్రం 'మామ్'. దీనికి ఆమె మరణానంతరం ఉత్తమ నటి జాతీయ అవార్డు కూడా అందుకుంది.
శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. మేనల్లుడు మోహిత్ మార్వా పెళ్లి కోసం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన నటి.. తన హోటల్ గదిలోని బాత్రూం టబ్‌లో పడి తుది శ్వాస విడిచారు. అప్పట్లో ఆమె మరణంపై మీడియాలో సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే ఆమె ప్రమాదవశాత్తు పడిపోయి మరణించినట్లుగా పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొనబడింది.
ఇక శ్రీదేవి కుమార్తెల విషయానికొస్తే, బాలీవుడ్ లో రాణిస్తున్న జాన్వీ కపూర్.. ఇటీవలే 'బవాల్' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కే 'దేవర' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. మరోవైపు ఖుషీ కపూర్ కూడా తన తల్లి సోదరి బాటలో నటిగా తెరంగేట్రం చేయబోతోంది. 'ది ఆర్చీస్' అనే వెబ్ సిరీస్ లో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాతో కలిసి నటిస్తోంది. జోయా అక్తర్ రూపొందించిన ఈ సిరీస్ త్వరలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Sridevi's 60th Birthday : శ్రీదేవిని గౌరవించిన గూగుల్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial